
కళలపై మక్కువ పెంపొందించాలి
దుమ్ముగూడెం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు చదువుతోపాటు వారికి నచ్చిన కళలపై ఇష్టాన్ని పెంపొందించాలని, వారిలో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికి తీయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ సూచించారు. బుధవారం మండలంలోని కొత్తపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి పాఠశాల పరిసరాలు, తరగతి గదులు, గ్రంథాలయం, బోధిస్తు న్న పాఠ్యాంశాలను పరిశీలించారు. ముందుగా మూడో తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుతున్న పిల్లలకు ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో చెప్పించారు. అనంతరం ఆరు నుంచి 9వ తరగతి వరకు నిర్వహిస్తున్న క్లాసులను, బోధనా తీరును పరిశీలించారు. చిన్నారుల చేత ఇంగ్లిష్ పదాలను బోర్డుపై రాయించి వాటి అర్థాలను తెలుగులో పూర్తిగా చెప్పేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు. అదనంగా విద్యార్థులకు ఇష్టమైన వ్యాసరచన, క్విజ్, నాటికలు, ఏకపాత్రాభినయానికి సంబంధించిన కళలపై అవగాహన కల్పించాలని సూచించారు. వర్షాలు మొదలైనందున రాత్రిపూట విద్యార్థులు బయటకు రాకుండా చూడాలని, ప్రతీ రోజు వంటగది శుభ్రం చేసి మెనూ ప్రకారం విద్యార్థులకు వేడిగా ఆహారాన్ని వడ్డించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నరసింహారావు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.