రష్యా వద్దు.. సౌదీయే ముద్దు.. పరిస్థితులు తారుమారు?

Crude Imports Reducing Consistently From Russia  - Sakshi

ఉక్రెయిన్‌తో యుద్ధానికి దిగిన రష్యాపై అమెరికా సహా సంపన్న దేశాలు ఆంక్షలు విధించాయి. ఆదాయం పెంచుకోవడానికి తన మిత్ర దేశాలకు రష్యా రాయితీపై ముడి చమురు సరఫరా చేసింది. దీన్ని భారత్ అనుకూలంగా మార్చుకుని రష్యా నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకుంది.

అయితే క్రమంగా యుద్ధ భయాలు తొలగిపోతుండడంతో రష్యా నుంచి ఇండియాకు దిగుమతి అవుతున్న క్రూడాయిల్ ఖరీదుగా మారుతోంది. ఉక్రెయిన్  వార్ మొదలైనప్పటి నుంచి రష్యన్‌‌‌‌ క్రూడ్‌‌‌‌ను  చాలా తక్కువ రేటుకు  ఇండియన్ కంపెనీలు కొంటున్నాయి. తాజాగా ఈ క్రూడ్‌‌‌‌పై ఇస్తున్న డిస్కౌంట్‌‌‌‌ను రష్యా తగ్గించింది. ప్రస్తుతం బ్యారెల్‌‌‌‌పై 3-4 డాలర్ల వరకు మాత్రమే డిస్కౌంట్‌‌‌‌ ఇస్తోంది. కానీ, రవాణా ఛార్జీలను మాత్రం తగ్గించలేదని, సాధారణం కంటే ఇంకా ఎక్కువగానే ఉన్నాయని క్రూడ్‌ విక్రయిస్తున్న కంపెనీలు చెబుతున్నాయి.

పశ్చిమ దేశాలు రష్యన్ క్రూడ్‌‌‌‌పై బ్యారెల్‌‌‌‌కు 60 డాలర్ల  ప్రైస్‌‌‌‌ లిమిట్‌‌‌‌ను విధించిన విషయం తెలిసిందే. ఈ ధర కంటే కొద్దిగా తక్కువకు ఇండియన్ కంపెనీలు క్రూడాయిల్ కొంటున్నాయి. అదే ఆయిల్‌‌‌‌ను డెలివరీ చేస్తున్న రష్యన్ కంపెనీలు బ్యారెల్‌‌‌‌కు 11 నుంచి 19 డాలర్ల వరకు రవాణా ఛార్జీని వసూలు చేస్తున్నాయని సమాచారం. దాంతో రష్యా నుంచి వరుసగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుతున్నాయి. అందుకు ప్రత్యామ్నాయంగా గత నెలలో సౌదీ అరేబియా నుంచి ముడి చమురు దిగుమతులు పెరిగాయి.

రష్యా నుంచి ముడి చమురు దిగుమతి 22 శాతం నుంచి 16 శాతానికి తగ్గితే, సౌదీ అరేబియా నుంచి నాలుగు శాతం పెరిగింది. చెల్లింపుల సమస్య తలెత్తడంతో రష్యా నుంచి గత నెలలో క్రూడాయిల్ కొనుగోళ్లు 11 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. రష్యాలోని సొకోల్ తదితర ప్రాంతాల నుంచి ఐదు క్రూడాయిల్ చమురు రవాణా నౌకలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాయని తెలుస్తుంది.

భారత్‌లో టాప్ రిఫైనరీ సంస్థగా ఉన్న ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మాత్రమే సొకోల్‌తోపాటు రష్యాలోని రోస్ నెఫ్ట్ ప్రాంతం నుంచి చమురు కొనుగోళ్లకు వార్షిక ఒప్పందం కుదుర్చుకుంది. చెల్లింపు సమస్యను తగ్గించుకోవడానికి గత నెలలో సౌదీ అరేబియా సహా మిడిల్‌ ఈస్ట్‌ దేశాల నుంచి చమురు కొనుగోలు ప్రారంభించిందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

ఇదీ చదవండి: రూ.10 వేలకోట్లు అప్పు చేసిన ‘రిచ్‌డాడ్‌ పూర్‌డాడ్‌’ పుస్తక రచయిత..

చమురు దిగుమతి చేసుకున్నందుకు రష్యాకు రుబెల్స్‌, రూపీల్లో చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. అయితే అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌ చెల్లింపులకు చాలా విలువ ఉంటుంది. దాంతో కంపెనీలు కొంత ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు చమురుపై ఇస్తున్న డిస్కౌంట్‌ను తగ్గిస్తూ, రవాణా ఛార్జీలు తగ్గించకపోవడంతో ఈ పరిస్థితులు ఏర్పడినట్లు నిపుణులు చెబుతున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top