
ప్రభుత్వం కొనాల్సిందే
పొగాకు మొత్తం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: ప్రభుత్వం డొంకతిరుగుడు ప్రకటనలతో రైతులను మభ్యపెట్టడం మాని వారి నుంచి బ్లాక్‌బర్లీ పొగాకును తక్షణం కొనుగోలు చేయాలని వైఎస్సార్‌సీపీ పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త గాదె మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... పొగాకు కంపెనీల మెడలు వంచి సరకు కొనిపించాలన్నారు. లేదంటే ప్రభుత్వమే టుబాకో బోర్డు లేదా మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. తద్వారా రైతులను ఆదుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం పాము చావక, కట్టె ఇరగక అనే చందంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులను మభ్యపెట్టేలా ప్రకటనలతో సరిపెట్టకుండా వారిని చిత్తశుద్ధితో ఆదుకోవాలన్నారు. జిల్లాలో 99 శాతం బ్లాక్‌బర్లీని పర్చూరు నియోజకవర్గ రైతులు సాగుచేశారన్నారు. మొత్తం కొనుగోలు చేస్తామని ఆశపెట్టి తీరా పంట చేతికొచ్చాక కంపెనీలు మోసగించాయన్నారు. పొలాల్లో పొగాకు పెట్టుకొని వానకు తడుస్తుంటే అన్నదాతలు తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో రైతుకంట కన్నీరు చూడలేదన్నారు. రైతులకు అన్నివిధాలా సహాయం అందించేందుకు రైతుభరోసా కేంద్రాలు, సచివాలయాలు నెలకొల్పారన్నారు. వలంటీర్లు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా నిలిచారని తెలిపారు. ఇప్పుడు అన్ని వ్యవస్థలను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసి ప్రజల ఉసురు పోసుకుంటోందని గాదె విమర్శించారు. ప్రభుత్వం కేవలం ప్రకటనలతో ప్రజలను వంచించకుండా తక్షణం పొగాకు కొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదన్నారు. రైతులతో కలిసి పోరాటానికి సిద్ధ పడతామన్నారు.
కంపెనీల మెడలు వంచి బ్లాక్‌బర్లీ కొనిపించండి లేదంటే ప్రభుత్వమే పొగాకు బోర్డు లేదా మార్క్‌ఫెడ్ ద్వారా కొనాలి రైతులను మభ్యపెట్టే చర్యలు ఆపాలి పొగాకు కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలి వ్యవసాయశాఖ వద్ద అన్ని లెక్కలూ ఉన్నాయి పర్చూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త గాదె మధుసూదన్ రెడ్డి