
చిరుద్యోగులకు చంద్ర గ్రహణం
● కక్ష సాధింపులకు పాల్పడుతున్న కూటమి సర్కార్ ● జిల్లాలో యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఆశా వర్కర్లకు ఉద్వాసన ● మధ్యాహ్న భోజన నిర్వాహకులు, శానిటేషన్ వర్కర్లను వదలని వైనం ● నెలల తరబడి జీతాలు చెల్లించకుండానే తొలగింపు ● ఎండీయూ వాహనాలు రద్దు ● వందల మంది ఆపరేటర్ల పొట్టపై కొట్టిన ప్రభుత్వం ● పాలకులు తీరుపై మండిపడుతున్న చిరుద్యోగులు
బాపట్ల టౌన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు చిరుద్యోగుల పొట్ట కొడుతోంది. ఒక్కొక్కరికీ ఉద్వాసన పలుకుతోంది. ఉద్యోగాలను ఊడబెరుకుతూ రోడ్డున పడేస్తోంది. అధికారంలోకి రాక మునుపు వలంటీర్లను కొనసాగిస్తామని, నెలకు రూ.10 వేల చొప్పున జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చాక వారిని తొలగించింది. డ్వాక్రా సంఘాల యానిమేటర్లను మోసం చేసింది. పొదుపు సంఘాలు తన మానసపుత్రికలు అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే పలువురిని తొలగించారు.వీరితో పాటు వందల సంఖ్యలో ఆశా వర్కర్లు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు, శానిటేషన్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇంటింటికీ రేషన్ సరఫరా చేసే ఎండీయూ ఆపరేటర్లు... ఇలా అన్ని రంగాలకు చెందిన చిరుద్యోగులను విధుల నుంచి తొలగించారు.
జె.పంగులూరు మండలంలో– 21, యద్దనపూడి–10, మార్టూరు– 14, అద్దంకి –8, పిట్టలవానిపాలెం–1, చెరుకుపల్లి –3, నగరం– 21, చుండూరు– 12 మంది చొప్పున జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మంది యానిమేటర్లను విధుల నుంచి తొలగించి వారిస్థానంలో పచ్చనేతల భార్యలకు అవకాశం కల్పించారు.
● జిల్లాలోని 435 గ్రామ సచివాలయాల పరిధిలోని 5220 మంది వలంటీర్లను తొలగించారు.
● కేంద్రప్రభుత్వం సహకారంతో నిర్వహించే ఉపాధిహామి పథకంలోకి 459 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను నిర్దాక్షిణ్యంగా విధుల నుంచి తొలగించారు.
● గత ప్రభుత్వం ఆధ్వర్యంలో వైన్‌షాపుల్లో సేల్స్‌మెన్, సూపర్‌వైజర్లుగా జిల్లాలోని 117 వైన్‌షాపుల్లో 468 మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే వారిని తొలగించారు.
● పచ్చపార్టీ వారికి అవకాశాలు కల్పించేందుకు ఇంటింటికి తిరిగి వైద్యసేవలు అందించే 250 మంది ఆశావర్కర్లను తొలగించారు.
● ప్రభత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నిర్వాహకులు, హెల్పర్లుగా విధులు నిర్వహించే వారిలో సుమారు 1500 మందిని కుట్రపూరితంగా విధుల నుంచి తొలగించారు.
● 173 మంది విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లను తొలగించారు.
● ఇంటింటికీ రేషన్ అందించే ఎండీయూ వాహనాల ఆపరేటర్లు, హెల్పర్లను 600 మందికి పైగా విధుల నుంచి తొలగించారు.

చిరుద్యోగులకు చంద్ర గ్రహణం

చిరుద్యోగులకు చంద్ర గ్రహణం