
నాటుకోళ్ల చోరీకి విఫలయత్నం
చండ్రుగొండ: మండలంలోని తిప్పనపల్లిలో పలువురు దుండగులు నాటుకోళ్ల చోరీకి యత్నించారు. గ్రామంలోని అబ్దుల్‌కలాంబజార్‌కు మంగళవారం అర్ధరాత్రి చేరుకున్న సుమారు పదిమంది పలువురి ఇళ్లలో నుంచి 50 నాటుకోళ్లను అపహరించి సమీపంలోని మసీద్‌లోని మూత్రశాలల్లో దాచారు. ఆపై ఇంకొన్ని కోళ్లను చోరీ చేసేందుకు కొందరు యత్నిస్తుండగా, మిగతా వారు దాచిన కోళ్లను తరలించే యత్నంలో నిమగ్నమయ్యారు. బుధవారం తెల్లవారుజామున నమాజ్ సమయం కావడంతో మసీద్ కమిటీ ఉపాధ్యక్షుడు బషార్ వచ్చేసరికి కోళ్ల అరుపు లు వినిపిస్తుండడంతో చూసేసరికి దొంగలు పారి పోయారు. ఆపై గ్రామస్తులు చేరుకుని ఎవరి కోళ్లను వారు తీసుకెళ్లారు.
జూదరుల అరెస్ట్
ములకలపల్లి: హౌజీ (జూదం) ఆటాడతున్న 9 మందిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రాజశేఖర్ కథనం మేరకు.. మండలంలోని మొగరాలగుప్ప గ్రామంలో హౌసీ ఆట ఆడుతున్నట్లు సమాచారం అందింది. దీంతో ఎస్‌ఐ సిబ్బందితో దాడి చేసి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. రూ.1,680 నగదు స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు.
ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసు
పాల్వంచ: సకాలంలో వైద్యం అందించక పోవడంతో శిశువు మృతి చెందిన ఘటనలో ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు.. లక్ష్మీదేవిపల్లి మండలం తోకబంధాలకు చెందిన రాంప్రసాద్ తన భార్య కరుణకు నొప్పులు రావడంతో గత మంగళవారం పాల్వంచ సీహెచ్‌సీకి తీసుకొచ్చాడు. ఆమెను ఉదయం 10.30 గంటలకు పరిశీలించిన వైద్యురాలు అనూషలక్ష్మీ నార్మల్ డెలీవరీ అవుతుందని తెలిపారు. ఆపరేషన్ చేయమని కోరుతున్నా వినకుండా బ్లీడింగ్ అవుతున్నా ఎక్సర్ సైజ్ చేయించారని, అనంతరం 12.50 గంటలకు ఆపరేషన్ చేసి మగ శిశువును అందించి చనిపోయాడని చెప్పారని, వైద్యురాలు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి సకాలంలో ఆపరేషన్ చేస్తే శిశువు మృతి చెందే పరిస్థితి ఉండేది కాదని రాంప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఎస్‌ఐ సుమన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వరకట్న వేధింపులపై ఫిర్యాదు
ఇల్లెందు: ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త తనను వరకట్నం కోసం వేధిస్తున్నాడని ఆరోపిస్తూ పట్టణంలోని జేకేకాలనీకి చెందిన బండారు మౌనిక బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. జేకేకాలనీకి చెందిన బండారు వీరన్న, మౌనిక ప్రేమించి పెద్దలను ఒప్పించి కులాంతర వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత భర్త వీరన్న, అతని తల్లితండ్రులు, ఆడపడుచు వరకట్నం తేవాలంటూ మానసికంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని, భర్త మద్యం సేవించి తమ కుటుంబం పట్ల అసభ్యకరంగా దూషిస్తున్నాడని మౌనిక ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘బ్లీచింగ్‌కూ నిధులు
ఇవ్వని ప్రభుత్వం’
నేలకొండపల్లి: రాష్టంలో కొందరు మీడియా ముసుగులో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆరోపించారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేందుకు కూడా నిధులు రాకపోవడం, ట్రాక్టర్లలో డీజిల్ పోయించే పరిస్థితి లేక కార్యదర్శులు సెలవులో వెళ్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌ను సీఎంగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ ప్రభావం కనపడుతుందని ఎమ్మెల్సీ ధీమా వ్యక్తం చేశారు.