ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ.. | - | Sakshi
Sakshi News home page

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..

Jun 29 2025 2:44 AM | Updated on Jun 29 2025 2:44 AM

ఇల్లె

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..

పంటల భద్రతకు వీలుగా..

ఇటీవల ఇల్లెందు మార్కెట్‌లో జరిగిన పాలక మండలి సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం విషయాన్ని ప్రస్తావించారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహకారంతో రైతులకు ఉపయోగపడేలా ఇక్కడ కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం చేపడతామన్నారు. పంటలకు సరైన ధరలు లేనప్పుడు కొంతకాలం దాచేందుకు వీలుగా ఇల్లెందులో ఒక కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం చేయాలని నిర్ణయించారు.

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో..

ప్రభుత్వం నుంచి కోల్డ్‌ స్టోరేజీకి సరిపడా నిధులు విడుదలయ్యే అవకాశం లేదు. ఈ తరుణాన ప్రైవేట్‌ భాగస్వామ్యంతో నిర్మించాలనుకున్నారు. దీనికి కనీసం 5 ఎకరాల స్థలం కావాల్సి ఉంది. ప్రభుత్వ భవనాలకే స్థలం కొరత తీవ్రంగా ఉండగా.. మండలం వెలుపల నిర్మిద్దామంటే 1/70 చట్టం అడ్డుగా మారబోతుంది. దీన్ని అధిగమించేందుకు ఇల్లెందు వ్యవసాయ మార్కెట్‌ యార్డులో 6 ఎకరాల స్థలం ఉంది. ఇక్కడ హమాలీలు రెండు ముఠాలుగా విడిపోయి ఘర్షణలు జరగడంతో ఎన్నో ఏళ్లుగా మార్కెట్‌ సాగడం లేదు. దీనిలోని గోదాంలు సైతం సరుకు నిల్వకు ఆశించినంత ఉపయోగపడకపోవడంతో సివిల్‌ సప్లై శాఖ పీడీఎస్‌ బియ్యం నిల్వకు వినియోగించుకుంటున్నారు. దీనికి తోడు కొంతమంది వ్యాపారులు తమ సరుకు నిల్వలకు వాడుకుంటున్నారు. పడావుపడిన మార్కెట్‌ యార్డులో పశువులు, కోతులు, కుక్కలకు ఆవాసాలుగా మారిన తరుణంలో కోల్డ్‌ స్టోరేజీగా మారిస్తే రైతులకు, వ్యాపారుల సరుకు నిల్వలకు ఉపయోగపడే అవకాశం ఉంది. ఈ దిశగా స్థానిక మార్కెట్‌ కమిటీ సమాలోచనలు చేస్తోంది.

ఎన్‌ఓసీ అవసరం..

కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి ఐదెకరాల భూమి, విద్యుత్‌, ఫైర్‌, బీమా, లీగల్‌ మెట్రాలజీ, పొల్యూషన్‌ శాఖ నుంచి ఎన్‌ఓసీ కావాల్సి ఉంటుంది. ప్రైవేట్‌ భాగస్వామ్యంతో అయితే బ్యాంకుల నుంచి రుణం కూడా పొందే అవకాశం ఉంది. నిర్మాణం జరిగితే మార్కెట్‌కు నిరంతరం ఆదాయంతో పాటు సరుకుకు భద్రత కలగనుంది. పడావుపడిన మార్కెట్‌ యార్డును ఉపయోగంలోకి తెచ్చి సబ్‌ యార్డుల్లో క్రయవిక్రయాలు సాగించే అవకాశం ఉంటుందని మార్కెట్‌ అధికారులు అంటున్నారు.

ఉమ్మడి జిల్లాలో తొలి మార్కెట్‌ ..

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1975 మే నెల 4న ఆనాటి సీఎం జలగం వెంగళరావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నెమరుగొమ్ముల రాఘవేంద్రరావు, ఉపాధ్యక్షుడు పర్సా లక్ష్మీనర్సింహారావులు శంకుస్థాపన చేశారు. ప్రారంభంలో జోరుగా క్రయవిక్రయాలు జరిగిన ఈ మార్కెట్‌ యార్డులో క్రమంగా చెక్‌ పోస్టుల ద్వారా ఆదాయం సమకూర్చుకునే దిశకు చేరాయి. ఆరు ఎకరాల స్థలం కలిగిన ఈ మార్కెట్‌ పరిధిలో ప్రస్తుతం మూడు జిల్లాలో ఎనిమిది మండలాల పరిధిలో మార్కెట్‌ విస్తరించి ఉంది.

మార్కెట్‌ యార్డులో ఐదు ఎకరాల్లో నిర్మాణం

ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు

లక్ష బస్తాలు నిల్వ దిశగా ప్రణాళిక

మిర్చి, బెల్లం, ఎల్లిపాయలు, అల్లం, పసుపు నిల్వలకు చాన్స్‌

రూ.3 కోట్ల నుంచి రూ. 4 కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు లేవు. ఏ పంట నిల్వ చేసుకోవాలన్నా ఖమ్మం, మహబూబాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఈనేపథ్యాన ప్రస్తుత మార్కెట్‌ పాలక వర్గం ఇల్లెందు పట్టణ నడిబొడ్డున గల వ్యవసాయ మార్కెట్‌ యార్డులో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి ఓ ప్రైవేట్‌ భాగస్వామ్యంతో ప్రణాళికలు చేస్తోంది. ఇందుకు తగిన ప్రతిపాదనలను రూపొందించేలా చర్యలు ప్రారంభించింది. – ఇల్లెందు

కోల్డ్‌స్టోరేజీ లేని జిల్లా..

జిల్లాలో కోల్డ్‌ స్టోరేజీలు లేవు. ఎవరైనా నిర్మాణం చేయాలంటే భూమి సమస్య తీవ్రంగా ఉంది. లేదంటే 1/70 చట్టం అడ్డుగా ఉంది. ఇల్లెందులో మార్కెట్‌ స్థలంలో మాత్రమే ఈ అవకాశం ఉండడంతో పాలక వర్గం ఆవైపుగా దృష్టి సారించింది. ఇక్కడ నిర్మాణం చేపడితే ఇల్లెందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాలతో పాటు భద్రాచలం, మణుగూరు, కొత్తగూడెం వంటి ప్రాంతాల వారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. కనీసం లక్ష క్వింటాళ్ల సరుకు నిల్వ చేసేలా నిర్మాణం చేయాలని భావిస్తున్నారు

ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం..

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. పాలకులు మారుతున్నారే కానీ దీని నిర్మాణానికి ఎలాంటి ఆలోచన చేయలేదు. ప్రస్తుత పాలక వర్గం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

– బానోతు రాంబాబు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌

రైతుల మేలు కోసం..

ఇల్లెందులో గిరిజన రైతుల మేలు కోసం నిర్మించే కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణం కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తాం. దీని ద్వారా మిర్చి, ఇతర పంటలతో పాటు వ్యవసాయ ఉత్పత్తులు నిల్వ చేసుకుని గిట్టుబాటు ధరలు పొందొచ్చు.

– నాళ్ల సోమసుందర్‌, వ్యాపారి

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..1
1/3

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..2
2/3

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..3
3/3

ఇల్లెందులో కోల్డ్‌ స్టోరేజీ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement