కండోమ్స్‌ బిజినెస్‌: 50లక్షలనుంచి రూ. 43వేల కోట్లతో దడ పుట్టించిన బ్రదర్స్‌

Condom maker Mankind Pharma Juneja brothers success story - Sakshi

ఒకపుడు మెడికల్ రిప్రజెంటేటివ్స్‌

కండోమ్‌  బిజినెస్‌తో రూ. 43వేల కోట్లు!

ప్రముఖ కండోమ్ బ్రాండ్‌ మేన్‌కైండ్‌ ఫార్మా ఏప్రిల్ 25న ఐపీఓకు రానుంది. దేశీయంగా మేన్‌ఫోర్స్ కండోమ్‌లు, ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ డిటెక్షన్ కిట్‌ల విక్రయాలతో పాపులర్‌ బ్రాండ్‌గా పేరొందింది. మెడికల్‌ సేల్స్‌మెన్స్‌గా మొదలై  రూ.43,264 కోట్ల విలువైన సంస్థగా తీర్చిదిద్దిన  జునేజా సోదరుల సక్సెస్‌ స్టోరీ..

ఢిల్లీకి చెందిన డ్రగ్ కంపెనీ, కండోమ్ మేకర్ మేన్‌కైండ్  ఫార్మా  రూ. 4,326 కోట్ల  పబ్లిక్ ఆఫర్ని ఏప్రిల్ 25న ప్రారంభించి, ఏప్రిల్ 27న ముగించడానికి సిద్ధంగా ఉంది. అనిశ్చిత ఆర్థికపరిస్థితుల మధ్య  2023లో ఎక్స్ఛేంజీలో లిస్ట్‌ అయిన ఏడో ఐపీఓ ఇది. 

మెడికల్ సేల్స్‌మెన్‌లా ప్రయాణం మొదలుపెట్టి రూ. 43,264 కోట్లకు చేర్చారు రమేష్  జునేజా, రాజీవ్ జునేజా. జునేజా సోదరులుగా పేరొందిన వీరు ఒంటరిగానే మొదలు పెట్టారు. పట్టుదలతో, మొక్కవోని దీక్షతో కంపెనీని అద్భుత స్థాయికి తీసుకొచ్చారు. ముఖ్యంగా 90వ దశకంలో బాలీవుడ్ స్టార్లతో ఆకర్షణీయమైన ప్రకటనలతో మధ్య తరగతిని ఆకర్షించడంలో జునేజా సోదరుల మేనేజ్‌మెంట్ స్కిల్స్‌, కార్పొరేట్  వ్యూహం నిదర్శనంగా నిలిచింది. అతితక్కువ సమయంలోనే  విక్రయాల్లో దూసుకు పోతూ  దిగ్గజాలకు దడ పుట్టించారు. 

ఛైర్మన్ రమేష్ సీ జునేజా 1974లో కీఫార్మా అనే కంపెనీకి మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేశారు. ఆ తరువాత  ఫార్మా దిగ్గజం లుపిన్‌లో ఎనిమిదేళ్లు పనిచేశారు. 1994లో తను స్థాపించిన కంపెనీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. 1995లో తన సోదరుడు రాజీవ్ జునేజాతో కలిసి మేన్‌కైండ్‌ని ప్రారంభించారు. ఇందుకు వారి ప్రారంభ పెట్టుబడి రూ.50 లక్షలు మాత్రమే. 25మంది వైద్య ప్రతినిధులతో సంస్థను ప్రారంభించారు.

ఇపుడు దేశవ్యాప్తంగా 25 తయారీ కేంద్రాలతో, 600 మందికిపైగా శాస్త్రవేత్తల బృందంతో పనిచేస్తోంది. అతిపెద్ద  నెట్‌వర్క్‌తో  నాలుగు యూనిట్లలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలను నడుపుతోంది. 2022లో ఫోర్బ్స్ డేటా ప్రకారం  34500 కోట్ల రూపాయల నికర విలువ  జునేజా సోదరుల సొంతం.   మేన్‌ కైండ్‌ ఫార్మా మార్కెట్ క్యాప్ రూ.43,264 కోట్లు. దేశీయ విక్రయాల పరంగా ఇది భారతదేశంలో నాలుగో అతిపెద్ద కంపెనీ. గత సంవత్సరం, డిసెంబర్ 2022 నాటికి, దాని ఏకీకృత లాభం రూ.996.4 కోట్లు. తొలి తొమ్మిది నెలల ఆదాయం రూ.6697 కోట్లు.  మ్యాన్‌ఫోర్స్ కండోమ్ బ్రాండ్ రూ. 462 కోట్లకు పైగా దేశీయ విక్రయాలతో ఈ విభాగంలో మార్కెట్ లీడర్‌గా ఉందని పేర్కొంది.  ప్రెగా న్యూస్ ప్రెగ్నెన్సీ కిట్‌ల విక్రయం రూ. 184.40 కోట్లు.

ముఖ్యంగా కంపెనీ నెట్‌వర్క్‌ విస్తరణకు, విజయానికి కారణం కంపెనీ సీఈవోగా రాజీవ్‌ జునేజా. రమేష్ జునేజా సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, రాజీవ్‌  కాలేజీ డ్రాప్ అవుట్. అలాగే జునేజా సోదరుల మేనల్లుడు అర్జున్, ప్రొడక్షన్‌, రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పర్యవేక్షిస్తుండగా. మరో మేనల్లుడు శీతల్ అరోరా, గైనకాలజీ, డెర్మటాలజీ డ్రగ్స్ మార్కెటింగ్ విభాగం లైఫ్‌స్టార్‌ను  బాధ్యతలను చూస్తుండటం విశేషం.కంపెనీ వివిధ తీవ్రమైన, దీర్ఘకాలిక చికిత్సలకు సంబంధించి పలు ఫార్మ ఫార్ములేషన్స్‌తోపాటు, అనేక వినియోగదారు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను తయారు చేస్తుంది.

ఐపీఓ 
రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ ద్వారా  40,058,844 ఈక్విటీ షేర్లను బీఎస్‌ఈ, ఎన్ఎస్‌సీ రెండింటిలోనూ జాబితా చేయాలని ప్రతిపాదించింది. ప్రమోటర్లలో సహ వ్యవస్థాపకులు రమేష్ జునేజా , రాజీవ్ జునేజా,  సీఈవో శీతల్ అరోరా, కెయిర్న్‌హిల్ CIPEF, కెయిర్న్‌హిల్ CGPE, బీజ్ లిమిటెడ్ ,లింక్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఉన్నారు. ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,026 1,080గా నిర్ణయించారు.  కంపెనీ షేర్లు మే 3న ఇన్వెస్టర్లకు కేటాయించిన తరువాత మే 8న స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టవుతాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top