
ప్రారంభమైన ఎప్‌సెట్ కౌన్సెలింగ్
ఖమ్మం సహకారనగర్: ఎప్‌సెట్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ మంగళవారం మొదలైంది. ఖమ్మంలోని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో కౌన్సెలింగ్ సెంటర్ ఏర్పాటుచేయగా, ఉదయం 9నుంచి సాయంత్రం 6–30గంటల వరకు సర్టిఫికెట్లు పరిశీలిస్తామని అధికారులు ప్రకటించారు. అయితే, చాలా మంది విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఉదయం 8–30గంటలకల్లా కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల నుంచి స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్పించగా, తొలిరోజు 570మంది విద్యార్థులకు గాను 510మంది సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరయ్యారని ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు.
ఇతర జిల్లాల నుంచి సైతం...
ఖమ్మంలోని ఎప్‌సెట్ కౌన్సెలింగ్ కేంద్రానికి ఉమ్మడి జిల్లా నుంచే కాక సమీప జిల్లాల విద్యార్థులు సైతం హాజరయ్యారు. రాష్ట్రంలో ఎక్కడైనా కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం ఉండడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం సహా మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల విద్యార్థులు కూడా వచ్చారు. కాగా, సెంటర్ వద్ద పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల సిబ్బంది తమ కళాశాలల్లో చేరాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు బ్రోచర్లు ఇస్తూ ప్రచారం చేయడం కనిపించింది.
సర్వర్ మొరాయింపు
కౌన్సెలింగ్‌కు మొదటిరోజైన మంగళవారం ఎక్కువ మంది విద్యార్థులు స్లాట్ బుక్ చేసుకున్నారు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండడంతో సర్వర్ మొరాయించింది. దీంతో సర్టిఫికెట్ల పరిశీలన నత్తనడకన కొనసాగగా విద్యార్థులు, తల్లిదండ్రులు గంటల తరబడి వేచిచూడాల్సి రావడంతో అసహనానికి గురయ్యారు.
తొలిరోజు మొరాయించిన సర్వర్
గంటల తరబడి వేచి ఉన్న విద్యార్థులు, తల్లిదండ్రులు

ప్రారంభమైన ఎప్‌సెట్ కౌన్సెలింగ్