చుంచుపల్లి: ప్రధానిగా నరేంద్రమోదీ 12 ఏళ్ల పాలనలో అగ్ర దేశాలకు దీటుగా భారతదేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యాన మంగళవారం కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. సుస్థిర పాలనను అందించడమే కాక అభివృద్ధిలో దేశాన్ని ముందు నిలిపిన మోదీని ప్రజలు ఎప్పటికీ మర్చి పోరని తెలిపారు. బీజేపీ హయాంలో పరిపాలన, ఆర్థిక వ్యవస్థ, సామాజిక భద్రత, డిజిటల్ సేవలు, మౌలిక సదుపాయాల రంగాల్లో అనేక విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు, జీఎస్టీ, సీఏఏ, భారత న్యాయసంహిత, లేబర్ కోడ్లల సంఘటీకరణ వంటి కీలక నిర్ణయాలు తీసుకోవడమే కాక ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా అమలు చేశారన్నారు. ఈ మేరకు కేంద్రం అమలుచేస్తున్న పథకాలను బీజేపీ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, తద్వారా తెలంగాణలోనూ అధికారం సాధించొచ్చని బాల రాజు వివరించారు. సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేటర్ చెరుకు భాగ్యలక్ష్మి, డాక్టర్ విజయ్‌చందర్, జాటోత్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


