రైతు సేవ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి | - | Sakshi
Sakshi News home page

రైతు సేవ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి

Dec 10 2025 7:42 AM | Updated on Dec 10 2025 7:42 AM

రైతు సేవ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి

రైతు సేవ కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించండి

రైతులకు జిల్లా కలెక్టర్‌ సూచన

కర్లపాలెం: రైతులు ధాన్యాన్ని రైతు సేవ కేంద్రాల ద్వారా విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ చెప్పారు. మంగళవారం జిల్లా కర్లపాలెం మండలంలోని ఏట్రవారిపాలెం, కర్లపాలెం, సమ్మెటవారిపాలెం గ్రామాలలో ఆయన పర్యటించారు. సమ్మెటవారిపాలెంలో రైతు సేవ కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కొనుగోలు తీరు పరిశీలించారు. రైతులకు గోనె సంచులు ఉచితంగా ఇవ్వాలని చెప్పారు. రైతులే తెచ్చుకుంటే డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. దళారులను రైతులు నమ్మి నష్టపోవద్దని చెప్పారు. ఏట్రవారిపాలెం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్‌ కూరగాయల మార్కెట్‌ను, చేపల మార్కెట్‌ను జిల్లా కలెక్టర్‌ సందర్శించారు. ఎన్ని షాపులు ఖాళీగా ఉన్నాయని ఆరా తీశారు. ఆర్డీవో పి.గ్లోరియా, పౌర సరఫరాల సంస్థ ఎండీ శ్రీలక్ష్మి, తహసీల్దార్‌ షాకీర్‌ పాషా, ఎంపీడీవో శ్రీనివాసరావు, ఏవో సుమంత్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

అనాథ పిల్లలకు ఉచిత వైద్యం

ఎన్టీఆర్‌ హెల్త్‌ కార్డుల ద్వారా అనాథ పిల్లలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందుతుందని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహంలోని అనాథలకు ఎన్టీఆర్‌ హెల్త్‌ కార్డులను మంగళవారం అందజేశారు. మహిళాశిశు సంక్షేమ శాఖ పీడీ రాధా మాధవి, ఐసీడీఎస్‌ డీసీపీ యు. పురుషోత్తం, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.విజయమ్మ, ఎన్టీఆర్‌ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులను ప్రోత్సహించాలి

విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. విద్య అనుబంధ రంగాలపై సంబంధిత శాఖల జిల్లా అధికారులతో మంగళవారం స్థానిక కలెక్టరేట్లో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు మెరుగైన బోధన అందించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం సమర్థంగా నిర్వహించాలని చెప్పారు. ప్రభుత్వ వసతి గృహాలు, జూనియర్‌ కళాశాలలపై పర్యవేక్షణ పెరగాలన్నారు. డీఈవో పురుషోత్తం, ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారిణి రాజదిబోరా, బీసీ సంక్షేమ శాఖ అధికారిణి శివలీల, ఎస్టీ సంక్షేమ శాాఖ అధికారి జి.అబ్బులు తదితరులు పాల్గొన్నారు.

ఉత్పత్తి రంగాలపై బ్యాంకర్లు దృష్టి పెట్టాలి

ఉత్పత్తి రంగాల వైపు బ్యాంకర్లు దృష్టి సారించాలని, జీవనోపాధుల వృద్ధికి అధిక రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. జిల్లా స్థాయి బ్యాంకర్ల కమిటీ సమీక్ష సమావేశం కలెక్టర్‌ అధ్యక్షతన మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ లో జరిగింది. మహిళల స్వయం ఉపాధి యూనిట్ల స్థాపనకు అధిక ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పారు. ప్రాధాన్యత రంగాలకు రూ.13,792.66 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.8,315 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. ప్రాధాన్యత లేని రంగాలకు రూ.20.27 కోట్లు లక్ష్యం కాగా, రూ.23.03 కోట్లు రుణాలు ఇచ్చినట్లు వివరించారు. ఇతర రంగాలకు రూ.421.04 కోట్లు లక్ష్యం కాగా, ఇప్పటివరకు రూ.131.70 కోట్లు రుణాలు పంపిణీ చేశామన్నారు. మొత్తంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.15,820 కోట్లు లక్ష్యం కాగా, నేటికి రూ.10,618 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన బాపట్ల జిల్లాలో వ్యవసాయ రంగానికి రూ.12,080 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, ప్రస్తుతం రూ.7,416 కోట్లు రుణాలు ఇచ్చామన్నారు. పొదుపు మహిళలు జిల్లాలో అధికంగా ఉన్నందున 32,479 సంఘాలకు రుణం ఇవ్వాలని కలెక్టర్‌ చెప్పారు. 10,957 సంఘాలకు రుణాలు మంజూరు కాగా, ప్రస్తుతం 3,979 సంఘాలకు మాత్రమే రూ.604.02 కోట్లు ఇవ్వడం ఏంటని కలెక్టర్‌ ఆరా తీశారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ అభిషేక్‌, ఎల్‌డీఎం శివకృష్ణ, నాబార్డ్‌ డీడీఎం రవికుమార్‌, యూనియన్‌ బ్యాంక్‌ రీజనల్‌ మేనేజర్‌ మాధురి, వివిధ జాతీయ బ్యాంకు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

భూసమస్యలపై దరఖాస్తు చేసుకోవాలి

నిషేధిత భూముల జాబితా నుంచి భూమిని తొలగించాలంటే గ్రామ, వార్డు సచివాలయంలో రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దీంతోపాటు వెబ్‌ల్యాండ్‌లో పొరపాట్లు సవరించడానికి, ఐజీఆర్‌ఎస్‌ పోర్టల్‌లో పేర్లు తొలగించడానికి, రెవెన్యూ రికార్డుల్లో భూమి స్వభావాన్ని మార్పు చేయడానికి, భూమి సబ్‌ డివిజన్‌ చేయాల్సి ఉంటే నేరుగా సచివాలయానికి వెళ్లి రూ.50 నుంచి రూ.150 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎఫ్‌ లైన్‌ పిటిషన్‌ (భూమి కొలతలు)కు భూమి కొనుగోలు, పేరు మార్పునకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఈ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే నేరుగా కలెక్టర్‌ వద్దకు వస్తాయన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement