
విస్తృతంగా విస్తరిస్తున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ (ఏఐ) మానవ ఉద్యోగాలపై ప్రభావం చూపుతుందని, కోట్లాది ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్న అంచనాలు ఆందోళనలు పెంచుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రోగ్రామింగ్‌కు ఏఐ ప్రత్యామ్నాయం కాదని అభిప్రాయపడ్డారు. మానవ సృజనాత్మకతతోనే ప్రోగ్రామింగ్ రూపుదిద్దుకుంటుందని వ్యాఖ్యానించిన ఆయన ప్రోగ్రామర్లను ఏఐ ఇప్పుడే కాదు.. వందేళ్లయినా భర్తీ చేయలేదని స్పష్టం చేశారు.
ఇటీవల ఎకనమిక్ టైమ్స్‌తోపాటు టునైట్ షో విత్ జిమ్మీ ఫాలన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలలో బిల్ గేట్స్ దీని గురించి మాట్లాడారు. కోడింగ్ కు మానవ మేధస్సు అవసరమని గేట్స్ చెప్పారు. ప్రోగ్రామింగ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయపడగలదు కానీ పూర్తిగా తన చేతుల్లోకి తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రోగ్రామింగ్లో నిజమైన సవాలు సంక్లిష్ట సమస్యను సృజనాత్మకతతో పరిష్కరించడమేనన్న ఆయన ఇది యంత్రాలు చేయలేవన్నారు.
‘కోడ్ రాయడం అంటే కేవలం టైపింగ్ మాత్రమే కాదు. లోతుగా ఆలోచించడం’ అని బిల్ గేట్స్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా విభిన్న పరిశ్రమల్లో అనేక ఉద్యోగాలు రూపాంతరం చెందుతాయని, లేదా కనుమరుగవుతాయని భావిస్తున్నప్పటికీ, ప్రోగ్రామింగ్ మాత్రం మానవ ఉద్యోగంగానే ఉంటుందని గేట్స్ అంచనా వేస్తున్నారు. ఎందుకంటే దీనికి విచక్షణ, ఊహాశక్తి, అడాప్టబిలిటీ అవసరం. ఈ లక్షణాలు ఏఐకి ఉండవని అంటున్నారాయన.
మరోవైపు 2030 నాటికి కృత్రిమ మేధ 8.5 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని వరల్డ్ ఎకనామిక్ ఫోరం అంచనా వేసింది. ఈ ద్వంద్వ ప్రభావాన్ని గేట్స్ అంగీకరిస్తూ, కృత్రిమ మేధ పర్యవసానాల గురించి తాను కూడా భయపడుతున్నానని అంగీకరించారు. అయితే తెలివిగా ఉపయోగిస్తే కృత్రిమ మేధ ఉత్పాదకతను మెరుగుపరుస్తుందని, సమయాన్ని ఆదా చేస్తుందని ఆయన నమ్ముతున్నారు.
ఏఐ ప్రభావం గురించి కొన్ని నెలల క్రితమే బిల్‌గేట్స్ మాట్లాడారు. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రభావం చూపినా, ఎన్ని మార్పులు తెచ్చినా, కోడింగ్ నిపుణులు, జీవ శాస్త్రవేత్తలు, ఇంధన రంగంలో పనిచేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదని తన అభిప్రాయాన్ని చెప్పారు.