జూలై 1 నుంచి అమలులోకి రానున్న కొత్త రూల్స్ ఇవే!

From Driving License To Bank Accounts, 6 Major Upcoming Changes from 1 July - Sakshi

డ్రైవింగ్ లైసెన్స్ నుంచి బ్యాంక్ చార్జీల వరకు జూలై 1, 2021 నుంచి అనేక కొత్త మార్పులు చోటు చేసుకొనున్నాయి. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) రేపటి నుంచి ఛార్జీలు పెంచేందుకు సిద్దమవుతుంది. అలాగే ఎల్‌పీజీ ధరలో కూడా మార్పులు చోటు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఈ కొత్త మార్పుల వల్ల సామాన్యుడి జేబుకు చిల్లు పడనుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ఎస్‌బీఐ బీఎస్‌బీడీ
జూలై 1 నుంచి ఎస్‌బీఐ బీఎస్‌బీడీ ఖాతాదారుల జేబుకు చిల్లు పడనుంది. ఒక నెలలో బ్యాంకు శాఖలు, ఏటీఎంల నుంచి కూడా కలిపి నెలకు ఉచితంగా నాలుగుసార్లు మాత్రమే నగదు తీసుకునే వీలుంటుంది. ఆపై ఒక్కో లావాదేవీపై రూ.15 (జీఎస్టీ అదనం) చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఒక ఆర్ధిక సంవత్సరంలో 10 చెక్స్ మాత్రమే ఉచితంగా అందించనున్నారు.  అంతకంటే ఎక్కువ 10 లీఫ్‌ల చెక్‌ బుక్‌కు కోసం అయితే రూ. 40, 25 లీఫ్‌లదైతే రూ.75 చార్జీలు ప్లస్ జీఎస్‌టీ వర్తిస్తుంది. ఇక అత్యవసర చెక్‌ బుక్‌ కోసం రూ. 50 (జీఎస్‌టీ అదనం) చెల్లించాల్సి ఉంటుంది.

ఎల్‌పీజీ గ్యాస్
లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్‌పీజీ) లేదా కిచెన్ గ్యాస్ రేట్లు కూడా జూలై 1 నుండి సవరించనున్నారు. ప్రతి 5 రోజులకోసారి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా చమురు కంపెనీలు ఎల్‌పీజీ ధరలను సవరిస్తాయి.

డ్రైవింగ్ లైసెన్స్
జూలై 1 నుంచి కేంద్రం ఏర్పాటు చేస్తున్న కొత్త సిస్టమ్ ప్రకారం, ఇక నుంచి ఎవరైనా డ్రైవింగ్ లైసెన్స్ కోసం రీజనల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్(ఆర్ టీఓ) ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేంద్రం గుర్తించిన డ్రైవింగ్  శిక్షణ కేంద్రాలలో డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన తర్వాత వారు ఆ కేంద్రం నుంచే శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్ పొందవచ్చు.

ఐఎఫ్‌ఎఎస్ సీ కోడ్‌లు
కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా సిండికేట్‌ బ్యాంక్‌ కెనరా బ్యాంక్‌లో విలీనం అయిన సంగతి తెలిసిందే. అయితే, జులై 1 నుంచి సిండికేట్‌ బ్యాంక్‌ ఖాతాదారులు కెనరా బ్యాంక్‌కు చెందిన కొత్త ఐఎఫ్‌ఎఎస్ సీ కోడ్‌లు వినియోగించాల్సి ఉంటుంది. ఐఎఫ్‌ఎఎస్ సీ కోడ్ లను కెనరా బ్యాంక్‌ వెబ్‌సైట్‌ ద్వారా పొందొచ్చు.

చెక్కు బుక్కులు చెల్లవు 
మీరు ఆంధ్రాబ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ ఖాతాదారులా? అయితే ఇది మీ కోసమే. ఈ రెండు బ్యాంకులు యూనియన్‌ బ్యాంకులో విలీనం అయిన కారణంగా పాత చెక్కు బుక్కులు జులై 1 నుంచి చెల్లవ్‌. కొత్త చెక్కు బుక్కులు యూనియన్‌ బ్యాంకు శాఖల్లో తీసుకోవాల్సి ఉంటుంది.

టీడీఎస్‌ కొత్త రూల్స్‌
ఇటీవల కేంద్రం అమల్లోకి తెచ్చిన ఫైనాన్స్ యాక్ట్ 2021 ప్రకారం గత రెండేళ్లలో చెల్లించాల్సిన టీడీఎస్, టీసీఎస్‌ పన్ను రూ.50,000 కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలో అధిక శాతంలో పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయించింది. ఇది జులై 1 నుంచి అమ‌ల్లోకి రానుంది.

చదవండి: ఇజ్రాయిల్ తరహా 'ఐరన్ డోమ్'ను భారత్ నిర్మించాలి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top