
ఇటీవల జోరు చూపుతున్న ప్రైమరీ మార్కెట్ల ప్రభావంతో తాజాగా ఐదు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు చేపట్టేందుకు దారి ఏర్పడింది. క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఇందుకు అనుమతులు మంజూరు చేసింది. ఈ జాబితాలో ఇన్నోవేటివ్యూ ఇండియా, పార్క్ మెడీ వరల్డ్, రన్‌వాల్ ఎంటర్‌ప్రైజెస్, జిన్‌కుషాల్ ఇండస్ట్రీస్, అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ చేరాయి. ఈ కంపెనీలు 2025 ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య సెబీకి ప్రాస్పెక్టస్ దాఖలు చేశాయి. ఈ కేలండర్ ఏడాది(2025)లో ఇప్పటివరకూ మెయిన్‌బోర్డులో 48 కంపెనీలు లిస్ట్‌కావడం గమనార్హం! ఈ నెలలో ఇప్పటివరకూ 11 కంపెనీలు ఐపీవోకురాగా.. వచ్చేవారం మరికొన్ని కంపెనీల ఇష్యూలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో తాజా ఇష్యూల వివరాలు చూద్దాం..
సెక్యూరిటీ సొల్యూషన్లు
భద్రతా, నిఘా(సెక్యూరిటీ, సర్వెలెన్స్) సొల్యూషన్లు అందించే ఇన్నోవిటివ్యూ ఇండియా ఐపీవోకు రానుంది. ఇష్యూలో భాగంగా ప్రమోటర్లు రూ. 2,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. దీంతో ఇష్యూ నిధులు కంపెనీకికాకుండా పూర్తిగా ప్రమోటర్లకు చేరనున్నాయి.
ఆసుపత్రుల చైన్
ఆరోగ్యపరిరక్షణ రంగ సంస్థ పార్క్ మెడి వరల్డ్ ఐపీవో చేపట్టనుంది. పార్క్ బ్రాండ్‌తో ఆసుపత్రులను నిర్వహిస్తున్న కంపెనీ తద్వారా రూ. 1,200 కోట్లు సమీకరించనుంది. వీటిలో కొత్తగా ఈక్విటీ జారీ ద్వారా రూ. 900 కోట్లు సమకూర్చుకోనుండగా.. ప్రమోటర్ అజిత్ గుప్తా రూ. 300 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ చేయనున్నారు. ఈక్విటీ జారీ నిధులను రుణ చెల్లింపులు, పెట్టుబడి వ్యయాలు(కొత్త ఆసుపత్రుల ఏర్పాటు), పరికరాల కొనుగోలుకి వెచి్చంచనుంది. అనుబంధ సంస్థలు పార్క్ మెడిసిటీ(ఎన్‌సీఆర్), బ్లూహెవెన్స్ విస్తరణకు సైతం నిధులు వెచ్చించనుంది.
రియల్టీ సంస్థ
ఐపీవోకు రానున్న రియల్టీ అభివృద్ధి సంస్థ రన్‌వాల్ ఎంటర్‌ప్రైజెస్ రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఈ నిధులలో రూ. 200 కోట్లు రుణ చెల్లింపులకు, మరో రూ. 450 కోట్లు అనుబంధ సంస్థలలో పెట్టుబడులకు కేటాయించనుంది. మిగిలిన నిధులను భవిష్యత్ రియల్టీ ప్రాజెక్టుల అభివృద్ధి, సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
మెషీన్ల కంపెనీ
చత్తీస్‌గఢ్‌కు చెందిన మెషీన్ల ఎగుమతి కంపెనీ జిన్‌కుషాల్ ఇండస్ట్రీస్ ఐపీవోలో భాగంగా 86.5 లక్షల షేర్లను కొత్తగా జారీ చేయనుంది. వీటికి జతగా కంపెనీ ప్రమోటర్లు 10 లక్షల షేర్లను విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులను వర్కింగ్ క్యాపిటల్, కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది.
ఆగ్రోకెమికల్
జైపూర్ సంస్థ అడ్వాన్స్ ఆగ్రోలైఫ్ లిమిటెడ్ ఐపీవోకు రానుంది. దీనిలో భాగంగా 1.92 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. ఇలా సమీకరించిన నిధులను వర్కింగ్ క్యాపిటల్‌తోపాటు.. సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనుంది.
డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్
డిజిటల్ రుణాల ప్లాట్‌ఫామ్ కిస్త్ మాతృ సంస్థ ఆన్‌ఈఎంఐ టెక్నాలజీ సొల్యూషన్స్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 1,000 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా వీటికి జతగా మరో 88.79 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధులలో రూ. 750 కోట్లు అనుబంధ సంస్థ సై క్రెవా మూలధన పటిష్టతకు కేటాయించనుంది. తద్వారా భవిష్యత్ పెట్టుబడి అవసరాలకు వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు వెచ్చించనుంది. 2016లో ప్రారంభమైన కంపెనీ వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా వేగవంత, సులభతర క్రెడిట్ సొల్యూషన్లు అందిస్తోంది. ప్రధానంగా యువతపై దృష్టిసారించింది. 2025 మార్చి31కల్లా 5.32 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లను కలిగి ఉంది. 91 లక్షలకుపైగా కస్టమర్లకు సేవలు సమకూర్చింది. రూ. 4,087 కోట్ల నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) కలిగి ఉంది. గతేడాది(2024–25) రూ. 1,337 కోట్ల ఆదాయం, రూ. 161 కోట్ల నికర లాభం ఆర్జించింది.
ఇదీ చదవండి: మొబైళ్లను 5% జీఎస్‌టీ శ్లాబ్‌లో చేర్చాలి