
ప్రజా కళలతోనే సామాజిక చైతన్యం
తెనాలి: కళలు జనజీవన స్రవంతిలో భాగమని ప్రజాకళలతోనే దోపిడీ వ్యవస్థను ఎదరించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావొచ్చని, అలాంటి కళారూపాలను తయారుచేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ రామకృష్ణ అన్నారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి, గుంటూరు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ అధ్యక్షత వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ భారత కమ్యూనిస్టుపార్టీ స్వాతంత్రోద్యమ కాలంలో అంటే 1925 డిసెంబర్ 26న కాన్పూరులో ఆవిర్భవించిందని గుర్తుచేశారు. పార్టీ శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే క్రమంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర 28వ మహాసభలు ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో జరగనున్నాయని తెలిపారు. తొలిరోజున జరిగే ప్రదర్శనలో వెయ్యిమంది కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తారని తెలిపారు. గుంటూరు జిల్లా నుండి కూడా అధిక సంఖ్యలో కళారూపాలతో కళాకారులు పాల్గొనాలని అన్నారు. సభాధ్యక్షుడు బొల్లిముంత కృష్ణ మాట్లాడుతూ ప్రజానాట్యమండలికి, కళాకారులకు తెనాలి పుట్టినిల్లుగా చెప్పారు. గుంటూరు జిల్లా నుండి 100 మంది కళాకారులు ప్రదర్శనలో పాల్గొంటారని అన్నారు. సీనియర్ కళాకారుడు, సమన్వయకర్త కనపర్తి బెన్‌హర్ మాట్లాడుతూ తెనాలి నుండి ‘పోస్టర్’ నాటికతో ఒంగోలులో జరిగే కళాప్రదర్శనలో పాల్గొంటామని చెప్పారు. ప్రజానాట్యమండలి గుంటూరు జిల్లా కార్యదర్శి ఆరేటి రామారావు, నీలాంబరం, మల్లికార్జునరావు, రచయిత దేవరకొండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో సీపీఐ రాష్ట్ర మహాసభలు
ప్రజానాట్యమండలి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్.రామకృష్ణ