ఫండ్‌ పనితీరు మదింపు ఇలా.. | Here are some key steps to help you track the right mutual fund | Sakshi
Sakshi News home page

ఫండ్‌ పనితీరు మదింపు ఇలా..

Feb 24 2025 8:59 AM | Updated on Feb 24 2025 8:59 AM

Here are some key steps to help you track the right mutual fund

భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందుతున్న పెట్టుబడి సాధనాల్లో మ్యుచువల్‌ ఫండ్స్‌ కూడా ఉన్నాయి. 2023లో అద్భుతంగా రాణించిన మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ 2024లోనూ అదే తీరును కొనసాగించడంతో నిర్వహణలోని అసెట్స్‌ పరిమాణం ఏకంగా రూ.17 లక్షల కోట్లు పెరిగింది.  సరైన ఫండ్‌ ఎంపికపై ఎలాగైతే ఆలోచించి నిర్ణయం తీసుకుంటారో, అలాగే  ఫండ్‌ పనితీరును మదింపు చేయడంపై కూడా ఇన్వెస్టర్లు తప్పక దృష్టి పెట్టాలి. ఇందుకు ఉపయోగపడే కొన్ని కీలక కొలమానాల గురించి తెలుసుకుందాం.  

రిస్క్‌కు తగ్గ రాబడులు: రాబడులు ముఖ్యమే అయినప్పటికీ, ఇవి పెట్టుబడి ప్రస్థానంలో ఒక భాగం మాత్రమే. రిస్క్‌ అడ్జస్టెడ్‌ రిటర్నులను అందించగలిగే సామర్థ్యమే, ఫండ్‌ సిసలైన పనితీరును మదింపు చేసేందుకు కీలకాంశంగా ఉంటుంది. తీసుకుంటున్న రిస్క్‌కు తగ్గట్లుగా ఫండ్‌ ఎంత రాబడిని అందిస్తున్నదీ తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిస్క్‌ అడ్జస్టెడ్‌ రిటర్నులను మదింపు చేసేందుకు విరివిగా ఉపయోగించే సాధనాల్లో షార్ప్‌ రేషియో కూడా ఒకటి. తీసుకున్న ప్రతి యూనిట్‌ రిస్క్‌కు ఫండ్‌ ఎంత ఎక్కువగా రాబడిని అందించినది తెలుసుకునేందుకు ఈ నిష్పత్తి ఉపయోగపడుతుంది. షార్ప్‌ నిష్పత్తి అధికంగా ఉందంటే, తీసుకున్న రిస్కుకు మించి అధిక రాబడులను అందిస్తోందని అర్థం. దీర్ఘకాలంలో స్థిరమైన పనితీరును కోరుకుంటున్న ఇన్వెస్టర్లకు ఇది సానుకూల సంకేతం. ఇక ఆల్ఫా అనేది రిస్క్‌కు అనుగుణంగా సర్దుబాట్లు చేసి, బెంచ్‌మార్క్‌ సూచీకి మించి పనితీరును కనపర్చగలిగే ఫండ్‌ మేనేజర్‌ సామర్థ్యాలను  సూచిస్తుంది. ఆల్ఫా సానుకూలంగా ఉందంటే మార్కెట్‌ కదలికలను బట్టి, ఊహించిన దానికి మించి ఫండ్‌ మేనేజరు రాబడులు అందించినట్లు అర్థం.  

బీటా: మ్యుచువల్‌ ఫండ్‌ స్కీములు సాధారణంగా నిర్దిష్ట సూచీని ప్రామాణికంగా తీసుకుంటాయి. సదరు బెంచ్‌మార్క్‌లతో పోలిస్తే నిర్దిష్ట స్కీము రాబడులను అందించడంలో ఎంత ఒడిదుడుకులకు లోనవుతున్నదీ తెలుసుకునేందుకు ఉపయోగించే కొలమానం బీటా. మార్కెట్‌ బీటా సాధారణంగా 1గా ఉంటుంది. మ్యుచువల్‌ ఫండ్‌ బీటా 1.0గా ఉందంటే, అచ్చం దాని బెంచ్‌మార్క్‌ సూచీని ప్రతిబింబించేంత సెన్సిటివ్‌గా లేదా ఒడిదుడుకులతో ఉంటుందని అర్థం.  బీటా 1.20గా ఉందంటే అది 20% ఎక్కువ సెన్సిటివ్‌గా లేదా హెచ్చుతగ్గులకు లోనవుతుందని అర్థం. పోర్ట్‌ఫోలియోలోని మిగతా సాధనాలతో పోలిస్తే రిసు్కలను మదింపు చేసేందుకు ఇదొక కొలమానంగా ఉపయోగపడగలదు.  

ట్రాకింగ్‌ ఎర్రర్‌: నిర్దిష్ట ఫండ్‌ పనితీరు, దాని బెంచ్‌మార్క్‌ సూచీ పనితీరుకు ఎంత దగ్గరగా ఉందనేది ట్రాకింగ్‌ ఎర్రర్‌ లెక్కిస్తుంది. ట్రాకింగ్‌ ఎర్రర్‌ తక్కువగా ఉందంటే, బెంచ్‌మార్క్‌కి అనుగుణంగా ఫండ్‌ పనితీరు అంత దగ్గరగా ఉందని అర్థం. అదే ట్రాకింగ్‌ ఎర్రర్‌ అధికంగా ఉందంటే, ప్రామాణిక సూచీకి భిన్నంగా ఫండ్‌ పనితీరు ఉంటోందని భావించవచ్చు. ప్యాసివ్‌ ఫండ్స్‌ ఇన్వెస్టర్లు లేదా ఇండెక్స్‌ తరహా రాబడులను కోరుకునే మదుపరులకు ట్రాకింగ్‌ ఎర్రర్‌ తక్కువ ఉండటం మంచిది.  

ఎక్స్‌పెన్స్‌ రేషియో: ఎక్స్‌పెన్స్‌ రేషియో అనేది మ్యుచువల్‌ ఫండ్‌ నిర్వహణకయ్యే వార్షిక వ్యయాలను ప్రతిబింబిస్తుంది. దీన్ని ఫండ్‌ అసెట్స్‌లో నిర్దిష్ట శాతంగా చూపిస్తారు. ఎక్స్‌పెన్స్‌ రేషియో అధికంగా ఉంటే రాబడులు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, కాస్త ఎక్కువ ఫీజులు వర్తించినా, యాక్టివ్‌ మేనేజ్‌మెంట్‌ ఉండటం వల్ల ప్యాసివ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో పోలిస్తే మరింత మెరుగైన రాబడులు పొందడానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు, స్టాక్స్‌ ఎంపిక లేదా మార్కెట్‌ టైమింగ్‌పై   దృష్టి పెట్టే యాక్టివ్‌ ఫండ్లు, బెంచ్‌మార్క్‌కి మించి రాబడులు అందించడం ద్వారా అధిక ఫీజులకు న్యాయం చేకూర్చవచ్చు. కాబట్టి వ్యయాలతో పోలిస్తే ఫండ్‌ వ్యూహం వల్ల ఒనగూరే విలువను మదింపు చేసుకోవడం అన్నివేళలా శ్రేయస్కరం.  

బెంచ్‌మార్క్‌: మ్యుచువల్‌ ఫండ్‌ పనితీరును పోల్చిచూసే మార్కెట్‌ సూచీని బెంచ్‌మార్క్‌గా పరిగణిస్తారు. ఉదాహరణకు ఈక్విటీ ఫండ్లను సాధారణంగా నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్‌ను ప్రామాణికంగా పోల్చి చూస్తారు. అదే డెట్‌ ఫండ్లకు బాండ్‌ సూచీలను బెంచ్‌మార్క్‌లుగా పరిగణిస్తారు. ఫండ్‌ పనితీరును బెంచ్‌మార్క్‌తో పోల్చి చూడటం వల్ల ఫండ్‌ మేనేజర్‌ వ్యూహం సమర్ధతను, అధిక రాబడులను సాధించగలుగుతున్నారా అనే ది ఇన్వెస్టర్లు తెలుసుకోవచ్చు. అలాగే, వివిధ కాలవ్యవధుల్లో అంటే 1 ఏడాది, 3 ఏళ్లు, లేదా 5 ఏళ్ల వ్యవధిలో నిర్దిష్ట ఫండ్‌ తన బెంచ్‌మార్క్‌తో పోలిస్తే ఏ విధంగా పనిచేస్తోందో పరిశీలించడం కూడా ముఖ్యం.  

ఇదీ చదవండి: స్టాక్స్‌ అమ్మి ఫ్లాట్‌ కొనడం మంచిదా?

చివరగా చెప్పాలంటే, మ్యుచువల్‌ ఫండ్‌ పనితీరును మదింపు చేయాలంటే అది గతంలో అందించిన రాబడి మాత్రమే చూస్తే సరిపోదు. పైన పేర్కొన్న అంశాల్లో కొన్నింటిని పరిశీలించడం ద్వారా సదరు ఫండ్‌ సిసలైన సామర్థ్యాలను ఇన్వెస్టరు అర్థం చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న   ఫండ్‌ మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా ఉందో లేదో తెలుసుకునేందుకు ఈ కొలమానాలన్నింటినీ కలిపి ఉపయోగించి అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడి వృద్ధి, ఆదాయాన్ని కోరుకుంటున్నా లేదా సమతూకమైన విధానాన్ని పాటించాలనుకుంటున్నా ఈ కొలమానాలను అర్థం చేసుకోవడం వల్ల మరింత స్మార్ట్‌గా, సమగ్రమైన వివరాలతో తగిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవచ్చు.

-రోహిత్‌ మట్టూ, నేషనల్‌ హెడ్‌ (రిటైల్‌ సేల్స్‌) యాక్సిస్‌ మ్యుచువల్‌ ఫండ్‌ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement