ఇల్లెందు: మండలంలోని మామిడిగుండాల సీలింగ్ భూముల హద్దులను ప్రభుత్వం తక్షణమే గుర్తించడమే కాక సీలింగ్ పట్టాలు పొందిన గిరిజనులపై భూస్వామల దౌర్జన్యాలను అరికట్టాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య డిమాండ్ చేశారు. ఇల్లెందులోని మాస్‌లైన్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను ఎమ్మెల్యేగా పనిచేసిన కాలం నుంచి మామిడిగుండాల భూసమస్య నానుతోందన్నారు. ఏళ్ల పోరాటం తర్వాత 900 మంది గిరిజన రైతులకు 2,800 ఎకరాల సీలింగ్ భూమికి పట్టాలు ఇస్తే, మరో 1,400 ఎకరాల భూమిని ఏటా వర్షాకాలంలో లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులు భూములకు హద్దులు చూపకపోవటం వల్లే సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఇకనైనా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూమి గుర్తింపునకు హద్దులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. సీలింగ్ యాక్ట్‌ను తుంగలో తొక్కి కొందరు బినామీలు భూమిని కొనుగోలు చేసినట్లు చెబుతుండడం గర్హనీయమన్నారు. అంతేకాక గిరిజనులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఎస్‌ఏ నబీ, సిలివేరు సత్యనారాయణ, బానోతు ఊక్లా, ఎట్టి వీరభద్రం, మొంతెన వసంతరావు, మెంతెన సంజీవరావు, ఎట్టి ప్రశాంత్, అంజయ్య, దుగ్యాల వీరభద్రం, ఈసం కృష్ణ, బాలకృష్ణ, రామటెంకి అశోక్, బొర్ర వెంకన్న, బోసు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య,
అఖిలపక్షం నేతలు


