ఎవరికీ ఆదాయం రాకుండా ప్రభుత్వ నిబంధనలు

Govt norms ensure no one makes money in payments space - Sakshi

చెల్లింపు సేవలపై యాక్సిస్‌ బ్యాంక్‌ హెడ్‌ చౌదరి వ్యాఖ్యలు

ముంబై: చెల్లింపుల సర్వీసులు అందించే సంస్థలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆదాయం ఆర్జించేందుకు వీలు లేకుండా ప్రభుత్వ నిబంధనలు ఉంటున్నాయని యాక్సిస్‌ బ్యాంక్‌ సీఈవో అమితాబ్‌ చౌదరి వ్యాఖ్యానించారు. దీని వల్ల చిన్న సంస్థలు బతికి బట్టకట్టడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ‘పేమెంట్స్‌ విభాగంలో మేము ఆదాయం ఆర్జించేందుకు ప్రభుత్వం ఏమాత్రం అవకాశం ఇవ్వడం లేదు. దీన్ని అడ్డుపెట్టుకుని వేరే దగ్గరెక్కడో డబ్బు సంపాదించుకోవాలే తప్ప పేమెంట్స్‌ విభాగంలో ఏ సంస్థా సొమ్ము చేసుకోలేని పరిస్థితి ఉంది‘ అని గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చౌదరి చెప్పరు. డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు యూపీఐ ప్లాట్‌ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ఆ సర్వీసులు ఉచితంగానే ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలు సదరు సంస్థలకు సమస్యగా మారాయి.

యూపీఐ సేవలకూ మర్చంట్‌ డిస్కౌంట్‌ రేటు (ఎండీఆర్‌) విధించే అంశంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో చౌదరి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. యాక్సిస్‌ బ్యాంకు.. ఫ్రీచార్జ్‌ అనే పేమెంట్స్‌ కంపెనీని నిర్వహిస్తోంది. ‘ఆదాయం రాని సేవలు అందించడం ద్వారా వచ్చే నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మాకు ఇతరత్రా అవకాశాలు కల్పించాలన్న సంగతి అర్థం చేసుకున్నా కూడా నియంత్రణ సంస్థలు పైసా రాని పనులెన్నో చేయాలంటూ బ్యాంకులను ఆదేశిస్తుంటాయి‘ అని చౌదరి చెప్పారు. ఈ నేపథ్యంలో బడా టెక్‌ కంపెనీలతో భాగస్వామ్యాలు కుదుర్చుకోవడం ద్వారా ఆదాయాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్, గూగుల్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చెప్పారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top