
రైతు భరోసా ఎన్నికల జిమ్మిక్కే..
● బీసీ రిజర్వేషన్లు అమలయ్యేవరకు ఎన్నికలు వద్దు ● ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఖమ్మంఅర్బన్/నేలకొండపల్లి: రైతులను మభ్యపెట్టి ఓట్లు సాధించేలా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పథకాన్ని ఇచ్చిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. ఇది నిజమైన సంక్షేమం కాదని, కేవలం ఎన్నికల స్టంట్ మాత్రమేనని ప్రజలంతా భావిస్తున్నారని తెలిపారు. ఖమ్మంలో ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ కుటుంబంతో పాటు నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురంలో తెలంగాణ జాగృతి నాయకురాలు అనిత తండ్రి నల్లబోతు నరసింహారావు మృతి చెందగా వారి కుటుంబాలను కవిత బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉండి కూడా వడ్ల కొనుగోలులో ఇబ్బంది ఎదుర్కొన్న రైతులను పలకరించలేదని తెలిపారు. సన్న రకం పేరుతో బోనస్ అంటూ రైతులను మభ్యపెట్టారని చెప్పారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని, అప్పటివరకు ఎన్నికలు నిర్వహించొద్దని డిమాండ్ చేశారు. బిల్లు ఆమోదానికి ఈనెల 17న రైల్‌రోకో నిర్వహిస్తుండగా, మద్దతు ఇవ్వాలని బీసీ సంఘాలను కోరడమే కాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకు లేఖ రాశామని ఆమె వెల్లడించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలేమయ్యాయి?
ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎమ్మెల్సీ ధ్వజమెత్తారు. ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధిని విస్మరించడమే కాక ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాగా, గోదావరి జలాల తరలింపుపై జిల్లా మంత్రులు మాట్లాడకపోవడం ఏమిటని ప్రశ్నించిన కవిత, భద్రాద్రి రాముడి అభివృద్ధికి ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలను తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజుతో పాటు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, సేవాలాల్‌నాయక్, కిషన్‌నాయక్, వాంకుడోత్ సురేష్, తదితరులు పాల్గొన్నారు.