వేదాంత డైరీస్‌ 7: చేతిలో చిల్లిగవ్వ లేని స్టేజీ నుంచి పది కంపెనీలకు యజమానిగా

Anil Agarwal Mohd Rafi Vedanta Aluminium Factory Story - Sakshi

వేదాంత రిసోర్సెస్‌ దేశంలో మెటల్‌ తయారీలో అతి పెద్ద కంపెనీల్లో ఒకటి. స్టీల్‌, కాపర్‌, అల్యూమీనియం తయారీలో దూసుకుపోతోంది. దేశంలో యువతకి పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తోన్న కంపెనీల్లో ఇది ఒకటి. అయితే ఈ కంపెనీ స్థాపించాలనే ఆలోచనకు బీజం పడిన వైనం తెలిస్తే ఆశ్చర్యపోతారు. కిక్కిరిసిన జనం మధ్యన ట్యాక్సీలో చేసిన ప్రయాణం, అప్పుడు వినిపించిన మహ్మద్‌ రఫి పాడిన ఓ పాట కారణం. ఆ పాట నింపిని స్ఫూర్తి వేదాంత ప్రస్థానానికి నాందిగా నిలిచింది.

బీహార్‌లోని పాట్నా శివారులో వేదాంత రిసోర్స్‌ చైర్మన్‌ అనిల్‌ అగర్వాల్‌ కుటుంబం నివసిస్తుండేది. తండ్రి  మెటల్‌ వ్యాపారంలో ఉండే వాడు. దీంతో వారణాసి సమీపంలో ఉన్న హిందాల్కో ఫ్యాక్టరీకి వెళ్లాల్సి వచ్చేది. అలా తండ్రితో కలిసి పాట్నా నుంచి వారణాసికి చిన్నతనంలో అనిల్‌ అగర్వా్ల్‌ వెళ్లేవాడు. ఈ ప్రయాణం అంత సుఖంగా ఏమీ ఉండేది కాదు. కిక్కిరిసిన ఆ ట్యాక్సీలో ఒకరి మీద ఒకరు పడిపోయేట్టుగా కూర్చుని వెళ్లాల్సి వచ్చేది. ఆ ప్రయాణం తలచుకుంటేనే అనిల్‌ అగర్వాల్‌కి ముచ్చెమటలు పట్టేవి. అయితే ఆ భయంకర ప్రయాణంలో నచ్చే ఒకే ఒక్క విషయం ట్యాక్సీలో డ్రైవర్‌ పెట్టే మహ్మద్‌ రఫీ పాటలు.

వో కోన్‌సీ ముష్కిల్‌ హై
ఓసారి పాట్నా నుంచి బనారస్‌కు చేస్తున్న ప్రయాణంలో పాటలు పెట్టాడు డ్రైవర్‌. కిక్కిరిసిన జనాలు ముక్కుపుటలు అదరగొట్టే చెమట కంపు మధ్యన చెవులకు ఇంపుగా తోచేలా మహ్మద్‌ రఫీ మాధుర్యమైన గొంతుతో..  వో కోన్‌సీ ముష్కిల్‌ హై (సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు) అనే పాట వినిపించడం మొదలైంది. అప్పుడు అనిల్‌ అగర్వాల్‌ వయస్సు పద్నాలుగేళ్లు. ప్రయాణం పూర్తైనా ఆ పాట మాత్రం మదిలో నుంచి బయటకు వెళ్లలేదు. ట్యాక్సీ దిగి హిందాల్కో ఫ్యాక్టరీలోకి వెళ్లగానే అక్కడ తళతళ మెరుస్తున్న మిషన్లు, ఎత్తైన పొగ గొట్టాలు, క్రమ పద్దతిలో పని చేస్తున్న కార్మికులు.. అక్కడి వాతావరణం అంతా ఉత్సాహభరింతగా తోచింది అనిల్‌ అగర్వాల్‌కి. తాను చూస్తున్న దృశ్యానికి అప్పటి వరకు విన్న పాటను జోడించాడు. అంతే పెద్దయ్యాక ఇలాంటి ఓ ఫ్యాక్టరీ పెట్టాలనే కలకు అక్కడే బీజం పడింది.

ఛలో ముంబై
వ్యాపారం రంగంలో రాణించాలనే కసితో డిగ్రీ పట్టా పుచ్చుకుని పొట్ట కోస్తే అక్షరం ముక్క రాకపోయినా హవాయి చెప్పులు చేత సూట్‌ కేసుతో 1970వ దశకంలో ముంబై వచ్చేశాడు అనిల్‌ అగర్వాల్‌. అక్కడే స్క్రాప్‌ బిజినెస్‌లో బిజీ అయ్యాడు. ఈ సమయంలో మద్రాస్‌ అ‍ల్యూమినయం ఫ్యాక్టరీ తీవ్ర నష్టాలో కూరుకుపోయి మూసివేతకు సిద్ధంగా ఉంది. సరైన పద్దతిలో కనుక ఫ్యాక్టరీని నడిపిస్తే దానికి తిరుగుండదనే నమ్మకం అనిల్‌ అగర్వాల్‌కి కలిగింది. కానీ నడిపించే వాడు ఎవరు అన్నట్టుగా అక్కడ పరిస్థితి నెలకొంది.

సాధ్యం కానిది ఏదీ లేదు
చిన్నప్పుడు విన్న  మహ్మద్‌ రఫీ పాట ‘సాధ్యం కానిదంటూ ఏదీ లేదు’ పాట స్ఫూర్తితో నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీ టేకోవర్‌ చేసేందుకు ముందుకు వచ్చాడు అనిల్‌ అగర్వాల్‌. ఫ్యాక్టరీతో భవిష్యత్తు ముడిపడి ఉన్న అందరినీ ఒప్పించాడు. వారిలో స్ఫూర్తి నింపాడు అనతి కాలంలోనే ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం 10 వేల టన్నుల నుంచి 20 వేల టన్నులకు పెరిగింది. 

అదే స్ఫూర్తి మరోసారి
ఇదే సమయంలో దేశంలో తొలి ప్రైవేటైజేషన్‌గా భారత్‌ అల్యుమీనియం కంపెనీ అమ్మకానికి వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో దాన్ని సొంతం చేసుకోవాలంటే భారీ పెట్టుబడులు అవసరం. కానీ నష్టాల్లో ఉన్న కంపెనీని కొని సాధించేది ఏమీ ఉండదనే కారణంతో భారత్‌ అల్యుమీనియం కంపెనీ కొనుగోలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. దీంతో మరోసారి ధైర్యం చేసి ఆ సంస్థను కొనుగోలు చేసేందుకు అనిల్‌ అగర్వాల్‌ ముందుకు వచ్చాడు. భారీ పెట్టుబడుల కోసం బ్యాంకర్లను కలిశాడు. తన వద్ద ఉన్న ప్రణాళిక వివరించాడు. నమ్మకం కుదిరిన బ్యాంకర్లు అండగా నిలిచారు. అంతే భారత్‌ అల్యుమినియం కంపెనీ కూడా అనిల్‌ అగర్వాల్‌ ఖాతాలో చేరిపోయింది. 

అప్పులు.. ఆఫర్‌..
అల్యుమీనియం తయారీలో దూసుకుపోతున్న అనిల్‌ అగర్వాల్‌కి ఈ సారి ఊహించని వైపు నుంచి ఆహ్వానం అందింది. ఒడిషా ముఖ్యమంత్రి బీజూ పట్నాయక్‌ నుంచి పిలుపు వచ్చింది. ఒడిషాలో మారుమూల వెనకబడిన ప్రాంతమైన కలహాందీ ఏరియాలో అ‍ల్యుమీనియం పరిశ్రమ ఏర్పాటు చేయాలంటూ ఆఫర్‌ ఇచ్చారు. అప్పటికే అప్పులు తప్ప చేతిలో చిల్లిగవ్వ లేదు. ఉన్నదల్లా గొప్పగా ఏదైనా సాధించాలనే కల, దాన్ని నెరవేర్చుకునేందుకు అవసరమైన పట్టుదల అంతే.

పట్టుదలే పెట్టుబడిగా
ప్రభుత్వం పిలిచి మరీ ఆఫర్‌ ఇవ్వడంతో ఓడిషాలో పరిశ్రమ స్థాపించాలనే ఆశయం అనిల్‌ అగర్వాల్‌కి నిద్రని దూరం చేసింది. సాధ్యం కానిది ఏదీ ఉండదనే రఫీ పాట మరోసారి స్ఫూర్తి నింపింది. కునుకు పట్టనివ్వని కలలు తోడుగా పట్టుదలే పెట్టుబడిగా విడతల వారీగా ఇటు ప్రభుత్వంతో, అటు ఇన్వెస్టర్లతో వరుసగా చర్చలు జరిపాడు. ఫలితంగా ఈసారి వేదాంత కంపెనీకి ఒడిషాలో తొలి అడుగు పడింది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. ఇండియాతో పాటు విదేశాల్లోనూ వేదాంత విస్తరించింది. వేలాది మంది ఆ కంపెనీలో పని చేస్తుండగా అనిల్‌ అగర్వాల్‌ ఆస్తుల విలువ ఏకంగా 30వేల కోట్ల రూపాయలను అధిగమించింది. 

చదవండి: వేదాంత డైరీస్‌ 6: ఛాయ్‌, పల్లిపట్టితోనే కడుపు నింపుకున్నాడు.. నేడు 30 వేల కోట్లకు అధిపతి

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top