మార్కెట్‌పై యుద్ధ మేఘాలు

Asian shares fall on worries over Russia-Ukraine conflict - Sakshi

ముంచేసిన రష్యా–ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలు 

తోడైన చమురు ధరల మంట... పదినెలల్లో అతిపెద్ద నష్టం  

సెన్సెక్స్‌ 1,747 పాయింట్లు క్రాష్‌

17 వేల దిగువన ముగిసిన నిఫ్టీ 

అన్ని రంగాల షేర్లలో అమ్మకాలే...

ముంబై: రష్యా – ఉక్రెయిన్‌ దేశ సరిహద్దుల్లో కమ్ముకొన్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల పతనాన్ని శాసించాయి. ప్రపంచ చమురు అవసరాలను తీర్చడంతో కీలకపాత్ర పోషిస్తున్న ఈ దేశాల మధ్య ఉద్రికత్తలు తారస్థాయికి చేరడంతో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర ఏడేళ్ల గరిష్ట స్థాయి 95 డాలర్లకు చేరింది. మరోవైపు అమెరికా ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్టానికి చేరుకోవడంతో పాటు ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను మార్చి కంటే ముందుగానే పెంచవచ్చనే భయాలు వెంటాడాయి.

దీంతో ఆసియా మార్కెట్ల నుంచి యూరప్‌ సూచీలు, అమెరికా ఫ్యూచర్ల వరకు నష్టాల కడలిలో కుంగిపోయాయి. భారత స్టాక్‌ మార్కెట్‌పైనా ఆ ప్రభావం కనిపించింది. ఇక దేశీయ ప్రతికూలతలను పరిశీలిస్తే.., ఇంటర్‌ బ్యాంక్‌ పారెక్స్‌ మార్కెట్‌లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ 24 పైసలు నష్టపోయి 9 వారాల కనిష్ట స్థాయి 75.60కి పడిపోయింది.   దేశీయ మార్కెట్లో సోమవారం ఎఫ్‌ఐఐలు రూ.4,254 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఈ ఏడాది తొలి నెల జనవరి హోల్‌సేల్‌ ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ వర్గాలను నిరాశపరిచాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 1,747 పాయింట్లు క్షీణించి 56,406 వద్ద స్థిరపడింది.

గతేడాది(2021) ఫిబ్రవరి 26 తరువాత ఈ సూచీకిదే అతిపెద్ద నష్టం. నిఫ్టీ 532 పాయింట్లు పతనమైన ఈ ఏడాదిలో తొలిసారి 17,000 స్థాయి దిగువన 16,843 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ ఎక్సే్చంజీలోని మొత్తం 19 రంగాల ఇండెక్సులు నష్టపోయాయి. అత్యధికంగా మెటల్, బ్యాంకింగ్‌ షేర్ల సూచీలు ఐదుశాతానికి పైగా క్షీణించాయి. విస్తృతస్థాయిలో అమ్మకాలు జరగడంతో స్మాల్, మిడ్, లార్జ్‌క్యాప్‌ ఇండెక్సులు నాలుగు చొప్పున నష్టపోయాయి. ఆసియాలో స్టాక్‌ సూచీలన్నీ ఒకశాతం నుంచి రెండున్న శాతం నష్టపోయాయి. యూరప్‌లో బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల మార్కెట్లు 1.50%– 3% చొప్పున క్షీణించాయి. అమెరికా స్టాక్‌ ఫ్యూచర్లు రెండున్నర శాతం నష్టాలతో కదలాడుతున్నాయి.

ఆదిలోనే హంసపాదు
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందుకున్న దేశీయ మార్కెట్‌ ఉదయం భారీ నష్టాలతో మొదలైంది. సెన్సెక్స్‌ ఏకంగా 1,433 క్షీణించి 56,720 వద్ద, నిఫ్టీ 299 పాయింట్ల పతనంతో 17,375 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. భారీ నష్టాల నేపథ్యంలో దిగువస్థాయిల వద్ద కొంత కొనుగోళ్ల మద్దతు లభించినా.., ఆదిలోనే హంసపాదులాగా విక్రయాలు వెల్లువెత్తడంతో ఇన్వెస్టర్లు షేర్లను తెగనమ్మారు. ఒక దశలో సెన్సెక్స్‌ 1,858 పాయింట్ల నష్టంతో 56,295 వద్ద, నిఫ్టీ 565 పాయింట్లను కోల్పోయి 16,810 వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిలకు దిగివచ్చాయి.  

లాభాలు ఒక్క షేరుకే...  
సెన్సెక్స్‌ సూచీలో 30 షేర్లలో ఒక్క టీవీఎస్‌(ఒకశాతం లాభం) మాత్రమే లాభపడింది. మిగిలిన 29 షేర్లు నష్టాలను చవిచూశాయి. ఇండెక్సుల్లో దిగ్గజాలైన టాటా స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు అత్యధికంగా ఐదున్నర శాతం క్షీణించాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్‌బ్యాంక్, మారుతీ సుజుకీ, ఇండస్‌ ఇండ్, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో షేర్లు నాలుగు శాతం నష్టపోయాయి. సూచీలో అధిక వెయిటేజీ షేరు రిలయన్స్‌ షేరు రెండు శాతం నష్టపోయింది.   

రెండురోజుల్లో రూ.12.43 లక్షల కోట్లు...
ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపు భయాలు, ప్రపంచ ప్రతికూలతలతో సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాల్ని చవిచూశాయి. సెన్సెక్స్‌ సూచీ 2,520 పాయింట్లు, నిఫ్టీ 763 పాయింట్ల చొప్పున క్షీణించాయి. సూచీల భారీ పతనంతో గడిచిన రెండురోజుల్లో బీఎస్‌ఈలో రూ.12.43 లక్షల కోట్లు ఆవిరయ్యాయి. గతవారాంతపు రోజైన శుక్రవారం రూ. 3.91 లక్షల కోట్లు, ఈ సోమవారం రూ.8.47 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈ నమోదిత కంపెనీల మొత్తం విలువ (మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) రూ.255 లక్షల కోట్లకు దిగివచ్చింది.  

‘ఊహించినట్లే ప్రపంచ ప్రతికూలతలు దేశీయ మార్కెట్‌ పతనాన్ని శాసించాయి. కొన్ని వారాల స్థిరీకరణ తర్వాత మార్కెట్‌పై బేర్స్‌ పట్టు సాధించాయి. రష్యా – ఉక్రెయిన్‌ల మధ్య నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు.. పెరుగుతున్న క్రూడ్‌ ధరలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. రానున్న రోజుల్లో సూచీలకు అంతర్జాతీయ పరిణామాలు దిశానిర్దేశం చేస్తాయి’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.

మార్కెట్లో మరిన్ని సంగతులు  
► మార్కెట్లో అస్థిరతను సూచించే వీఐఎక్స్‌ ఇండెక్స్‌ ఏకంగా 23 శాతం ఎగసి 22.98 స్థాయికి చేరుకుంది.    
► నష్టాల మార్కెట్లో  టీసీఎస్‌ షేరు మాత్రమే ఒకశాతం లాభపడి రూ.3734 వద్ద ముగిసింది. బైబ్యాక్‌ రికార్డు తేదీ(ఫిబ్రవరి 23)ని    ప్రకటించడం షేరు రాణించేందుకు        కారణమైంది.  
► స్పైస్‌జెట్‌ ఆఫర్‌ను కళానిధి మారన్‌ తిరస్కరించడంతో ఆ షేరు ఐదున్నర శాతం క్షీణించి రూ.59 వద్ద స్థిరపడింది.
► బ్యాంకింగ్‌ షేర్ల పతనంలో భాగంగా ఐసీఐసీఐ షేరు పదినెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూసింది. బీఎస్‌ఈలో 5% పతనమై రూ.754 వద్ద  ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top