కేంద్ర బడ్జెట్‌ ఓ విక‘సిక్‌’ బడ్జెట్‌ | - | Sakshi
Sakshi News home page

కేంద్ర బడ్జెట్‌ ఓ విక‘సిక్‌’ బడ్జెట్‌

Feb 8 2026 4:26 AM | Updated on Feb 8 2026 4:26 AM

కేంద్ర బడ్జెట్‌ ఓ విక‘సిక్‌’ బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్‌ ఓ విక‘సిక్‌’ బడ్జెట్‌

ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు

రెంటచింతల: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌ సామాన్యులకు ఓ విక‘సిక్‌’ బడ్జెట్‌ అని దీనివలన వారికి ఒరిగేదేమి లేదని కేవలం ఇది కార్పొరేట్‌లకు మాత్రమే ఉపయోగపడేలా ఉందని కన్నెగంటి హనుమంతు ఫౌండేషన్‌ అధ్యక్షుడు, ప్రముఖ విద్యావేత్త శ్రీనివాసరావు అన్నారు. శనివారం మండల కేంద్రమైన రెంటచింతలలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశ,దిశ లేని బడ్జెట్‌ మాత్రమే కాక స్పష్టతలేని ఈ బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మెండిచేయి చూపించారని విమర్శించారు. కీలక రంగాలకు సరైన కేటాయింపులు లేవని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు యువత, మహిళ, కౌలురైతు, విద్యారంగం ఉద్యోగులకు శ్రామిక, పేద, మధ్య తరగతి వర్గాలకు పన్ను సడలింపులో ప్రత్యేక ఉపశమనం లేదన్నారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడంతోపాటు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక, రాజకీయాలకు సంబంధించి బడ్జెట్‌లో పరిష్కారమార్గాలు చూపలేకపోయారన్నారు. ప్రజలు బాధలు తీర్చలేని నిరాశ బడ్జెట్‌అని, ఆర్థిక వ్యవస్థను దిగజార్చే బడ్జెట్‌ అన్నారు. దేశంలో 147 కోట్ల మందికి ఒక్కొక్కరి తలపై 1.34 లక్షల అప్పు ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ప్రాజెక్టులు కేటాయించకపోవడం తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. విశాఖ ఉక్కు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి, రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం దారుణమన్నారు. రాష్ట్రం నుంచి 22 మంది ఎంపీలు ఉన్నా సాధించింది ఏంలేదన్నారు. రాష్ట్ర విభజన హామీలను సైతం విస్మరించారని గుర్తు చేశారు. ఈ బడ్జెట్‌లో సామాన్య ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement