
కాంగోలో జిల్లా వాసి మృతి
కొత్తగూడెంఅర్బన్: దక్షిణాఫ్రికా ఖండం కాంగోలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీకి చెందిన సయ్యద్ అనీశ్ (45) మృతి చెందాడు. లక్ష్మీదేవిపల్లి పోలీసుల కథనం ప్రకారం.. పదేళ్ల కిందట దుబాయ్ వెళ్లిన అనీశ్.. అక్కడ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్నాడు. విధుల్లో భాగంగా కాంగో వెళ్లిన అనీశ్ కారులో ప్రయాణిస్తుండగా జరిగిన ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాద ఘటనను అక్కడి దేశస్తులు స్థానిక పోలీసులకు తెలపగా వారు అనీశ్ తండ్రి అక్రమ్‌కు, కుటుంబ సభ్యులకు తెలిపారు. ఢిల్లీలో ఉండి ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, అనీశ్ కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పి ఓదార్చారు.
చికిత్స పొందుతున్న వివాహిత మృతి
దుమ్ముగూడెం: మండలంలోని నందులచలక గ్రామానికి చెందిన గుండి నాగమణి (30) పురుగులమందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఎస్‌ఐ గణేశ్ కథనం ప్రకారం.. నాగమణి గత నెల 22వ తేదీన కుటుంబ గొడవల కారణంగా పురుగులమందు తాగింది. అప్పటి నుంచి వైద్యశాలలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. మృతురాలి భర్త గుండి భద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
పాల్వంచరూరల్: ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టగా ముగ్గురు గాయపడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉల్వనూరు నుంచి పాల్వంచ వైపు వస్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్రాక్టర్ యూటర్న్ తీసుకుంటూ ఢీకొట్టింది. ఆటోడ్రైవర్ కొక్కు యాదగిరి, బుల్లి, గండికోట రమేశ్ గాయపడ్డారు. ఆటోడ్రైవర్ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ట్రాక్టర్ డ్రైవర్ కాలం ప్రవీణ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
అట్రాసిటీ కేసు నమోదు
అశ్వాపురం: మండలంలోని మొండికుంట గ్రామానికి చెందిన వ్యక్తిపై మంగళవారం అశ్వాపురం పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మల్లెలమడుగు గ్రామ పంచాయతీలోని చింతకుంట గ్రామానికి చెందిన గిరిజన యువతి పొలంలో ఉండగా మొండికుంట గ్రామానికి చెందిన తోవిటి యాదగిరి అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ అనంతరం మంగళవారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుప్రసాద్ తెలిపారు.