21 రైల్వే స్టేషన్ల పేర్ల
మార్పుపై కసరత్తు
● రైల్వే స్టేషన్ పేరు కొత్తగూడెంగా మార్చాలని విన్నపాలు ● పుణ్యక్షేత్రానికి సమీపంలో ఉండటంతో భద్రాచలం రోడ్‌గా ఏర్పాటు ● స్టేషన్ల పేర్ల మార్పుపై కసరత్తు నేపథ్యంలో ఇక్కడా మార్చితే మేలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: బ్రిటీష్ జమానాలో పెట్టిన రైల్వే స్టేషన్ల పేర్లను స్థానిక సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రకు తగ్గట్టుగా కొత్త పేరు పెట్టే ప్రక్రియ కొన్నేళ్లుగా జరుగుతోంది. మరోసారి ఈ అంశం తెర మీదకు రావడంతో జిల్లా కేంద్రంలో ఉన్న భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ పేరు మార్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన సమయం వచ్చింది.
భద్రాచలం – మల్కన్‌గిరి
ప్రస్తుతం భద్రాచలం– మల్కన్‌గిరి రైలు మార్గం మంజూరైంది. మల్కన్‌గిరి వైపు నుంచి పనులు జరుగుతున్నాయి. ఈ లైన్ అందుబాటులోకి వచ్చాక భద్రాచలంలో కొత్తగా రైల్వే స్టేషన్ నిర్మించాల్సి ఉంటుంది. దీనికితోడు కొత్తగూడెం– కిరండోల్ లైన్ సైతం ఫైనల్ లొకేషన్ సర్వే జరుపుకుని నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ మార్గం నిర్మించాల్సి వచ్చినా.. కొత్తగా అందుబాటులోకి రాబోయే భద్రాచలం దగ్గర నిర్మించే స్టేషన్ కీలకం అవుతుంది. ప్రస్తుతం కొత్తగూడెంలో ఉన్న భద్రాచలంరోడ్ స్టేషన్ పేరును మార్చని పక్షంలో భద్రాచలం, భద్రాచలంరోడ్ స్టేషన్ల పేర్ల మధ్య సామీప్యం వల్ల ప్రయాణికులు అయోమయానికి గురయ్యే అవకాశం ఉంటుంది.
ఇవీ చిక్కులు
గతంలోనూ భద్రాచలం రోడ్ స్టేషన్ పేరును కొత్తగూడెంగా మార్చాలనే డిమాండ్ వచ్చింది. సాంకేతిక చిక్కులు అందుకు అడ్డుగా నిలిచాయి. ప్రస్తుతం భద్రాచలంరోడ్ రైల్వే స్టేషన్ కోడ్‌నేమ్ బీడీసీఆర్‌గా ఉంది. రైల్వే ట్రాక్, సిగ్నల్స్, క్రూ తదితర నిర్వహణ, టికెట్ రిజర్వేషన్లలో కోడ్ ఎంతో కీలకం. భద్రాచలం రోడ్‌ను కొత్తగూడెంగా మార్చితే కొన్ని సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో నైనీతాల్ దగ్గర కాత్‌గోడం పేరుతో ఓ రైల్వే స్టేషన్ ఉండగా, కోడ్ నేమ్ కేజీఎంగా ఉంది. భద్రాచలంరోడ్ పేరును కొత్తగూడెంగా మార్చితే, కాత్‌గోడం (కేజీఎం)తో సాంకేతిక చిక్కులు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
రాష్ట్రం నుంచే ప్రతిపాదనలు
రైల్వే స్టేషన్ పేరును మార్చాలంటే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు రైల్వేశాఖకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతిపాదనపై రైల్వేశాఖ సానుకూల నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత కేంద్ర హోంశాఖ పరిశీలించి కొత్త పేరును ఖరారు చేస్తుంది. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భద్రాచలంరోడ్ స్టేషన్ పేరు మార్పుపై రాష్ట్ర సర్కారు, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి చొరవ చూపించాల్సి ఉంది.
1932లో ఏర్పాటు
సింగరేణి బొగ్గు తరలించేందుకు తొలిసారిగా డోర్నకల్ నుంచి ఇల్లెందుకు రైల్వే లైన్ 1927లో అందుబాటులోకి వచ్చింది. 1932 నాటికి కొత్తగూడెం రైల్వేలైన్ ఏర్పడింది. భద్రాచలం పుణ్యక్షేత్రానికి వెళ్లేందుకు దగ్గరగా ఉన్న రైలు మార్గం కావడంతో కొత్తగూడెంలో నిర్మించిన రైల్వే స్టేషన్‌కు భద్రాచలం రోడ్‌గా పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వే లెక్కల ప్రకారం గ్రేడ్–4 స్టేషన్‌గా ఉన్న భద్రాచలం రోడ్ స్టేషన్ నుంచి రోజూ నాలుగు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో మూడు రైళ్లకు భద్రాచలంరోడ్ స్టేషన్ టెర్మినల్ పాయింట్‌గా ఉంది. రోజూ 8,020 మంది ప్రయాణికులు స్టేషన్‌ను ఉపయోగించుకుంటుండగా, రూ.7.21 కోట్లు వార్షిక ఆదాయంగా ఉంది.
అమృత్ భారత్ పేరుతో దేశవ్యాప్తంగా 513 రైల్వే స్టేషన్లలో మౌలిక సదుపాయాలను రైల్వే శాఖ అభివృద్ధి చేస్తోంది. ఇదే సమయంలో కొన్ని స్టేషన్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలో 21 రైల్వే స్టేషన్ల పేర్ల మార్పు విషయంలో కసరత్తు జరుగుతోంది. ఇందులో కరీంనగర్ పేరును కరంనగర్‌గా, ఆదిలాబాద్ పేరును ఎదులాపురంగా, కాజీపేట జంక్షన్ పేరును వరంగల్ రోడ్ జంక్షన్‌గా మార్చాలని ప్రతిపాదించారు. ఏపీలో తెనాలికి తెనాలి రామన్ పేరును పరిశీలిస్తున్నారు. విజయనగరం ఇంగ్లిష్ స్పెల్లింగ్‌లో ఉన్న జెడ్ బదులు జేను చేర్చాలని నిర్ణయించారు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘అమృత్ భారత్’లో ఉన్న మధిర, ఖమ్మం, భద్రాచలంరోడ్ పేర్లను మార్చబోవడం లేదని పొరుగున ఉన్న మహబూబాబాద్ పేరు విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు. అయితే, భద్రాచలంరోడ్ (కొత్తగూడెం) స్టేషన్ పేరును మార్చాల్సిన అవసరం ఉంది.


