నవమి ఏర్పాట్లు షురూ | - | Sakshi
Sakshi News home page

నవమి ఏర్పాట్లు షురూ

Feb 27 2026 7:32 AM | Updated on Feb 27 2026 7:32 AM

నవమి

నవమి ఏర్పాట్లు షురూ

● భద్రగిరిలో కల్యాణ వేదికకు రంగులు వేస్తున్న కార్మికులు ● 4న సంప్రదాయబద్ధంగా పెండ్లి పనులు ప్రారంభం ● మిథిలా స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ● మార్చి 27న శ్రీరామనవమి, 28న పట్టాభిషేకం వేడుకలు

● భద్రగిరిలో కల్యాణ వేదికకు రంగులు వేస్తున్న కార్మికులు ● 4న సంప్రదాయబద్ధంగా పెండ్లి పనులు ప్రారంభం ● మిథిలా స్టేడియాన్ని పరిశీలించిన కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ ● మార్చి 27న శ్రీరామనవమి, 28న పట్టాభిషేకం వేడుకలు

భద్రాచలం: శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో మార్చి 27, 28వ తేదీల్లో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేక మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. భక్తులకు వసతితోపాటు స్టేడియంలో, ఆలయంలో, పర్ణశాలలో తాత్కాలిక పనులకు టెండర్లు ఖరారు చేశారు. రూ.1.30 కోట్ల పనులను కాంట్రాక్టర్లకు అప్పజెప్పారు. ఇందులో ప్రధానమైన రంగుల పనులను ప్రారంభించారు. కల్యాణ మండపంలోని షెడ్‌లతోపాటు కల్యాణ వేదికకు రంగులను అద్దుతున్నారు. మార్చి 3న హోలీ పౌర్ణమి రోజు సంప్రదాయబద్ధంగా స్వామివారి కల్యాణం ప్రారంభించాల్సి ఉంది. ఆ రోజు గ్రహణం కావడంతో 4న ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 4నే పసుపు, కుంకుమలను దంచి తలంబ్రాలను కలపే వేడుకతో పెండ్లి పనులు ప్రారంభం కానున్నాయి. హోలీ రంగులతో కల్యాణ రామయ్య దర్శనం ఇవ్వనుండగా, ఆ రోజునే స్వామివారిని పెండ్లి కొడుకుగా చేసే వేడుకగా భావిస్తారు. ఇక బ్రహ్మోత్సవాల వాల్‌పోస్టర్లను సిద్ధం చేస్తున్నారు. ఉగాది రోజున సీఎం రేవంత్‌ రెడ్డి, గవర్నర్లకు అందించనున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యే, ఇతర వీఐపీలకు వీటిని అందిస్తారు. టికెట్లను ఆన్‌లైన్‌లో ఉంచాల్సి ఉంది. రూ. 7,500 విలువైన 250 ఉభయదాతల టికెట్లను విక్రయించనున్నారు.

ఫాగ్‌మిస్ట్‌ను మళ్లీ పెడదాం: కలెక్టర్‌ జితేష్‌

భక్తులకు వేసవి తాపాన్ని తీర్చేందుకు గతేడాది మాదిరిగానే ఈ సారి కూడా స్టేడియంలో ఫాగ్‌మిస్ట్‌లు ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ సూచించారు. గురువారం ఆయన బదిలీని ప్రభుత్వం ప్రకటించాక శ్రీ సీతారామ చంద్రస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కల్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌ కుమార్‌ సింగ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ ఈఓ దామోదర్‌కు, ఏఎస్‌పీలకు పలు సూచనలు చేశారు. సీఎం, వీఐపీ, ఇతర గ్యాలరీలను పరిశీలించారు. వీఐపీలకు ఇబ్బందుల తలెత్తకుండానే సామాన్య భక్తులు ప్రశాంతంగా కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ముందు వరుసలో ఉన్న సీఎం సెక్టార్‌ను రెండు విభాగాలుగా విభజించి సీఎం, మంత్రులకు ఒక వైపు, మరో వైపు జ్యుడీషియల్‌ విభాగానికి కేటాయించాలని చెప్పారు. వేదికపైకి అర్చకులు తప్ప, ఇతరులెవరూ వెళ్లకుండా తక్కువ ఎత్తులో శాశ్వత బారికేడ్లను ఏర్పాట్లు చేయాలని ఆలయ ఈఈ రవీందర్‌కు సూచించారు. రెండు రోజుల క్రితం జరిగిన సమీక్షా సమావేశంలో సూచించిన మేరకు అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. బదిలీపై వెళ్లిన శ్రీరామనవమి చేసిన అనుభవం ఉండటంతో తన సహకారం, సూచనలు ఉంటాయని సబ్‌ కలెక్టర్‌ మృణాళ్‌ శ్రేష్టతో అన్నారు.

వ్యవసాయరంగం సంతృప్తి నిచ్చింది

కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో జిల్లాలో వ్యవసాయం రంగ అభివృద్ధికి చేసిన పనులు తనకు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ‘సాక్షి’తో అన్నారు. భద్రాచలం వచ్చిన ఆయనను సాక్షి పలుకరించగా ఈ విధంగా స్పందించారు. అతి తక్కువ కాలంలోనే జిల్లాలో ఉన్న ప్రకృతి వనరులను, ఎకో టూరిజానికి అనుసంధానం చేస్తూ చేసిన ప్రయత్నాలు చేశామని అన్నారు. ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను విజయవంతం చేయటంతోపాటు గోదావరి తల్లికి ప్రవేశపెట్టిన గోదావరి హారతి శాశ్వతంగా నిలిచిపోయేలా భక్తులు ఆదరించాలని కోరారు.

నవమి ఏర్పాట్లు షురూ1
1/1

నవమి ఏర్పాట్లు షురూ

Advertisement
 
Advertisement
Advertisement