
రాజకీయ కక్షతో అక్రమ అరెస్టులు అన్యాయం
బాపట్ల: రాజకీయ కక్షతోనే కూటమి ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేసిందని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బాపట్లలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు కక్ష రాజకీయాల వల్ల రాష్ట్రంలో వ్యవస్థలు పూర్తిగా దెబ్బతింటున్నాయన్నారు. మద్యం కేసు అంటూ ఎటువంటి ఆధారాలు లేకపోయినా తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ప్రతిపక్ష పార్టీపై కక్ష సాధింపులే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి ప్రైవేట్ సైన్యంలా వాడుకుంటూ రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన అధికారులను వేధించాలనే లక్ష్యంతో అక్రమంగా మద్యం కేసును బనాయించిందన్నారు. న్యాయస్థానాల ఆదేశాలను ధిక్కరిస్తూ పార్టీ నాయకులు, అధికారులను వేధింపులకు గురిచేస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోనే లిక్కర్ స్కాం జరిగిందన్నారు. వారి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దుర్మార్గానికి పాల్పడుతుందన్నారు.