అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో సరఫరా గొలుసు భద్రతపై మరోసారి ఆందోళనలు మొదలయ్యాయి. యాపిల్ సంస్థకు ప్రధాన తయారీ భాగస్వామి అయిన ఫాక్స్‌కాన్‌పై భారీ సైబర్ దాడి జరిగినట్లు ఆ సంస్థ అధికారికంగా ధ్రువీకరించింది. ఉత్తర అమెరికాలోని పలు ప్లాంట్లను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఈ రాన్సమ్‌వేర్ దాడిలో యాపిల్‌తో పాటు గూగుల్, ఎన్విడియా వంటి దిగ్గజ సంస్థల రహస్య ప్రాజెక్ట్ ఫైళ్లు హ్యాకర్ల చేతిలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
8టీబీ డేటా మాయం..
ప్రముఖ రాన్సమ్‌వేర్ ముఠా ‘నైట్రోజన్’ ఈ దాడికి బాధ్యత వహిస్తూ సంచలన ప్రకటన చేసింది. ఫాక్స్‌కాన్ సర్వర్ల నుంచి సుమారు 1.1 కోట్ల ఫైళ్లు, అంటే దాదాపు 8 టెరాబైట్ల డేటాను తాము దొంగిలించినట్లు హ్యాకర్లు పేర్కొన్నారు. ఇందులో కేవలం ఫాక్స్‌కాన్ అంతర్గత సమాచారమే కాకుండా కొన్ని సంస్థల కీలక పత్రాలు ఉన్నాయని హ్యాకర్లు చెబుతున్నారు. అందులో..
యాపిల్: భవిష్యత్తులో విడుదల కాబోయే పరికరాల సాంకేతిక డ్రాయింగ్‌లు.
ఇంటెల్, ఎన్విడియా: సెమీకండక్టర్ డిజైన్లు, చిప్‌సెట్ మాన్యుస్క్రిప్ట్‌లు.
గూగుల్, డెల్: అంతర్గత ప్రాజెక్ట్ పత్రాలు, రహస్య ఆదేశాలు.
అప్రమత్తమైన టీమ్
సైబర్ దాడిని గుర్తించిన వెంటనే ఫాక్స్‌కాన్ సెక్యూరిటీ టీమ్ అప్రమత్తమైంది. అత్యవసర సహాయక చర్యలు చేపట్టినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఈ దాడుల వల్ల ఉత్పత్తి, డెలివరీ కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నాం. ప్రభావితమైన ప్లాంట్లు దశలవారీగా సాధారణ స్థితికి చేరుకుంటున్నాయి’ అని చెప్పింది. అయితే, వినియోగదారుల వ్యక్తిగత డేటా ఏదైనా లీక్ అయిందా అనే అంశంపై కంపెనీ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
ఏమిటీ నైట్రోజన్ గ్యాంగ్..
సైబర్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ నైట్రోజన్ రాన్సమ్‌వేర్ రష్యా మద్దతున్న ‘కాంటి’ గ్రూప్ కోడ్ నుంచి ఉద్భవించింది. 2023లో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా ప్రధానంగా వీఎమ్‌వేర్ ఈఎస్‌క్సీ వంటి వర్చువలైజేషన్ సిస్టమ్స్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్న సాంకేతిక లోపాల వల్ల బాధితులు హ్యాకర్లకు డబ్బు చెల్లించినా డేటా తిరిగి వస్తుందనే గ్యారెంటీ లేదని భద్రతా సంస్థ కోవైర్ హెచ్చరించింది.
ఫాక్స్‌కాన్‌కు గతంలో..
ఫాక్స్‌కాన్‌పై సైబర్ దాడులు జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఈ సంస్థ హ్యాకర్ల బారిన పడింది. 2022 మెక్సికోలోని ఫాక్స్‌కాన్ అనుబంధ సంస్థపై లాక్‌బిట్ దాడి జరిగింది. 2024 ప్రారంభంలో ఫాక్స్‌కాన్ గ్రూప్‌లోని సెమీకండక్టర్ విభాగం ‘ఫాక్స్‌సెమికాన్’లో డేటా లీక్ అయింది.
యాపిల్ మౌనం..
యాపిల్ తన తయారీ భాగస్వాములకు ఇచ్చే సమాచారం విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుంది. ఏయే భాగాలను ఎలా అసెంబ్లీ చేయాలో మాత్రమే అందించి సాంకేతిక సమాచారాన్ని పరిమితంగా పంచుకుంటుంది. అయినప్పటికీ, డ్రాయింగ్‌లు, డిజైన్ పత్రాలు లీక్ అవ్వడం అనేది యాపిల్ భవిష్యత్ ఉత్పత్తుల గోప్యతకు పెద్ద ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై యాపిల్ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక స్పందన ఇవ్వలేదు.
ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌పై జోహో ప్రకటన


