Income Tax Return: రిటర్నులకు ఫినిషింగ్‌ టచ్‌!

How to Revise your Income Tax Return - Sakshi

ఆదాయపుపన్ను రిటర్నుల దాఖలు గడువు డిసెంబర్‌ 31 తో ముగిసింది. జూలైతోనే ముగిసిన గడువును.. కరోనా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిసెంబర్‌ చివరి వరకు పొడిగించింది. దీంతో చాలా మంది డిసెంబర్‌లో రిటర్నులు దాఖలు చేశారు.

రిటర్నులు దాఖలుతో బాధ్యత ముగిసిందని అనుకోవద్దు. ఆ తర్వాత తమ వైపు నుంచి దృష్టి పెట్టాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. చివరి నిమిషంలో వేయడం వల్ల అందులో తప్పులు దొర్లి ఉంటే వెంటనే రివైజ్డ్‌ రిటర్నులు వేసుకోవాలి. ఈ వెరిఫై చేస్తేనే వేసిన రిటర్నులు చెల్లుబాటు అవుతాయి. ఇలాంటి ముఖ్యమైన అంశాల గురించి వివరించే కథనమే ఇది..  

ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై ఐటీఆర్‌ దాఖలు చేయడం ప్రాథమికంగా చేయాల్సిన పని. తర్వాత ఆ రిటర్నులను ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మీరే దాఖలు చేశారనడానికి నిదర్శనం ఏమిటి? అందుకనే ధ్రువీకరణ ప్రక్రియ. దాంతో ఆ రిటర్నుల్లో పేర్కొన్న సమాచారానికి మీరు బాధ్యత వహిస్తున్నట్టు అవుతుంది. గతేడాది కొత్త ఈ ఫైలింగ్‌ పోర్టల్‌ తీసుకురావడం తెలిసిందే. ఎన్నో సాంకేతిక సమస్యలు వెక్కిరించడంతో పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది.

డిసెంబర్‌ చివరి వారంలో హడావుడిగా రిటర్నులు వేసిన వారు కూడా ఉన్నారు. కనుక ఒకసారి రిటర్నులు ధ్రువీకరించినదీ, లేనిదీ చూసుకోవాలి. వెరిఫికేషన్‌ చేయని రిటర్నులు చెల్లవు. రిటర్నులు సమర్పించిన తేదీ నుంచి 120 రోజుల్లోపు ధ్రువీకరించేందుకు సమయం ఉంటుంది. అక్‌నాలెడ్జ్‌మెంట్‌ పత్రం లేదా ఫామ్‌–5 పత్రంపై (ఆదాయపన్ను శాఖ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని) సంతకం చేసి ఆ కాపీని పోస్ట్‌ ద్వారా ఆదాయపన్ను శాఖ, బెంగళూరు కార్యాలయానికి పంపించాలి. కొరియర్‌ ద్వారా పంపకూడదు. భౌతికంగా చేసే ధ్రువీకరణ ఇది...  

ఇలా కాకుండా ఆన్‌లైన్లో ఈ వెరిఫై చేసుకోవచ్చు. నెట్‌ బ్యాంకింగ్‌ నుంచి లేదంటే ఆధార్‌ ఓటీపీ ద్వారా, బ్యాంకు లేదా డీమ్యాట్‌ ఖాతా నంబర్‌ సాయంతోనూ వెరిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. వీటిల్లో మీకు నచ్చిన ఆప్షన్‌ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు యూజర్‌ మొబైల్‌కు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ వస్తుంది. ఈ కోడ్‌ లేదా ఓటీపిని ఈఫైలింగ్‌ పోర్టల్‌పై ఎంటర్‌ చేసి, సబ్మిట్‌ కొట్టడంతో ఈ వెరిఫికేషన్‌ పూర్తవుతుంది.

వెరిఫై చేసినట్టు సమాచారం కూడా వస్తుంది. ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంలను ఉపయోగించుకుని ఓటీపీ జనరేట్‌ చేసుకోవడం ద్వారా ఈవెరిఫై చేయవచ్చు. సదరు బ్యాంకులో ఖాతా ఉండి, ఖాతాకు పాన్‌ నంబర్‌ అనుసంధానించి ఉంటే సరిపోతుంది. సెక్షన్‌ 44ఏబీ కింద ఖాతాలను ఆడిట్‌ చేయాల్సి అవసరం ఉన్న వారు తప్పనిసరిగా రిటర్నులు దాఖలు చేసిన వెంటనే.. తమ డిజిటల్‌ సిగ్నేచర్‌ను ఉపయోగించి ధ్రువీకరించాల్సి ఉంటుంది.

పన్ను రిటర్నులు వేసిన 120 రోజులకీ వెరిఫై చేయకపోతే ముందు ఈఫైలింగ్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయ్యి సరైన కారణాన్ని తెలియజేస్తూ జరిగిన ఆలస్యానికి క్షమాపణ తెలియజేయాలి. మీ అభ్యర్థనను ఆదాయపన్ను శాఖ మన్నిస్తే.. అప్పుడు రిటర్నులు ఈ వెరిఫై చేసుకునేందుకు అవకాశం తిరిగి లభిస్తుంది. లేదంటే  మీ రిటర్నులను దాఖలు చేయనట్టుగా ఐటీ శాఖ భావిస్తుంది. అప్పుడు సకాలంలో రిటర్నులు వేయనందుకు చట్టప్రకారం అన్ని చర్యలకు బాధ్యత వహించాలి. ఆలస్యపు ఫీజు, చెల్లించాల్సిన పన్ను ఉంటే ఆ మొ త్తంపై నిర్ణీత గడువు తేదీ నుంచి వడ్డీ చెల్లించాలి.  

రిటర్నుల్లో తప్పులను గుర్తిస్తే..?
ఐటీఆర్‌ దాఖలు చేశారు. ధ్రువీకరించడం కూడా ముగిసింది. కానీ ఆదాయం, మినహాయింపులను పేర్కొనడం మర్చిపోయారనుకోండి. అప్పుడు సవరించిన రిటర్నులు దాఖలు చేసుకునేందుకు అవకాశం ఉంది. అది కూడా రిటర్నులను ఆదాయపన్ను శాఖ ప్రాసెస్‌ చేయక ముందే చేసుకోవాలి. ఇందుకు ప్రత్యేకంగా వేరొక ఫామ్‌ ఉండదు. ఈ ఫైలింగ్‌ పోర్టల్‌పై ఒరిజినల్, రివైజ్డ్‌ అనే ఆప్షన్లు ఉంటాయి. ‘రివైజ్డ్‌ రిటర్న్‌’ ఆప్షన్‌ ఎంపిక చేసుకుని, ముందు దాఖలు చేసిన మాదిరే మొదటి నుంచి ప్రక్రియ అనుసరించాలి.

ఒరిజినల్‌ ఐటీఆర్‌ ఈ ఫైలింగ్‌ దాఖలు చేసిన తేదీ, అక్‌నాలెడ్జ్‌మెంట్‌ నంబర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత అసెస్‌మెంట్‌ సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందుగానే రివైజ్డ్‌ రిటర్నుల ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. 2020–21 సంవత్సరానికి 2021–22 అసెస్‌మెంట్‌ సంవత్సరం అవుతుంది. కనుక  2021 డిసెంబర్‌ 31ని గడువుగా అర్థం చేసుకోవాలి. ఆలోపే ఐటీఆర్‌ అసెస్‌మెంట్‌ను ఆదాయపన్ను శాఖ పూర్తి చేస్తే గడువు ముగిసినట్టుగా అర్థం చేసుకోవాలి. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమలవుతుంది.  

2021–22 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి సవరించిన రిటర్నుల దాఖలు గడువును ఆదాయపన్ను శాఖ 2022 మార్చి 31 వరకు పొడిగించిన విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఈ గడువులతో సంబంధం లేకుండా.. మీరు దాఖలు చేసిన రిటర్నులను ఐటీ శాఖ ప్రాసెస్‌ చేసి సెక్షన్‌ 143(1) కింద ఇంటిమేషన్‌ మెయిల్‌ పంపినట్టయితే గడువు ముగిసిపోయినట్టుగానే పరిగణించాలి. దాంతో రిటర్నులను సవరించుకోలేరు. సాధారణంగా రిటర్నులు దాఖలు చేసి, వెరిఫై చేసిన తర్వాత.. 10–30 రోజుల్లోపే ఆదాయపుపన్ను శాఖ ప్రాసెస్‌ చేసేస్తుంది.

అందుకని రిటర్నులు దాఖలు చేసిన వారు ఆ తర్వాత వారం వ్యవధిలోపే మరొక్క సారి అన్నింటినీ క్షుణంగా సరిచూసుకోవడం మంచిది. రివైజ్డ్‌ రిటర్నులు వేసుకునేందుకు, ఆలస్యంగా రిటర్నులు దాఖలు చేసుకునేందుకు సాధారణంగా డిసెంబర్‌ 31 గడువుగా ఉంటుంది. కనుక ఆలస్యంగా రిటర్నులు వేసే వారికి రివైజ్‌ చేసుకునేందుకు తగినంత వ్యవధి ఉండకపోవచ్చు. ఆదాయపన్ను శాఖ ప్రాసెస్‌ చేయక ముందు ఎన్ని సార్లు అయినా రివైజ్డ్‌ రిటర్నులు ఫైల్‌ చేసుకోవచ్చు. తాజాగా దాఖలు చేసిన ఐటీఆర్‌ను ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకుంటుంది. అవకాశం ఉంది కదా అని చాలా సార్లు రివైజ్డ్‌ రిటర్నులు వేశారనుకోండి.. అప్పుడు ఆదాయపన్ను శాఖ సందేహంతో మీ ఐటీఆర్‌ను స్క్రూటినీ చేయవచ్చు.  

రిఫండ్‌ సంగతిదీ..
ఆదాయపుపన్ను రిటర్నులను దాఖలు తర్వాత, ఐటీ శాఖ వాటిని ప్రాసెస్‌ చేసి 143 (1) ఇంటిమేషన్‌ ఇవ్వడం పూర్తయి, అందులో ఏ తప్పులూ లేకపోతే రిటర్నుల ప్రక్రియ సంపూర్ణంగా ముగిసినట్టే. చివరిగా ఒకవేళ చెల్లించాల్సిన దానికంటే ఎక్కువ పన్ను చెల్లించి ఉంటే రిఫండ్‌కు అర్హత ఉంటుంది. రిఫండ్‌ స్టేటస్‌ ఏంటన్నది ఐటీ శాఖ ఈ ఫైలింగ్‌ పోర్టల్‌లో లాగిన్‌ అయిన తర్వాత డాష్‌ బోర్డుపై కనిపిస్తుంది. అదనంగా ఎన్‌ఎస్‌డీఎల్‌ పోర్టల్‌లోనూ చెక్‌ చేసుకోవచ్చు. https://tin.tin. nsdl.com/oltas/refund-status.html. ఈ లింక్‌ను ఓపెన్‌ చేసి పాన్‌ వివరాలు ఇవ్వడం ద్వారా తెలుసుకోవచ్చు. ఫేస్‌లెస్‌ ప్రాసెసింగ్‌ వచ్చిన తర్వాత రిఫండ్‌లు పన్ను చెల్లింపుదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతున్నాయి. 143(1) ఇంటిమేషన్‌ వచ్చిన 15 రోజుల్లోపే రిఫండ్‌ కూడా వచ్చేస్తుంది.

పలు కారణాల వల్ల ఆలస్యం అయితే, బ్యాంకు ఖాతా వివరాలు (అకౌంట్‌ నంబర్‌/ఐఎఫ్‌ఎస్‌ నంబర్‌ తదితర) సరిగా లేకపోవడం వల్ల పెండింగ్‌లో ఉంటే అప్పుడు నూతన ఈఫైలింగ్‌ పోర్టల్‌కు వెళ్లి సర్వీస్‌ రిక్వెస్ట్‌ ఆప్షన్‌ ద్వారా వివరాలను సరిచేసుకోవచ్చు. రిఫండ్‌లు ఆలస్యమైనా ఆందోళన చెందక్కర్లేదు. నిర్ణీత గడువు దాటిన తర్వాత నుంచి ఆ మొత్తంపై ప్రతీ నెలా 0.5 శాతం మేర వడ్డీని ఐటీ శాఖ చెల్లిస్తుంది. ఇలా అందుకునే వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుందని మర్చిపోవద్దు. ఈ మొత్తాన్ని సంబంధిత ఆర్థిక సంవత్సరం ఆదాయం కింద రిటర్నుల్లో పేర్కొనాల్సి ఉంటుంది.   

పన్ను కోసం డిమాండ్‌ నోటీసు వస్తే?
పన్ను రిటర్నుల్లో తప్పులు, పొరపాట్లు చేయవచ్చు. ఆదాయపన్ను శాఖ రిటర్నులను ప్రాసెస్‌ చేసే సమయంలో అందులోని సమాచారం మధ్య అంతరాలు, పోలికల్లేమిని గుర్తిస్తుంది. ఆ వివరాలను 143(1) ఇంటిమేషన్‌ నోటీసులో పేర్కొంటుంది. పన్ను చెల్లించాల్సి ఉంటే ఆ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్‌ చేస్తుంది. ఐటీ శాఖ పేర్కొన్న సమాచారంతో మీరు ఏకీభవిస్తే ఆ మేరకు పన్ను చెల్లించేస్తే సరిపోతుంది.

అలా కాకుండా మీరు ఏదైనా మినహాయింపును పేర్కొనడం మర్చిపోయిన కారణంగా ఆ అంతరం తలెత్తి ఉంటే? అప్పుడు రెక్టిఫికేషన్‌ రిక్వెస్ట్‌ దాఖలు చేయాలి. ఆదాయపన్ను శాఖ లెక్కలతో ఏకీభవించడం లేదని లేదా రిటర్నుల్లో పొరపాటు చేశానంటూ అందులో పేర్కొనాలి. పన్ను అధికారులు ఆరు నెలల్లోగా స్పందిస్తారు. నాలుగు రకాల రెక్టిఫికేషన్‌ రిక్వెస్ట్‌లు ఉన్నాయి. రిటర్నుల్లో సరిపోలని సమాచారం అసలు ఏంటన్న దాని ఆధారంగా వీటిల్లో ఒకటి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top