కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్యం | Ayushman Bharat Card Healthcare Lifeline apply step by step process | Sakshi
Sakshi News home page

కార్పొరేట్‌ ఆసుపత్రిలో ఉచిత వైద్యం

May 9 2026 2:23 PM | Updated on May 9 2026 2:33 PM

Ayushman Bharat Card Healthcare Lifeline apply step by step process

దేశంలోని పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం భారంగా మారుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ - ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎం-జేఏవై) ఒక సంజీవనిలా పనిచేస్తోంది. ఈ పథకం ద్వారా లభించే ‘ఆయుష్మాన్ కార్డు’ ఉంటే చాలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా చికిత్స పొందే వీలుంది.

ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏమిటి?

ఆయుష్మాన్ భారత్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం లభిస్తుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ఇచ్చే డిజిటల్ గుర్తింపు కార్డునే ‘ఆయుష్మాన్ కార్డు’ లేదా ‘పీఎం-జేఏవై కార్డు’ అంటారు.

కార్డు వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు

ఆసుపత్రిలో చేరినప్పుడు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. సుమారు 1,900 పైగా వ్యాధులు, శస్త్రచికిత్సలకు ఇందులో కవరేజీ ఉంటుంది. ఆసుపత్రిలో చేరడానికి 3 రోజుల ముందు నుంచి, డిశ్చార్జ్ అయిన 15 రోజుల వరకు అయ్యే పరీక్షలు, మందుల ఖర్చులు కూడా పథకంలో వర్తిస్తాయి. మీరు ఏ రాష్ట్రంలో ఉన్నా ఈ పథకం కింద నమోదైన ఏ ఆసుపత్రిలోనైనా (ప్రభుత్వ లేదా ప్రైవేట్) చికిత్స పొందవచ్చు.

ఆయుష్మాన్ కార్డు ఎలా పొందాలి?

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రక్రియను చాలా సరళతరం చేసింది. మీ స్మార్ట్‌ఫోన్ ద్వారానే స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • ముందుగా ఆయుష్మాన్ భారత్ అధికారిక వెబ్‌సైట్ (https://beneficiary.nha.gov.in) ను సందర్శించండి లేదా ‘Ayushman App’ డౌన్‌లోడ్ చేసుకోండి.

  • వెబ్‌సైట్‌లో ‘Beneficiary’ ఆప్షన్‌ను ఎంచుకోండి.

  • మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి వచ్చిన OTP ద్వారా లాగిన్ అవ్వండి.

  • మీ రాష్ట్రం, పథకం పేరు (పీఎంజేఏఐ) ఎంచుకోండి.

  • మీ జిల్లాను ఎంచుకున్న తర్వాత.. ఆధార్ నంబర్ లేదా రేషన్ కార్డ్ ద్వారా మీ పేరును సెర్చ్‌ చేయండి.

  • లిస్టులో మీ పేరు పక్కన ఉన్న ‘Identify’ లేదా ‘e-KYC’ బటన్‌పై క్లిక్ చేయండి.

  • ఆధార్ OTP లేదా ఫేస్ అథెంటికేషన్ ద్వారా కేవైసీ పూర్తి చేయండి.

  • మీ ప్రస్తుత ఫోటోను లైవ్‌లో క్యాప్చర్ చేసి అప్‌లోడ్ చేయండి. మీ ఆధార్‌లోని వివరాలు, ప్రస్తుత వివరాలు సరిపోలితే వెంటనే ఆమోదం లభిస్తుంది.

  • అప్రూవల్ అయిన తర్వాత ‘Download Card’ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ డిజిటల్ ఆయుష్మాన్ కార్డును ప్రింట్ తీసుకోవచ్చు.

ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ (వారి ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా) ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ నిర్ణయం తీసుకుంది. వీరు ప్రత్యేకంగా ‘వయో వందన’ కార్డు కోసం పైన పేర్కొన్న పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏవైనా సందేహాలుంటే లేదా రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురైతే ప్రభుత్వ హెల్ప్‌లైన్ నంబర్ 14555 కు కాల్ చేయవచ్చు లేదా సమీపంలోని మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు.

ఇదీ చదవండి: సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు

Advertisement
 
Advertisement
Advertisement