అందంలో మెరిసి.. ఆత్మవిశ్వాసం చాటి..
మిస్ ఆంధ్ర – 2025 పోటీలలో ప్రతిభ చూపిన బాపట్ల యువతి
బాపట్ల: మిస్ ఆంధ్రప్రదేశ్ – 2025 పోటీలలో బాపట్లకు చెందిన వడాలశెట్టి కోమల సాయి హర్షిత ప్రతిభ కనబరిచి రన్నర్‌గా నిలిచారు. విజయవాడలో ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాలులో జరిగిన ఈ టైటిల్ పోరులో తన ప్రతిభ ప్రదర్శించారు. కేవలం బాహ్య సౌందర్యానికి పరిమితం కాకుండా ఆత్మవిశ్వాసం, ప్రతిభ, వ్యక్తిత్వం ఆధారంగా జరిగే ఈ అందాల పోటీలు మహిళల సాధికారత, స్వయం ప్రతిపత్తి, భావ ప్రకటన నైపుణ్యం వంటి గుణాలను ప్రదర్శించే వేదికగా నిలిచాయి.
చిన్ననాటి నుంచే..
ఫైనలిస్ట్‌గా ఎంపికై న కోమల సాయి హర్షిత ఆద్యంతం తన విశిష్టతను, వ్యక్తిత్వ వికాసాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించి అబ్బురపరిచారు. చక్కటి మాట తీరుతో నిర్భయంగా, స్పష్టంగా తన అభిప్రాయాలను వ్యక్తపరచిన తీరు ఆకట్టుకుంది. కోమల సాయి బాల్యం నుంచి విద్యాభ్యాసంలో చురుకుగా ఉంటూనే, వక్తృత్వ పోటీలలో ముందంజలో ఉండేవారు. అనేక వేదికలపై అనర్గళంగా ప్రసంగిస్తూ భావ ప్రకటనలో తన నైపుణ్యాన్ని పెంచుకున్నారు. అనేక బహుమతులు సాధించి, తన సత్తా చాటుకున్నారు. ప్రస్తుతం బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఆనర్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు.
తండ్రి స్ఫూర్తిగా..
సివిల్స్‌లో టాపర్‌గా నిలవాలనేదే తన భవిష్యత్తు లక్ష్యమని వివరించారు. ముఖ్యంగా మహిళల సాధికారత, స్వావలంబన కోసం పనిచేయాలన్నది తన అభిమతమని తెలిపారు. మున్సిపల్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న తండ్రి నిర్మల్ కుమార్ తనకు స్ఫూర్తి అని చెప్పారు. పోటీలో గెలవడం కంటే తనకు లభించిన అవకాశాన్ని ఎంత మేరకు సద్వినియోగం చేసుకున్నాననేదే ముఖ్యమని తెలిపారు.
అందంలో మెరిసి.. ఆత్మవిశ్వాసం చాటి..


