
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిద్దాం
బాపట్ల: ప్రభుత్వ పాఠశాలలో బడి ఈడు కలిగిన పిల్లలు అందర్నీ చేర్పించే బాధ్యత ప్రభుత్వ ఉపాధ్యాయులు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు కోరారు. ఆదివారం బాపట్ల జిల్లా ప్రజా సంఘాల కార్యాలయంలో సంఘ జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఇందులో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సమాజంలో నైతిక, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రభుత్వ విద్యారంగం బలోపేతం కావాలని కోరారు. దీనికి ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రత్యేక కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటులో విద్యార్థుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ బడిపై సమాజానికి, తల్లిదండ్రులకి నమ్మకం కలిగించే విధంగా ఉపాధ్యాయులు పని విధానాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులంతా జూలై మొదటి వారంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కోసం ప్రత్యేక క్యాంపెయిన్ చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు జడ వినయ్ కుమార్ మాట్లాడుతూ బదిలీల చట్టం ద్వారా జరిగిన బదిలీల, ప్రమోషన్లలో అసంబద్ధాలను సరిజేయడానికి యూటీఎఫ్ అన్ని సంఘాల్ని కలుపుకొని పెద్దఎత్తున పోరాటం చేసిందని, తద్వారా మెజారిటీ ఉపాధ్యాయులకు న్యాయం చేశామని తెలిపారు. బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యారంగ వికాసం కోసం, ఉపాధ్యాయుల సంక్షేమం పనిచేసే సంఘం యూటీఎఫ్ మాత్రమేనని తెలిపారు. ఉపాధ్యాయులంతా సభ్యులుగా చేరాలని కోరారు. బదిలీలు, ప్రమోషన్లలో ఉపాధ్యాయులకు ఎదురైన ప్రతి సమస్యను చిత్తశుద్ధితో కృషిచేసి పరిష్కరించామని చెప్పారు. అనంతరం ఊరి బడిలో పిల్లల్ని చేరుద్దామనే వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో గౌరవాధ్యక్షులు పాపారావు, సహాధ్యక్షులు బిక్షాల బాబు, కోశాధికారి హరిప్రియ, జిల్లా కార్యదర్శి ఎం. వెంకటేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్స్, ఆడిట్ కమిటీ సభ్యులు, మండల అధ్యక్ష ప్రధాన, కార్యదర్శులు పాల్గొన్నారు.
యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు
ఎన్.వెంకటేశ్వర్లు