నష్టం మాత్రమే కాదు.. కోట్ల బతుకుల్ని ఆగమాగం చేసింది

Facebook Outage Causes Huge Damage To Global Economy - Sakshi

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలు కొన్ని గంటలపాటు నిలిచిపోవడం..  కొందరికి చికాకు తెప్పించి ఉండొచ్చు. మరికొందరికి ఇదంతా సరదా వ్యవహారంగా అనిపించి ఉండొచ్చు.  కానీ, నాణేనికి మరోవైపులా.. ఇందులోనూ సీరియస్‌ కోణం కనిపించింది.  అమెరికా, ఫేస్‌బుక్‌ ఓనర్‌ సంగతేమోగానీ..  మిగతా ప్రపంచానికి మాత్రం ఈ విఘాతం ఊహించని స్థాయిలో డ్యామేజ్‌నే చేసింది.  ముఖ్యంగా వ్యాపార, వైద్య రంగాలతో పాటు ప్రభుత్వ విభాగాలపైనా యాప్స్‌ సేవల విఘాతం తీవ్ర ప్రభావం చూపెట్టింది.  

ఇన్‌స్టంట్‌ కాల్స్‌ అండ్‌ మెసేజింగ్‌ సర్వీసుల యాప్‌ ‘వాట్సాప్‌’ను.. 180 దేశాల్లో 200 కోట్ల మంది దాకా ఉపయోగిస్తున్నారు. ఇక ఫేస్‌బుక్‌-ఫేస్‌బుక్‌ మెసేంజర్‌ సర్వీస్‌ల్ని 300 కోట్లమందికిపైగా ఉపయోగించుకుంటున్నారు.  కెన్యా, అర్జెంటీనా, మలేషియా, కొలంబియా, బ్రెజిల్‌ లాంటి  దేశాల్లో 16 నుంచి 54 ఏళ్లలోపు 90 శాతం మంది వాట్సాప్‌ సేవల్ని ఉపయోగిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ఇక భారత్‌లో సుమారు 50 కోట్ల మంది వాట్సాప్‌ సేవల్ని ఉపయోగించుకుంటుండగా..  సోమవారం రాత్రి వాటిల్లిన బ్రేక్‌ డౌన్‌ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. 

ఎన్నో రంగాలు..
సోషల్‌ మీడియా అనేది కేవలం కమ్యూనికేషన్‌ కోసం మాత్రమే కాదు.. వివిధ రంగాల్లోనూ జోరుగా వీటిని వినియోగిస్తున్నారు. డెలివరీ దగ్గరి నుంచి విద్యా, వైద్య, ఇతరత్ర సేవలను అందించడంలో ఇప్పుడు ఇవే కీలక భూమిక పోషిస్తున్నాయి.  ముఖ్యంగా చిరువ్యాపారుల బిజినెస్‌కు ఈ ఆరేడు గంటల విఘాతం కోలుకోలేని నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇక కరోనా టైం నుంచి భారత్‌లో వాట్సాప్‌ ద్వారా​ పేషెంట్ల కన్సల్టింగ్‌ ప్రక్రియ, మందుల డోర్‌ డెలివరీ వ్యవస్థ ఎక్కువగా నడుస్తోంది. సోమవారం నాటి అంతరాయంతో  వైద్య రంగానికి నష్టంతో పాటు పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక మలేషియాలో బిజినెస్‌ కమ్యూనికేషన్‌ దాదాపుగా ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లతోనే నడుస్తోంది. అలాంటిది అక్కడ భారీగానే నష్టం వాటిల్లినట్లు సమాచారం. మొత్తంగా  ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. ఫేస్‌బుక్‌ అండ్‌ కో వల్ల  ఎక్కువ డ్యామేజ్‌ జరిగింది మాత్రం ఫుడ్‌(ఇండోనేషియా,జర్మనీ లాంటి దేశాల్లో), రిటైల్‌(34కి పైగా దేశాల్లో) రంగాలకే కావడం చెప్పుకోదగ్గ విషయం. 

ప్రభుత్వ సేవలకూ..
మనీలా
కు చెందిన ఫొటోగ్రాఫర్‌ రిచర్డ్‌ జేమ్స్‌ మెండోజా ఫేస్‌బుక్‌ సర్వీసుల విఘాతం వల్ల ఉపాధి దెబ్బతిందని వాపోతున్నాడు. ఫిలిప్పీన్స్‌ అధ్యక్ష ఎన్నికల క్యాంపెయిన్‌ కోసం, కరోనా సమాచారం అప్‌డేట్స్‌ కోసం మెండోజా పని చేస్తున్నాడు.  భారత కాలమానం ప్రకారం.. సోమవారం రాత్రి ఏర్పడ్డ విఘాతంతో మెండోజా తన పని సక్రమంగా నిర్వహించలేకపోయాడు. దీంతో ఇతగాడి ఫీజులో భారీ కోత పడింది. ఇలా క్యాంపెయిన్స్‌ కోసమే కాదు.. ప్రభుత్వాలు సోషల్‌ మీడియాను ‘ఇన్‌ఫర్మేషన్‌ షేరింగ్‌’ ప్లాట్‌ఫామ్‌గా వాడుకుంటున్నాయి కూడా. నిఘా, పౌర సేవల్ని అందించడం, అవసరమైన డాక్యుమెంట్ల చేరివేత, వెరిఫికేషన్‌.. ఇలా ఎన్నో ప్రక్రియలు వాట్సాప్‌ ద్వారా నడుస్తున్నాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.   

సర్వీసింగ్‌ సెంటర్‌లకు క్యూ
ప్రజలకు సోషల్‌ మీడియా కేవలం టైం పాస్‌ యవ్వారం అని మాత్రమే కాదు..  సాధారణ ఫోన్‌కాల్స్‌ కంటే యాప్‌కాల్స్‌  యమచీప్‌ అనే ముద్రపడిపోయింది. అందుకే ఆ ఆరేడు గంటలు కమ్యూనికేషన్‌ పరమైన ఇబ్బందితో తలలు పట్టుకున్నారు. అయినవాళ్లతో బంధం కాసేపు ఆగిపోవడం.. అపార్థాలతో అలజడులు రేగాయి. కొందరు ఫోన్‌లు రీస్టార్ట్‌లుచేయగా.. మరికొందరు డేటా ప్యాక్‌ వాలిడిటీ పూర్తైందేమోనని కంగారు పడ్డారు. ఇంకొందరు ఆందోళనతో సర్వీస్‌ సెంటర్‌లకు, రిపేర్‌ షాపులకు క్యూ కట్టిన దృశ్యాలు సైతం కనిపించాయి. 

మార్క్‌ జకర్‌బర్గ్‌కు కలిగిన నష్టంతో పోలిస్తే..  అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఫేస్‌బుక్‌ అండ్‌ కో విఘాతం వల్ల జరిగిన నష్టమే ఎక్కువ. అఫ్‌కోర్స్‌.. ఈ విషయాన్ని లెక్కలతో తేల్చకున్నాఫేస్‌బుక్కే స్వయంగా ప్రకటించిందనుకోండి. ఇప్పుడు తెర మీదకు వచ్చిన మరో చర్చ ఏంటంటే.. ముందు ముందు ఇలాంటి అంతరాయాలు  ఎదురైతే ఎలా? అని..  

- సాక్షి, వెబ్‌స్పెషల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top