భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం అంతరాలయంలోని మూలమూర్తులు శుక్రవారం స్వర్ణకవచాలంకరణతో దర్శనమిచ్చారు. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం నిత్యకల్యాణానికి బేడా మండపంలో కొలువుదీరిన స్వామివారికి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపారు.
22న రామాలయ హుండీ లెక్కింపు
భద్రాచలం: ఈ నెల 22న శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం హుండీ లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈఓ దామోదర్ రావు శుక్రవారం ఒక తెలిపారు. సిబ్బంది, స్వచ్చంద సంస్థ సభ్యులు సకాలంలో హాజరు కావాలని కోరారు.
భద్రాచలం సబ్ ట్రెజరీ ఏటీఓగా మీనాక్షి
భద్రాచలంటౌన్: భద్రాచలం సబ్ ట్రెజరీ కార్యాలయం అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ (ఏటీఓ)గా మీనాక్షి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఏటీఓగా పనిచేసిన విష్ణురావు ఉద్యోగ విరమణ చేయడంతో, ప్రభుత్వం ఆమెను నియమించింది. మీనాక్షి ఇప్పటివరకు కొత్తగూడెంలో ఇన్‌చార్జి డీటీఓ, ఏటీఓగా పనిచేశారు. ఈ సందర్భంగా ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అసోసియేషన్ భద్రాచలం డివిజన్ అధ్యక్షుడు బందు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి కేఎస్‌ఎల్వీ ప్రసాద్, కోశాధికారి కృష్ణమూర్తి, సుభద్ర, ఉషారాణి, గౌరీ, రంజాన్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగానికి తోడ్పాటు
అశ్వారావుపేటరూరల్: వ్యవసాయ రంగానికి వ్యవసాయ విశ్వ విద్యాలయం ఎంతో తోడ్పాటునందిస్తోందని వ్యవసాయ కళాశాల ఇన్‌చార్జి అసోసియేట్ డీన్ డాక్టర్ ఐవీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. శుక్రవారం కళాశాలలో రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం 62వ స్థాపక దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులను అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఝాన్సీ రాణి, డాక్టర్ శ్రీజన్, స్రవంతి, రాంప్రసాద్, జంబమ్మ, కృష్ణతేజ, రమేష్ పాల్గొన్నారు.
లోక్ అదాలత్‌తో రాజీ..
జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి రాజేందర్
మణుగూరు టౌన్: పెండింగ్‌లో ఉన్న సివిల్, క్రిమినల్, చెక్కు బౌన్స్ తదితర కేసులను రాబోయే లోక్ అదాలత్‌లో పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయ సేవాసంస్థ సెక్రటరీ రాజేందర్ సూచించారు. శుక్రవారం మణుగూరు కోర్టు న్యాయవాదులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను త్వరితగతిన తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవచ్చని అన్నారు. కక్షిదారులకు సమయం, ధనం ఆదా అవుతాయని తెలిపారు. అంతకుముందు పినపాక మండలంలోని సీతారాంపురం గ్రామంలో ఇటుక బట్టీల యజమానులతో సమావేశమై ప్రపంచ బాలక కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అవగాహన కల్పించారు. మణుగూరు కోర్టు జడ్జి కంభపు సూరిరెడ్డి, బార్ అసొసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, జనరల్ సెక్రటరీ వీర మధుసూదన్, న్యాయవాదులు కుర్మ విజయరావు, శ్రీనివాసరెడ్డి, పద్మావతి, వాసవి, రమేశ్, సునీత, సుస్మిత, ప్రియాంక పాల్గొన్నారు.


