ఇన్‌ఫ్లుయెన్సర్లకు కేంద్రం కొత్త నిబంధనలు, రూ.50 లక్షల ఫైన్‌..3 ఏళ్ల నిషేధం!

Central Govt Issues New Rules For Celebrities, Social Media Influencers - Sakshi

తప్పుదారి పట్టించే ప్రకటనలపై కేంద్రం దృష్టి సారించింది. ఇందులో భాగంగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌లకు కొత్త మార్గ దర్శకాలు విడుదల చేసింది. వాటికి అనుగుణంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు వ్యవహరించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేసింది. 

దేశీయంగా ఇన్‌ఫ్లుయెన్సర్‌ మార్కెట్‌ 2025 నాటికి 20 శాతం వృద్ధి సాధించి రూ.2,800కోట్లకు చేరుతుందని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో కేంద్ర విభాగానికి చెందిన సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) మిస్‌లీడింగ్‌ అడ్వర్టైజ్‌మెంట్‌పై దృష్టిసారించింది. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా కొత్త నిబంధనలు విధించింది.

'ఎండార్స్‌మెంట్ నో హౌస్' 
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లు, వర్చువల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల(అవతార్ లేదా కంప్యూటర్ జనరేటెడ్ క్యారెక్టర్) కోసం 'ఎండార్స్‌మెంట్ నో హౌస్' పేరుతో కొత్త మార్గదర్శకాలను వినియోగదారుల వ్యవహారాల శాఖ జారీ చేసింది.

నిబంధనలు పాటించాల్సిందే, లేదంటే
సీసీపీఏ చీఫ్ కమీషనర్ నిధి ఖరే మార్గదర్శకాలను వివరించారు. ఆ నిబంధనల మేరకు... ఇన్‌ఫ్లుయెన్సర్లు పొందే  గిఫ్ట్‌, హోటల్‌ అకామిడేషన్‌,ఈక్విటీ (మనీ), డిస్కౌంట్స్‌, అవార్డ్‌లు, ఎండార్సింగ్‌ ప్రొడక్ట్స్‌, సర్వీస్‌ - స్కీమ్‌ వంటి అంశాల్లో తాము విధించిన నిబంధనలకు లోబడి వ్యవహరించాలని, ఉల్లంఘించిన పక్షంలో, వినియోగదారుల రక్షణ చట్టం - 2019 ప్రకారం తప్పుదారి పట్టించే ప్రకటనలకు సూచించిన జరిమానా వర్తిస్తుంది. అంతేకాదు బ్యాన్‌ చేయడం, ఎండార్స్‌మెంట్స్‌ను తిరిగి వెనక్కి తీసుకుంటామని కూడా తెలిపింది. 

రూ.50లక్షల జరిమానా, మూడేళ్ల పాటు నిషేధం
సీసీపీఏ తయారీదారులు, ప్రకటనదారులు, ఎండార్సర్‌లపై రూ.10 లక్షల జరిమానా, అంతకంటే ఎక్కువ ఉల్లంఘనలు ఉంటే రూ. 50 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. తప్పుదారి పట్టించే ప్రకటనల్ని ప్రసారం చేసినందుకు గాను ఇన్ ఫ్లూయన్సర్‌ ఏడాది పాటు నిషేధం, లేదంటే తీవ్రతను బట్టి ఆ నిషేధాన్ని 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

వినియోగదారుల రక్షణే ధ్యేయంగా
మార్గదర్శకాలను విడుదల చేసిన వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. అనైతిక వ్యాపార కార్యకలాపాలు చేసేందుకు ప్రసారం చేసే తప్పుడు ప్రకటనల నుండి  వినియోగదారుల రక్షించేందుకు సీసీపీఏ పరిధిలో మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు. 

లక్షమందికి పైగా ఇన్‌ఫ్లుయెన్సర్లు
2022లో ఇండియన్‌ సోషల్ ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ పరిమాణం రూ. 1,275 కోట్లు ఉండగా.. ఆ పరిమాణం 2025 నాటికి 19-20 చొప్పున వార్షిక వృద్ధి రేటుతో రూ. 2,800 కోట్లకు పెరిగే అవకాశం ఉంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే మంచి సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నవారు దేశంలో లక్షకు పైగా ఉన్నారు అని రోహిత్‌ కుమార్‌  సింగ్ చెప్పారు.

ఎలా బహిర్ఘతం చేయాలి!
పైన పేర్కొన్నట్లు ఇన్‌ఫ్లుయెన్సర్లు లబ్ధి పొందితే సంబంధిత వివరాలను పోస్ట్‌లలో, వీడియోలలో స్పష్టం చెప్పాలి. ఏదైనా కంపెనీ నుంచి ఓ స్పాన్సర్‌ కంటెంట్‌ ప్రమోట్‌ చేస్తుంటే.. సంబంధిత కంపెనీ పోర్టల్‌ లింక్స్‌, హ్యాష్‌ ట్యాగ్స్‌ జత చేయడం కాకుండా.. కంపెనీ వివరాలు ఫోటోల్లో, వీడియోలో యాడ్‌ చేయాలి. వీడియోలో, డిస్‌క్లోజర్‌లు కేవలం వివరణలో మాత్రమే కాకుండా ఆడియో, వీడియో ఫార్మాట్‌లో వీడియోలో తెలిపాలి. లైవ్ స్ట్రీమ్ అయితే మొత్తం స్ట్రీమింగ్‌ ప్రారంభం నుంచి ఎండింగ్‌ వరకు ప్లే చేయాలని సూచించారు. టీవీ, ప్రింట్, రేడియో వంటి సంప్రదాయ మీడియా సంస్థ నిబంధనలు పాటిస్తున్నాయని, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు విభిన్నంగా వ్యవహరిస్తున్నాయని  రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు.

మరిన్ని వార్తలు :

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top