‘సంపన్నకారి’తో వ్యాపారాలు మెరుగు | - | Sakshi
Sakshi News home page

‘సంపన్నకారి’తో వ్యాపారాలు మెరుగు

Mar 29 2026 7:03 AM | Updated on Mar 29 2026 7:03 AM

ఇంకొల్లు(చినగంజాం): మహిళా గ్రూపులు సంపన్నకారి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ప్రమీల సూచించారు. మండల వెలుగు కార్యాలయంలో శనివారం గ్రామ సంఘ సహాయకులకు, గ్రూపు సభ్యులకు సంపన్న కారి కార్యక్రమంపై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంపన్న కారి అంటే వ్యాపారాలు ఒక స్థాయి దాటిన తరువాత మరింతగా అభివృద్ధి చెందటానికి సరైన వ్యాపార ప్రణాళిక, మార్కెట్‌ అవకాశాలు, పెట్టుబడి అవసరమవుతుంది. వారికి సహాయం లేక వ్యాపారం విస్తరించటం కష్టంగా మారుతుంది. సమస్యను పరిష్కరించటానికి రూపొందించినదే సంపన్నకారి కార్యక్రమం అని అన్నారు. కార్యక్రమంలో ఎంపిక చేసిన వ్యాపారాలకు ఒక పద్ధతిలో రూపొందించిన విధానం ద్వారా సహాయం పూర్తిగా ఉచితంగా అందిస్తారన్నారు. వ్యాపారాలు తమ పనితీరు, మార్కెట్‌ పరిధి, ఆదాయానికి పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమం ముఖ్య లక్ష్యం సంవత్సరానికి కనీసం 15 శాతం ఆదాయం పెరుగుదల సాధించేలా సహాయం చేయడమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అంతటా 150 రకాల వ్యాపారాలు మాత్రమే ఎంపిక చేస్తారని, కనీసం 18 నెలలు సహాయం అందుతుందని, సహాయం రూ.15 లక్షలు వరకు గ్రాంట్‌ రూ.4 లక్షలు వరకు సున్నా వడ్డీ రుణ సహాయంగా ఉంటుందని ఆమె తెలిపారు. సంపన్నకారి కార్యక్రమానికి దరఖాస్తు చేసుకునేందుకు ఎస్‌ఎస్‌సీ అర్హత కలిగి మహిళలు నడుపుతున్న వ్యాపారమై, రాష్ట్రంలోనే కనీసం రెండు సంవత్సరాలుగా నడుపుతూ ఉండాలన్నారు. వార్షిక ఆదాయం వ్యక్తిగత వ్యాపారానికి రూ.12 లక్షలు, గ్రూపు వ్యాపారానికి రూ.15 లక్షలు ఉండాలని తెలియజేశారు. సంపన్నకారి కార్యక్రమంలో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు సేవా రంగం, తయారీ రంగంలో ఉన్న వారు మాత్రమే అర్హులని, ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎక్కువ మందికి కార్యక్రమంపై అవగాహన కల్పించాలని తెలియజేశారు. దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్‌ 15 వతేదీ లోపు చేసుకోవాలని తెలియజేసి కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీఎం అనురాధ, సీసీలు, అకౌంటెంట్‌ పాల్గొన్నారు.

– జిల్లా ప్రాజెక్ట్‌ మేనేజర్‌ ప్రమీల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement