
ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి
పాల్వంచ: తొమ్మిది నెలలు నిండిన గర్భిణి ప్రసవం కోసం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి రాగా సకాలంలో వైద్యులు స్పందించక పోవడంతో శిశువు కడుపులోనే మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాల గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ కోరెం రాంప్రసాద్ భార్య కరుణ గర్భిణి కాగా నెలలు నిండటంతో ప్రసవం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి మంగళవారం ఉద యం తీసుకొచ్చారు. అయితే వైద్యులు సాధారణ కాన్పు కోసం మధ్యాహ్నం 12గంటల వరకు ప్రయత్నించారు. అనంతరం ఆపరేషన్ చేయగా.. బాబు గర్భంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు బోరుమన్నారు. అనంతరం ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. రాంప్రసాద్, ఆయన బంధువు రాము మాట్లాడుతూ.. కేవలం వైద్యుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని, ఉదయం 7 గంటలకు ఆస్పత్రిలో చేరితే ఆలస్యం చేశారని, కరుణ ఎంత ప్రాధేయపడినా చేయలేదని, చివరికి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి కడుపులోనే చనిపోయాడని బిడ్డను చేతిలో పెట్టార ని కన్నీటి పర్యంతమయ్యారు. ఉన్నతాధికారులు స్పందించి, పూర్తి విచారణచేసి ఆపరేషన్ చేసిన వైద్యులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, తమ కు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విష యమై ఆస్పత్రి సూపరింటెండెంట్ రాంప్రసాద్‌ను వివరణ కోరగా ఉమ్మనీరు, మలమూత్రం మింగడం, మెడలో పేగు వేసుకుని ఉండటంతో ఊపిరాడక మృతి చెందాడని, వైద్యుల తప్పిదం ఏమీలేదని, వారు తమవంతు కృషి చేశారని, శిశువు మృతి చెందడం తమకు కూడా బాధాకరమని తెలిపారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఆరోపణ