చినగంజాం: నియోజకవర్గంలో ఇటీవల మృతిచెందిన.. ఆత్మహత్యాయత్నం చేసిన పొగాకు రైతు కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మంగళవారం నియోజకవర్గానికి రానున్నారు. తొలుత వీరన్నపాలెంలో అప్పుల బాధతో మృతి చెందిన ఉప్పుటూరు సాంబశివరావు కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అనంతరం ఇంకొల్లు మండలం దుద్దుకూరులో రుణాల బాధతో ఆత్మహత్యాయత్నం చేసుకొని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బిల్లా శ్యాంసన్ కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఒంగోలు కిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శ్యాంసన్‌తో మాట్లాడతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన వెంట వైఎస్సార్ సీపీ పర్చూరు ఇన్‌చార్జ్ గాదె మధుసూదనరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు భవనం శ్రీనివాసరెడ్డి, ఆయా మండలాల కన్వీనర్లు పాల్గొంటారన్నారు. ఆయా కార్యక్రమాల్లో నియోజక వర్గంలోని పార్టీ నాయకులు హాజరు కావాలని కోరారు.
ఘనంగా బుద్ధ జయంతి
అమరావతి: బుద్ధ జయంతి వేడుకలను ధాన్యకటక బుద్ధవిహార ట్రస్టు చైర్మన్ డాక్టర్ వావిలాల సుబ్బారావు ఆధ్వర్యంలో స్థానిక పాత మ్యూజియంలోని మహా చైత్యం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా డాక్టర్ వావిలాల మాట్లాడుతూ 2569 ఏళ్ల క్రితం గౌతమ బుద్ధుడు నడయాడిన అమరావతి నగరం దక్షిణ భారతదేశంలో బౌద్ధ ధర్మానికి కేంద్ర బిందువుగా కొనసాగిందన్నారు. సాక్షాత్తు గౌతమ బుద్ధుడు తన మొదటి కాలచక్ర క్రతువులు అమరావతి నుంచే ప్రారంభించారని బౌద్ధ సాహిత్యకారుల నమ్మకమన్నారు. అందుకే ఇక్కడ బుద్ధుని అస్థికలతో కూడిన మహా చైత్యం అనే గొప్ప కట్టడాన్ని నిర్మించారన్నారు. తొలుత మహాస్థూపం వద్ద ప్రత్యేక పూజాకార్యక్రమాలు, బౌద్ధమత ప్రార్థనలు నిర్వహించారు. నిమ్మా విజయసాగర్ బాబు, కోలా వెంకటేశ్వర రావు, యోగాశ్రమ నిర్వాహకులు కోనూరు అప్పారావు ప్రపుల్ల రాణి, గిరి స్వామి, పలువురు బౌద్ధమతస్తులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పల్నాడు జిల్లా పరిధిలో 30 పరీక్ష కేంద్రాలలో మొదటి సంవత్సరం పరీక్షకు 93.34 శాతం, ద్వితీయ సంవత్సరం పరీక్షకు 87.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు సెకండ్ లాంగ్వేజ్ పరీక్షకు సెట్–3 ప్రశ్నపత్రాన్ని లాటరీ ద్వారా ఎంపిక చేశారు. జూనియర్ ఇంటర్‌కు 3,132 మంది జనరల్ విద్యార్థులకుగాను 2,945మంది హాజరయ్యారు. 154 మంది ఒకేషనల్ విద్యార్థులకుగాను 122మంది హాజరయ్యారు. మధ్యాహ్నం నిర్వహించిన ద్వితీయ సంవత్సరం పరీక్షకు జనరల్ విద్యార్థులు 413 మంది నమోదు కాగా 364 మంది, ఒకేషనల్ విద్యార్థులు 70మందికి గాను 61 మంది హాజరయ్యారు. జిల్లా పరిధిలో ఎటువంటి మాల్‌ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి కె.సుచరిత తెలిపారు.
సమస్యలను వారంలో పరిష్కరిస్తాం
కొల్లిపర(తెనాలి): తమకు అందిన ప్రతి సమస్యను వారంలో పరిష్కరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో మంత్రి సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, తెనాలి సబ్‌కలెక్టర్ వి.సంజనా సింహతో కలిసి 200 వినతులు స్వీకరించారు. వీటిలో అత్యధికంగా బియ్యం కార్డుల దరఖాస్తులే ఉన్నాయి. అనంతరం మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా కోటి 46 లక్షల మందికి రేషన్‌కార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.

నేడు పొగాకు రైతులకు మేరుగ పరామర్శ