మొర్రేడు ఖాళీ..!
వాగులో జేసీబీతో తవ్వకాలు
వాగులో నుంచి ఇష్టారాజ్యంగా
ఇసుక తోడేస్తున్నారు..
దందా వెనుక ఓ ప్రజాప్రతినిధి
కుమారుడి హస్తం!
పట్టించుకోని మైనింగ్, పోలీస్,
రెవెన్యూ శాఖల అధికారులు
పాల్వంచరూరల్: మొర్రేడు నుంచి ఇసుక తోడేస్తున్నారు. నిత్యంజేసీబీ యంత్రాల సహాయంతో లారీ లు, ట్రాక్టర్ల ద్వారా రాత్రి వేళ అక్రమంగా రవాణా చేస్తున్నారు. వాగులో ఇసుక నిల్వలు ఖాళీ అవుతుండటంతో సాగునీటి సమస్య ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని నెలల నుంచి దందా సాగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవ డం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. మండల పరిధిలోని తోగ్గూడెం, భోజ్యాతండా, దంతలబోరు ఎస్సీకాలనీ, బండ్రుగొండ, సంగం గ్రామాల మీదుగా ప్రవహించే మొర్రేడు దంతలబోరు శివారులో కిన్నెరసాని నదిలో కలుస్తుంది. ఈ వాగు నీళ్లపైన ఆధారపడి వానాకాలం, యాసంగి సీజన్లలో మండలంలో వందల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. మరోవైపు ములకలపల్లి మండల పరిధిలోని రైతులు కూడా పంటలు సాగు చేస్తుంటారు. వాగు పొంగి పొర్లడంతో వానాకాలం సీజన్‌లో సాగు చేసిన పంటలు నీటమునిగి పోతుంటాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతుంటారు. యాసంగి పంటలు మాత్రం రైతుల చేతికొస్తుంటాయి. ఇప్పుడు వాగులోని ఇసుక అడుగంటుతుండటంతో వాగు ఎండిపోయి, భూగర్భ జలాలు పడిపోయి, వేసవిలో సాగునీరు లభించదని, పంటలు ఎండిపోతాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
సర్పంచ్ అడ్డుకుంటున్నా...
ఇటీవల ఎన్నికై న నాగారం మహిళా సర్పంచ్ స్వప్న అక్రమ ఇసుక తరలింపును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బుధవారం ఉదయాన్నే మొర్రేడు వాగులో జేసీబీ యంత్రాన్ని అడ్డుకుని, పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు సర్పంచ్ తెలిపారు. సుమారు పది రోజుల క్రితం కూడా అర్ధరాత్రి వేళ ఆమె, గ్రామస్తులు కలిసి వాగులో ఉన్న జేసీబీ యంత్రాన్ని పట్టుకుని అధికారులకు ఫిర్యాదు చేశారు. కానీ అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదు.
స్పందించని మైనింగ్ శాఖ
భోజ్యాతండా వద్ద మొర్రేడు వాగు నుంచి రాత్రి సమయంలో జేసీబీ ప్రొక్లెయినర్ సహాయంతో ఇసుక తోడి, రవాణా చేస్తున్న విషయమై మైనింగ్ ఏడీ దినేష్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో పలుమార్లు ప్రయత్నించగా.. స్పందించలేదు.
కొందరు ఇసుకాసురులు తోగ్గూడెం, భోజ్యాతండా, దంతలబోరు ఎస్సీ కాలనీ ప్రాంతాల నుంచి ఇసుక తరలిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల సాకు చూపుతూ ప్రైవేటుగా అధిక రేట్లకు విక్రయించుకుంటున్నారు. భోజ్యాతండా వద్ద మాత్రం భారీ జేసీబీ యంత్రాన్ని వాగులోకి దింపి రాత్రి సమయంలో లారీల ద్వారా రవాణా చేస్తున్నారు. కానీ అక్రమార్కులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ దందా వెనుక ఓ ప్రజాప్రతినిధి కుమారుడి హస్తం ఉన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇసుక దందాను అరికట్టాల్సిన మైనింగ్ శాఖ, రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాత్రి సమయంలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని రైతులు, స్థానికులు కోరుతున్నారు.
మొర్రేడు ఖాళీ..!


