చందాల పేరిట దందా | - | Sakshi
Sakshi News home page

చందాల పేరిట దందా

Sep 13 2025 4:19 AM | Updated on Sep 13 2025 4:19 AM

చందాల

చందాల పేరిట దందా

చందాల పేరిట దందా బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో వసూళ్ల పర్వం సాక్షి ప్రతినిధి, బాపట్ల : అధికారమప్పగిస్తే సంపద సృష్టించి అందరికీ పంచుతానన్న చంద్రబాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక సంపద సృష్టించడం మాని, విచిత్రంగా చందాలివ్వమంటూ యాచన కార్యక్రమాన్ని తెరపైకి తెచ్చారు.తొలుత అమరావతి నిర్మాణానికి చందాల దందా మొదలు పెట్టారు. ఆ తర్వాత ప్రకటించిన అన్నా క్యాంటీన్లకు చందాలు ఇస్తే పేర్లు వేస్తామని బంపరాఫర్‌ కూడా ఇచ్చారు. తరువాత పీ–4 తెరపైకి తెచ్చారు. పేదలందరినీ ఉన్నోళ్లను చేస్తానన్నారు. పోనీ ఆ పథకమైనా సంపద సృష్టించి చేస్తారులే అని ఆశిస్తే దానికీ యాచనలే అజెండా ! డబ్బున్న వారికి పేద కుటుంబాలను దత్తత ఇచ్చి బాగు చేస్తానని చెప్పారు. అదైనా కొంత మెరుగులే అనుకుంటే.. ఇప్పుడు స్థితిమంతులు దొరకలేదంటూ ప్రభుత్వ ఉద్యోగులకే ఆ బాధ్యత అప్పగిస్తున్నారు. తమ వంతు ఎప్పుడొస్తుందోనని బెంబేలెత్తి పోతున్నారు. ఇప్పడు బాపట్ల సముద్ర తీరంలో బీచ్‌ ఫెస్టివల్‌ చేస్తున్నాం.. చందాలివ్వమంటూ కూటమి ప్రభుత్వం వసూళ్ల పర్వానికి తెరతీసింది. జిల్లాలోని బాపట్ల సూర్యలంక, చీరాల ప్రాంతంలోని ఓడరేవు, రామాపురం తీరంలో ఈనెల 26,27,28 తేదీల్లో ఘనంగా నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర పర్యాటకశాఖ, జిల్లా పరిపాలనా విభాగం కలిసి పండుగను చేయాలని ఆదేశించింది. పాట కచేరీలు, ఎగ్జిబిషన్‌, సాంస్కృతిక కార్యక్రమాలు, బీచ్‌ కబడ్డీ, వాలీబాల్‌, హ్యాండ్‌బాల్‌, ఖోఖో ఆటలతోపాటు లేజర్‌షోలు, ఫుడ్‌కోర్టులు నిర్వహించి బీచ్‌ ఫెస్టివల్‌ను హోరెత్తిస్తామని చెబుతోంది. సర్కార్‌ కీర్తిని ఏపీతోపాటు సముద్రం ఆవలవున్న శ్రీలంక వరకూ చాటుతామని ఆర్భాటంగా చెప్పింది. బీచ్‌ పండుగను చూడొచ్చని జనం కూడా సంబరపడ్డారు. తీరా నిధులు మంజూరులో ప్రభుత్వం మెలిక పెట్టింది. రూ. 9 కోట్లు ఖర్చయ్యే ఫెస్టివల్‌కు రూ. 4 కోట్లు మాత్రమే ఇస్తామని చావుకబురు చల్లగా చెప్పింది. మిగిలిన రూ. 5 కోట్ల మొత్తాన్ని చందాలు బాది వసూలు చేసుకోవాలని సూచించింది. బీచ్‌ పెస్టివల్‌ పేరుతో జేబులు నింపుకోవచ్చని భావించిన ఈ ప్రాంతానికి చెందిన కొందరు పచ్చనేతలు, అధికారులు వెనువెంటనే రంగంలోకి దిగారు. రూ. 5 కోట్ల వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. రిసార్ట్‌లు, రైస్‌ మిల్లర్స్‌, బియ్యం వ్యాపారులు, మెడికల్‌ అసోసియేషన్‌, హోటల్స్‌, ఆక్వా, హేచరీస్‌, గోల్డ్‌ వ్యాపార వర్గాలకు రూ. 15 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకూ ఇవ్వాలంటూ హుకుం జారీ చేశారు. మెడికల్‌ అసోషియేషన్‌కు రూ. 15 లక్షలు, రిసార్ట్‌లకు రూ. 50 లక్షలు, రైస్‌మిల్లు, రేషన్‌ వ్యాపారుల అసోసియేషన్లకు రూ. 25 లక్షలు, రియల్టర్లకు రూ. 25 లక్షలు చొప్పున చందా వేసినట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా రూ.10 కోట్లకు పైనే వసూళ్లకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం ఉంది. తీరంలో బీచ్‌ ఫెస్టివల్‌ చేయడం మంచిదే. పర్యాటకులు, స్థానికులు ఆస్వాదిస్తారు కూడా. కానీ ప్రభుత్వ ఖర్చుతో చేయకుండా బలవంతపు వసూళ్లతో అందరి నోళ్లుకొట్టి పండుగలేమిటో ? అంటూ వ్యాపారుల అసోసియేషన్లు గొల్లుమంటున్నాయి. బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో నేరుగా డబ్బులు వసూళ్లు చేస్తే ఆరోపణలు వస్తాయన్న కొందరు అధికారుల సూచనలతో పచ్చ నేతలు రూటు మార్చారు. స్పాన్సర్ల పేరున వసూళ్లకు దిగుదామంటూ పథక రచన చేసినట్లు సమాచారం. ఇప్పటికే వసూళ్ల పర్వం మొదలైనట్లు తెలుస్తోంది.

అర్ధంతరంగా కలెక్టర్‌ బదిలీ

ఈ సమయంలో జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి గురువారం సాయంత్రం అర్ధంతరంగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో వినోద్‌ కుమార్‌ కలెక్టర్‌గా వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26,27,28 తేదీల్లో బీచ్‌ ఫెస్టివల్‌ ప్రభుత్వం ఇచ్చిన రూ. 4 కోట్లుతో జరుగుతుందా? లేక రూ. 10 కోట్ల చందా వసూళ్ల ప్రణాళిక ప్రకారం నడిపిస్తారా? అనేది వేచి చూడాలి.

బలవంతపు వసూలు

వ్యాపారుల మండిపాటు

26,27,28 తేదీల్లో బీచ్‌ ఫెస్టివల్‌

అందరి నోళ్లుకొట్టి పండగ

చిరు వ్యాపారులు బెంబేలు

పచ్చనేతలు, అధికారుల చందాలతో అన్ని వర్గాల వారు బెంబేలెత్తిపోతున్నారు. చిరు వ్యాపారుల అసోసియేషన్లను కూడా వదల్లేదు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న తమపై ఈ భారం ఏమిటి బాబో అన్నా కనికరం చూపడం లేదని ఓ మెడికల్‌ షాపు దుకాణదారుడు ‘సాక్షి’తో వాపోయారు. రూ. లక్షల్లో ఈ వసూళ్లు ఏమిటంటూ బాపట్లకు చెందిన రైస్‌ మిల్లు యజమాని లబోదిబోమన్నారు. చీరాల, బాపట్ల ప్రాంతాల్లోని అందరు వ్యాపారులు బీచ్‌ ఫెస్టివల్‌ చందాలు చూసి జడుసుకుంటున్నారు.

నిధులు మంజూరులో మెలిక

బియ్యం, ఇసుక, బుసక, గ్రానైట్‌, గ్రావెల్‌ అమ్ముకుంటూ నెలకు రూ. కోట్లు గడిస్తున్న పచ్చనేతల నుంచి చందా వసూలు చేయకుండా వ్యాపారులను ఇబ్బంది పెట్టడంపై అన్ని వర్గాలు మండి పడుతున్నాయి. చిరు వ్యాపారులు కుయ్యో మొర్రో అన్నా పచ్చనేతలు, అధికారులు కనికరించడం లేదు. చందా వసూళ్ల కార్యక్రమాన్ని ఆపడం లేదు. స్పందించని వారిపై పైగా అధికారులు పచ్చ నేతలకు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో వారు రాసినంత ముట్టజెప్పాల్సి వస్తోంది.

బీచ్‌ ఫెస్టివల్‌ పేరుతో వసూళ్ల పర్వం

రూ. 9 కోట్లు ఖర్చవుతుందంటున్న

అధికారులు

రూ. 4 కోట్లు ఇస్తామన్న ప్రభుత్వం

మిగిలింది చందాల రూపంలో వసూలు

చేయాలని కూటమి సర్కార్‌ ఆదేశం

రంగంలోకి దిగిన పచ్చనేతలు,

అధికారులు

వెనకేసుకోవడానికి మాస్టర్‌ ప్లాన్‌

రూ. 10 కోట్ల వసూళ్లకు ప్రణాళిక

రిసార్ట్స్‌, రైస్‌ మిల్లర్స్‌, రేషన్‌ డీలర్స్‌,

రియల్టర్ల నుంచి భారీగా వసూళ్లు

ఒక్కొక్క విభాగం నుంచి రూ. 25 లక్షల

నుంచి రూ. 50 లక్షల దాకా వసూలు

చందాల పేరిట దందా 
1
1/1

చందాల పేరిట దందా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement