ఠాణా.. నిఘా అణువణువునా | - | Sakshi
Sakshi News home page

ఠాణా.. నిఘా అణువణువునా

Jun 17 2026 12:16 AM | Updated on Jun 17 2026 12:16 AM

● ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో 11 చొప్పున సీసీ కెమెరాలు ● డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ● సుప్రీంకోర్టు సూచనలతో ఏర్పాటు జవాబు దారీతనం పెరుగుతుంది..

● ప్రతీ పోలీస్‌ స్టేషన్‌లో 11 చొప్పున సీసీ కెమెరాలు ● డీజీపీ కార్యాలయానికి అనుసంధానం ● సుప్రీంకోర్టు సూచనలతో ఏర్పాటు

భద్రాచలంఅర్బన్‌: సుప్రీంకోర్టు సూచన మేరకు అన్ని పోలీస్‌ స్టేషన్లలో 11 చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో జిల్లాలోని 28 పోలీస్‌ స్టేషన్లలో కూడా సీసీ కెమెరాలను బిగిస్తున్నారు. ఇప్పటికే భద్రాచలంతో పాటు ఇంకొన్ని పీఎస్‌లలో వీటి ఏర్పాటు పూర్తి కాగా, మిగతా స్టేషన్లలో పనులు చివరి దశకు చేరాయి.

నేరుగా తెలుసుకునేందుకు..

స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో సిబ్బంది ఎలా వ్యవహరిస్తున్నారు, ఏమైనా ఇబ్బందులు పడుతున్నారా అనేది తెలుసుకునేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాక కీలకమైన కేసుల సమయాన ఆధారాల కోసం కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్‌ ఆవరణ, రిసెప్షన్‌, ఎస్‌హెచ్‌ఓ, కంప్యూటర్‌ రికార్డులు భద్రపర్చే గది, సీజ్‌ చేసిన వాహనాలు నిలిపే ప్రదేశం, స్టేషన్‌ ప్రధాన ద్వారం, ఫిర్యాదుదారులు వేచి ఉండే గది, రెండు లాకప్‌ రూమ్‌ల్లోనూ కెమెరాలు ఏర్పాటు చేస్తుండగా, అందులో మాట్లాడిన మాటలు కూడా రికార్డు అయ్యేవి ఎంపిక చేస్తున్నారు.

ఇప్పటికే సిటిజన్‌ ఫీడ్‌బ్యాక్‌ స్కానర్‌

ఏదైనా సమస్య, కష్టం వచ్చినప్పుడు ఫిర్యాదు చేయడానికి వచ్చేవారిని పోలీసు ఉద్యోగులు పట్టించుకోకున్నా, నిర్లక్ష్యం చేసినా, ఇబ్బంది పెట్టినా ఫీడ్‌బ్యాక్‌ ఇచ్చేలా ఇప్పటికే స్టేషన్ల ఆవరణలో క్యూఆర్‌ కోడ్‌ స్కానర్లు ఏర్పాటుచేశారు. ఫిర్యాదు, ఈ–చలాన్‌, ఎఫ్‌ఐఆర్‌, పాస్‌పోర్టు ధ్రువీకరణతో పాటు ఇతర అంశాలపై ప్రజలు తమ అభిప్రాయాలను తెలపడానికి ఈ స్కానర్లు ఉపయోగపడుతున్నాయి. అంతేకాక స్టేషన్‌కు వెళ్లిన వారు ఫిర్యాదుపై అధికారులు, సిబ్బంది స్పందించిన తీరును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం సులువవుతోంది. తాజాగా పోలీస్‌స్టేషన్లలో కెమెరాలు ఏర్పాటు చేయడమే కాక రికార్డు దృశ్యాలను నేరుగా డీజీపీ కార్యాలయంలో వీక్షించేలా అటాచ్‌ చేశారు. దీంతో ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెరిగి పనితీరులో మెరుగైన మార్పు వస్తుందని భావిస్తున్నారు.

జిల్లాలోని అన్ని పోలీస్‌

స్టేషన్లలో ఇప్పటికే కెమెరాలు ఉన్నాయి. అయినప్పటికీ

11 కెమెరాలు ఏర్పాటు చేయాలనే ఆదేశాలతో పనులు చేయిస్తున్నాం. జిల్లాలోని 28 పోలీస్‌ స్టేషన్లలో వీటిని ఏర్పాటుచేస్తాం. అంతేకాక కెమెరాల పుటేజీని నేరుగా డీజీపీ కార్యాలయానికి

అనుసంధానం చేస్తున్నారు. తద్వారా ఉద్యోగులు జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు.

– రోహిత్‌రాజు, ఎస్పీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement