ఉన్నట్టుండి చేస్తున్న ఉద్యోగం పోతే ఎలా?

How To Survive And Recover After Getting Laid Off - Sakshi

ఆర్థిక మాంద్యం భయాలు మరో విడత కంపెనీలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రపంచంలోనే దిగ్గజ సంస్థలుగా పిలుచుకునే గూగుల్, ఫేస్‌ బుక్, అమెజాన్‌ అనే కాదు.. చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఐటీ, ఇతర రంగాల్లోని కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. భారత్‌లో అమెజాన్, ట్విట్టర్‌ ఇప్పటికే కొంత మంది ఉద్యోగులను ఇంటికి పంపించేశాయి.

ప్రైవేటు రంగంలో ఉద్యోగానికి భద్రత తక్కువే. పని చేయించుకునే సంస్థలు, ప్రతికూల పరిస్థితుల్లో నిర్దాక్షిణ్యంగా సాగనంపుతాయి. కనుక ఎవరికి వారు తమవంతుగా భద్రత కల్పించుకోవాల్సిందే. ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైతే ఎలా నెగ్గుకురావాలో ప్రణాళిక ఉండాలి. అందుకు ముందు నుంచే సన్నద్ధమై, దానికంటూ ఓ బడ్జెట్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండగలరు. ఉపాధి కోల్పోయినప్పుడు మన ముందున్న మార్గాలేంటి? ముందస్తు సన్నాహేలేంటన్నది తెలియజేసే కథనమే ఇది.

వ్యయాలపై నియంత్రణ 
కనీసం మీ వద్ద 3–4 నెలల అవసరాలు, రుణ ఈఎంఐల చెల్లింపులకు సరిపడా ఉంటే ఏమాత్రం ఆందోళన అక్కర్లేదు. అప్పుడు ఉన్న వనరులను జాగ్రత్తగా వినియోగించుకునే ప్రణాళిక ఉంటే సరిపోతుంది. అంత మేర లేకపోతే అప్పుడు ప్రత్యామ్నాయాలను చూడాలి. మన ఆర్జన ఆగినా, రుణానికి చెల్లింపులు చేస్తూనే ఉండాలి. నెలవారీ ఇంటి అద్దె, మొబైల్, డిష్‌ బిల్లుల విషయంలో రాజీపడలేరు. కనుక ఇతర వ్యయాలపై నియంత్రణ ఒక్కటే మార్గం. అందుబాటులో ఉన్న వనరులు ఎన్ని, దాంతో ఎన్ని నెలలు నెట్టుకురావచ్చన్న అంచనాకు రావాలి. బయట రెస్టారెంట్లలో తినడాలు, పర్యటనలు, సెలవుల్లో ఊర్లకు వెళ్లడాన్ని వాయిదా వేసుకోవాలి. వ్యక్తిగత వాహనాన్ని ఇంట్లోనే  పెట్టేసి ప్రజా రవాణాను వినియోగించుకోవచ్చు. వారాంతపు పార్టీలకు విరామం పలకాలి. సినిమాల కోసం థియేటర్లకు వెళ్లడం మానేయాలి. మరీ కష్టంగా ఉంటే పెట్టుబడులను సైతం నిలిపివేసుకోక తప్పదు.

పెట్టుబడుల ఉపసంహరణ – రుణ మార్గం
ఉద్యోగం పోయిందని చెప్పి కంగారుగా పెట్టుబడులు అన్నింటినీ వెనక్కి తీసుకోవద్దు. సిప్‌ ద్వారా మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేస్తున్న వారు ముందుగా రెండు నెలల అవసరాలకు సరిపడా వెనక్కి తీసుకోవాలి. బ్యాంకులో ఎఫ్‌డీ ఉంటే దాన్ని రద్దు చేసుకోవడం తప్పేమీ కాదు. ఆర్జన ఉండి, నెలవారీ చెల్లింపులు చేయగలిగినప్పుడే రుణాలు తీసుకోవడం సరైనది అవుతుంది. ఆర్జన నిలిచిపోయిన సమయాల్లో కొత్తగా రుణం తీసుకోకుండా ఉండడమే మెరుగైన మార్గం అవుతుంది. కానీ, పొదుపు లేనప్పుడు, మరో మార్గం లేకపోతే చివరిగా రుణాన్ని తీసుకోవడాన్ని పరిశీలించొచ్చు. ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బంగారంపై తక్కువ వడ్డీకే రుణం లభిస్తుంది. దీనిపై నెలవారీగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. వీటి గడువు ఏడాది, రెండేళ్లు ఉంటుంది. గడువు ముగిసిన రోజున అసలు చెల్లించడం లేదంటే తిరిగి అంతే కాలానికి రెన్యువల్‌ చేసుకోవచ్చు. జీవిత బీమా పాలసీపైనా రుణ సదుపాయం పొందొచ్చు. దీనిపైనా వడ్డీ రేటు తక్కువే. ఒక నెలపాటు ఉపాధి లేని వారు ఈపీఎఫ్‌ నిధి నుంచి 75 శాతాన్ని ఉపసంహరించుకోవచ్చు. తిరిగి ఉద్యోగం లభించిన తర్వాత పాత ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం అయితే రెండు నెలల పాటు ఉపాధి లేకుండా ఉంటే ఈపీఎఫ్‌ నిధి నుంచి మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పించే వారు. అందుబాటులోని మార్గాల్లో తమకు ఏది అనుకూలమైనదో నిర్ణయించుకుని ముందుకు వెళ్లాలి. 

బీమా రక్షణ అవసరం
జాబ్‌ లాస్‌ ఇన్సూరెన్స్‌ అంటూ ఒకటి ఉందని మెజారిటీ ఉద్యోగులకు తెలియని విషయం. కేవలం కొన్ని కంపెనీలే వీటిని ఆఫర్‌ చేస్తున్నాయి. ఇందులో చాలా పరిమితులు ఉంటాయి. రుణ చెల్లింపుల బాధ్యతలు ఎక్కువగా ఉన్న వారికి ఇవి అనుకూలం. ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన సందర్భాల్లో మూడు నెలల ఈఎంఐలకు సరిపడా చెల్లింపులు చేస్తాయి. ఇలా చెల్లించే మొత్తం అప్పటి వరకు పొందిన నెలవారీ వేతనంలో 50 శాతం మించకుండా ఉంటుంది. ఈ పాలసీ వార్షిక ప్రీమియం తాము పొందే వేతనంలో 5 శాతంలోపు ఉంటేనే తీసుకోవాలి. అంతకుమించి ప్రీమియం ఉంటే అది లాభదాయకం కాదు. ఇతర పాలసీలకు అనుబంధంగాం వీటిని బీమా కంపెనీలు ఆఫర్‌ చేస్తున్నాయి. ప్రమాదం కారణంగా శాశ్వత, పాక్షిక అంగవైకల్యానికి గురై ఉద్యోగం చేయలేని పరిస్థితి ఏర్పడిన సందర్భాల్లోనూ ఇవి చెల్లింపులు చేస్తాయి.  

ఈ విషయంలో జాగ్రత్త 
జాబ్‌ లాస్‌ ఇన్సూరెన్స్‌లో ఉన్న ప్రధాన ప్రతిబంధకం.. కంపెనీ తొలగించిన సందర్భాల్లోనే వీటి కింద పరిహారం లభిస్తుంది. ఈ ప్లాన్లు ఆదరణకు నోచుకోకపోవడానికి ఇదే ముఖ్య కారణమని చెప్పుకోవాలి. కానీ, స్వచ్చందంగా ఉద్యోగం మానేసే వారు ముందుగానే సన్నద్ధమై ఆ పనిచేయవచ్చు. ఉన్నట్టుండి కంపెనీ తొలగించినప్పుడే కదా బీమా అవసరం ఏర్పడేది. మురో ముఖ్యమైన అంశం.. పనితీరు బాగాలేదని చెప్పి తొలగించినట్టయితే పరిహారానికి అర్హత లభించదు. కంపెనీల మధ్య విలీనం, కొనుగోలు కారణంగా తప్పించినప్పుడు కూడా బీమా కంపెనీలు పరిహారాన్ని తిరస్కరిస్తున్నాయి. పాలసీ తీసుకునే ముందు షరతులు, నియమ, నిబంధనలు, మినహాయింపులు అన్నీ చదివి తెలుసుకోవాలి. కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించిందనే దానికి ఆధారంగా ఎలాంటి డాక్యుమెంట్‌ లేకపోయినా, పరిహారం లభిస్తుందా? అన్నది కనుక్కోవాలి. కాంట్రాక్టు ఉద్యోగులు, స్వయం ఉపాధిలో ఉన్న వారికి ఈ పాలసీలు ఇవ్వరు. ఆయా అంశాల్లో నిపుణుల సూచనలు అవసరం.  

ఈఎస్‌ఐసీ బీమా.. 
సంఘటిత రంగంలో పనిచేస్తూ, ఈఎస్‌ఐసీ కిందకు వచ్చే వారికి రాజీవ్‌ గాంధీ శ్రామిక్‌ కల్యాణ్‌ యోజన (ఆర్‌జీఎస్‌కేవై) పథకం ఒకటి ఉంది. దీని కింద ఉపాధిని కోల్పోయిన వారికి రెండేళ్లపాటు పరిహారం లభిస్తుంది. అప్పటి వరకు పొందిన వేతనంలో 50 శాతం ఏడాది పాటు, 13వ నెల నుంచి 24వ నెల వరకు 25 శాతం చొప్పున చెల్లిస్తారు. అదే కాలంలో ఈఎస్‌ఐ హాస్పిటల్స్, డిస్పెన్సరీల్లో ఉచిత వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయి. తన తప్పిదం లేకుండా ఉద్యోగం నుంచి తొలగింపునకు గురైన వారు 30 రోజుల్లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలి. రూ.21వేల వేతనంలోపు వారికే ఈఎస్‌ఐ సదుపాయం పరిమితం. ఇంతకుమించి వేతనం ఉన్న వారు ప్రత్యామ్నాయాలు చూసుకోవాల్సిందే.

వీటిని మిస్‌ కాకూడదు 
కష్టకాలంలో రుణ ఈఎంఐలను చెల్లించకపోతే, అది వ్యక్తిగత రుణ చరిత్రలో పెద్ద మచ్చగా మిగిలిపోతుంది. భవిష్యత్తులో రుణం లభించడం కష్టంగా మారుతుంది. ఒకవేళ వచ్చినా, అధిక రుణ రేటును చెల్లించాల్సి రావచ్చు. అందుకుని ఈఎంఐ చెల్లింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపివేయకూడదు. అలాగే, బీమా పాలసీల ప్రీమియం చెల్లింపుల్లోనూ విఫలం కావద్దు. ఒకవేళ పెట్టుబడులకు సంబంధించి ఆటోడెబిట్‌ ఇన్‌స్ట్రక్షన్‌ ఇచ్చి ఉంటే వాటిని వెంటనే నిలిపివేయడం సరైనది.

ఇదీ ఒక అవకాశమే 
ఉపాధి లేనప్పుడు చేతిలో బోలెడంత సమయం ఉంటుంది. దీన్ని ఒక అవకాశంగా తీసుకుని, తమ నైపుణ్యాలను మరింత పెంచుకునే మార్గాలను చూడొచ్చు. దీనివల్ల భవిష్యత్తులో మరింత వేతనంతో కూడిన అవకాశాలను సొంతం చేసుకోవడమే కాకుండా, ఇతరులతో పోలిస్తే మెరుగైన వృద్ధిని చూడగలరు. ఆర్జన ఆగిందని చెప్పి, ఆందోళనతో ఉండిపోకూడదు. అవకాశాలను వెతుక్కోవాలి. అప్పటి వరకు తాము పనిచేస్తున్న రంగంలోని పని పరిస్థితులు నచ్చని వారికి.. ఉద్యోగం కోల్పోయినప్పుడు ఇతర నైపుణ్యాలతో వేరే రంగంలోని ఉపాధి అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. 

అత్యవసర నిధి 
ప్రైవేటు రంగంలో పనిచేసే వారికి ఉద్యోగ భద్రత ఉండదు. ఊహించని విధంగా ఎప్పుడైనా ఉద్యోగం కోల్పోయినా.. లేదా నచ్చక మానేసినా అత్యవసర నిధి ఆదుకుంటుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలకు సరిపడా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక సలహాదారులు తరచూ సూచించేంది ముందు చూపుతోనే. దీన్ని ఆచరణలో పెట్టిన వారు నిశ్చితంగా ఉండొచ్చు. ప్రతికూల పరిస్థితులను సులభంగా అధిగమించొచ్చు. అత్యవసర నిధిని లిక్విడ్‌ ఫండ్స్‌ లేదంటే బ్యాంకు ఎఫ్‌డీల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. అత్యవసర నిధి ఆరు నెలలు లేదా ఏడాది అవసరాలకు సరిపడా ఉండాలన్నది కేవలం ఒక సాధారణ సూత్రమే. ఆర్థిక బాధ్యతలు అందరికీ ఒకే విధంగా ఉండవు. ఎంత కాలం అవసరాలకు సరిపడా సమకూర్చుకోవాలన్నది వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులను బట్టే ఆధారపడి ఉంటుంది. ఉద్యోగం కోల్పోయిన సమయంలో అత్యవసర నిధిని వివేకంగా ఖర్చు చేయడం కూడా అవసరం. ఎందుకంటే తిరిగి మళ్లీ ఉద్యోగం సంపాదించి, కుదురుకోవడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ఇలా ఖర్చు చేసిన మేర, తిరిగి ఉద్యోగం పొందిన తర్వాత సమకూర్చుకోవడం అంతే ముఖ్యం.

ఆదాయ మార్గాలు 
ఉద్యోగం కోల్పోయినప్పుడు సహజంగా తిరిగి ఉపాధి కోసం అన్వేషణ మొదల పెడుతుంటారు. మరో ఉపాధి లభించేంత వరకు రోజులు వృథా కాకుండా, తాత్కాలిక పనిలో అయినా కుదరడం మంచి నిర్ణయం అవుతుంది. దీనివల్ల కుటుంబ వ్యయాలకు ఎంతో కొంత సమకూర్చుకోవచ్చు. ఈ కామర్స్, రిటైల్‌ రంగంలో తాత్కాలిక ఉపాధి అవకాశాలను పొందొచ్చు. నైపుణ్యాలు ఉండి, తక్కువ వేతనానికి పనిచేస్తానంటే ఆర్థిక సంక్షోభ సమయాల్లో కొన్ని కంపెనీలు ఉపాధి కల్పిస్తుంటాయి. అలాంటివి మార్గాలను అన్వేషించొచ్చు. తక్కువ వేతనానికి ఎందుకు చేరాలి? మంచి ఉద్యోగమే చూసుకుందాం! అని కాకుండా, మంచి ఉద్యోగ ఆఫర్‌ను గుర్తించేంత వరకు ఇలాంటి సంస్థల్లో చేరిపోవచ్చు. తమ నైపుణ్యాలకు అనుగుణంగా ఏదో ఒక తాత్కాలిక ఉపాధి పొందడం నేడు అంత కష్టమైన పనికాదు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌  
ముందే అనుకున్నట్టు ప్రైవేటు రంగంలో ఎప్పుడైనా ఉద్యోగం పోవచ్చు. మెరుగైన వేతనం, పని పరిస్థితుల కోసం సంస్థను మార్చొచ్చు. ఇలా తరచూ కంపెనీలను మార్చే వారికి ఆయా సంస్థలు అందించే గ్రూప్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌పైనే ఆధారపడడం అంత సురక్షితం అనిపించుకోదు. సంస్థను బట్టి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రయోజనాలు, కవరేజీ భిన్నంగా ఉంటాయి. కొన్ని సంస్థలు అసలు హెల్త్‌ ఇన్సూరెన్స్‌నే ఆఫర్‌ చేయడం లేదు. ఒక ఉద్యోగి వ్యక్తిగత ఆరోగ్య అవసరాల గురించి కంపెనీలకు అవగాహన ఉండదు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా దీర్ఘకాల వ్యాధులు, జీవనశైలి వ్యాధులు ఉండొచ్చు. లేదంటే తమ కుటుంబంలో ఈ విధమైన వ్యాధుల చరిత్ర ఉండొచ్చు. అలాంటి వారి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ అవసరాలు ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంటాయి. కనుక కంపెనీలు అందించే గ్రూప్‌ హెల్త్‌ ప్లాన్‌తో సంబంధం లేకుండా.. ప్రతి ఉద్యోగి అవివాహితులు అయితే ఇండివిడ్యువల్, పెళ్లయిన వారు ఫ్యామిలీ ఫ్లోటర్‌ ప్లాన్‌ తీసుకోవాలి. ఇలా తీసుకునే ప్లాన్‌ తమ అవసరాలు అన్నింటినీ తీర్చే విధంగా జాగ్రత్తపడాలి.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top