
పురుగుల మందు పిచికారీ చేస్తూ..
ఇల్లెందురూరల్: మండలంలోని రేపల్లెవాడ గ్రామానికి చెందిన రైతు వాంకుడోత్ రవి (40) వరి పొలంలో శుక్రవారం పురుగుల మందు పిచికారీ చేస్తూ అస్వస్థతకు గురై మృతి చెందాడు. స్థానిక రైతుల కథనం ప్రకారం.. రవి తనకున్న ఎకరన్నర పొలంలో వరిసాగు చేశాడు. మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకుని పత్తి సాగు చేపట్టాడు. గురువారం పత్తి చేనులో పురుగుల మందు పిచికారీ చేశాడు. శుక్రవారం వరి పొలంలో పురుగుల మందు పిచికారీ చేస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పొలం నుంచి బయటకు వచ్చి నేలపై వాలిపోయాడు. గమనించిన సమీప రైతులు ఇల్లెందు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు మార్గమధ్యలోనే మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్య సరిత, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, కాంగ్రెస్ నాయకులు పోటు రవి, కృష్ణ, శారద తదితరులు మృతదేహాన్ని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అస్వస్థతకు గురై గిరిజన రైతు మృతి