భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామివారి అంతరాలయంలోని మూలమూర్తులకు ఆదివారం అభిషేకం, సువర్ణ పుష్పార్చ న జరిపారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి స్వామి వారిని పల్లకీసేవగా చిత్రకూట మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు. భక్తులు నిత్య కల్యాణంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
గోదావరికి నదీ హారతి
భద్రాచలంలోని గోదావరి స్నాన ఘట్టాల వద్ద అధిక జ్యేష్టమాస అమావాస్య సందర్భంగా ఆదివారం నదీహారతి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. గణపతి పూజ, దీపోత్సవం, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. శాంతి మంత్ర పఠనంతో కార్యక్రమాన్ని ముగించారు. అర్చకులు రామ వజ్జల రవికుమార్, సత్యప్రసాద్ శర్మ, అశోక్‌కుమార్ శర్మ, సుబ్రహ్మణ్య ఆచార్యులు పాల్గొన్నారు.
నేడు ప్రజావాణి
సూపర్‌బజార్(కొత్తగూడెం): ప్రజాసమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించే ప్రజా వాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికా రులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజ లు తమ సమస్యలకు సంబంధించిన అంశాల ను లిఖితపూర్వక దరఖాస్తులను అందజేయాలని సూచించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం, కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా ప్రజావాణి నిర్వహించనున్నట్ల పేర్కొన్నారు.
ఐటీడీఏ, సబ్ కలెకరేట్‌లో..
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ కార్యాల యం, సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో సోమవారం నిర్వహించనున్న గిరిజన దర్బార్, ప్రజావాణి కార్యక్రమాలకు అన్నిశాఖల అధికారులు సకాలంలో హాజరుకావాలని పీఓ బి.రాహుల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ ఆదివారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. గిరిజనులు తమ సమస్యలపై అర్జీలను అందజేయాలని పేర్కొన్నారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) అమ్మవారికి ఆదివారం అర్చకులు విశేష పూజ లు నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసు పు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
భద్రాచలంటౌన్: భద్రాచలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వికాసం పాఠశాలల్లో 1 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పీఓ బి.రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. చెవిటి, మూగ, దృష్టిలోపం, ఇతర వికలాంగత కలిగిన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పాఠశాలలో ఉచిత విద్య, వసతి, భోజనంతోపాటు హియరింగ్ ఎయిడ్, స్పీచ్ థెరపీ, కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ అందిస్తామని పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన 7 నుంచి 16 ఏళ్ల వయస్సు గల ప్రత్యేక అవసరాలున్న పిల్లలను చేర్పించాలని, వివరాలకు 93811 81407, 6303 947240 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
రాత పరీక్షకు
642 మంది హాజరు
రుద్రంపూర్: సింగరేణి సంస్థలో ఖాళీగా ఉన్న 17 జూనియర్ కెమిస్ట్ /టెక్నికల్ ఇన్‌స్పెక్టర్ ఇంటర్నల్ పోస్టులకు ఆదివారం కొత్తగూడెం సింగరేణి మహిళా కళాశాలలో రాత పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 642 మంది అభ్యర్థులు హాజరుకాగా, కేంద్రాన్ని పర్సనల్ విభాగం జీఎం ఏజే మురళీధర్ పర్యవేక్షించారు.


