
క్రీడా స్ఫూర్తితో ఆటంకాలను అధిరోహించాలి
● ఇన్‌చార్జి వీసీ కె.గంగాధరరావు
● క్రీడాకారులకు క్యాష్ అవార్డుల ప్రదానం
పెదకాకాని(ఏఎన్‌యు): క్రీడా స్ఫూర్తితో జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిరోహించాలని వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. వర్సిటీ పరిధిలో వివిధ క్రీడల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు శుక్రవారం వ్యాయామ విద్య విభాగం ఆధ్వర్యంలో నగదు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి వ్యాయామ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య పీపీఎస్ పాల్ కుమార్ అధ్యక్షత వహించారు.
నగదు పురస్కారాలు అందజేత
వర్సిటీ పరిధిలో 2024 –25 లో సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీల మహిళల వెయిట్ లిఫ్టింగ్ 76 కేజీల విభాగంలో బంగారు పతకం, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీలలో సిల్వర్ మెడల్ సాధించిన తెనాలి ఏఎస్‌ఎన్ కళాశాలకు చెందిన టి రేణుకకు రూ.40 వేల నగదు పురస్కారాన్ని అందజేశారు. 71 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన గుంటూరు మహిళా కళాశాలకు చెందిన బి. నానికి రూ.12,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ 61 కేజీల విభాగంలో సిల్వర్ మెడల్, ఆల్ ఇండియా ఇంటర్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో బ్రాంజ్ మెడల్ సాధించిన నిడుబ్రోలు పీబీఎన్ కళాశాలకు చెందిన డి. మౌలాలీకి రూ.32,500, సౌత్ వెస్ట్ జోన్ అంతర్ వర్సిటీ పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 96 కేజీల విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించిన నగరంలోని ఎస్‌వీఆర్‌ఎం కళాశాల విద్యార్థి ఎ.అరుణ్ బాబుకు రూ.10,000 నగదు అందజేశారు.