
అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు మంజూరు
కలెక్టర్ జె. వెంకట మురళి
బాపట్ల టౌన్: అర్హులైన ప్రతి ఒక్కరికీ నివేశన స్థలాలు అందజేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జె. వెంకట మురళి ఆదేశించారు. రెవెన్యూ అంశాలపై బుధవారం రాష్ట్ర సీసీఎల్‌ఏ ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి జిల్లా కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్ల జిల్లాలో ఇంటి స్థలాలు కావాలని పేదల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి, సమగ్ర నివేదికను ఆన్‌లైన్‌లో పొందుపరిచామని తెలిపారు. అనంతరం ఆయన కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బాపట్లలో 50,484 పాట్లు ఉండగా, అందులో 24,241 ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హుల జాబితా పరిశీలించాలని ఆయన చెప్పారు. బాపట్ల జిల్లాలో నమోదైన 22–ఏ కేసుల వివరాలను తెలుసుకుని, సంబంధిత దస్త్రాలను పరిశీలించాలని ఆదేశించారు. ప్రస్తుతం గుర్తించిన 108 కేసులను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని తెలిపారు. పెండింగ్ కేసులను తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. రెవెన్యూ రికార్డు రూములు లేని ప్రాంతాల్లో వాటి నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనను పంపాలని ఆదేశించారు. ఇంటి స్థలం కోసం వచ్చిన దరఖాస్తులు, అర్హులు, అనర్హులు, ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించి నివేదిక ఇవ్వాలని చెప్పారు. ముందస్తుగా ప్రభుత్వ ఖాళీ భూములను గుర్తించే ప్రక్రియకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఖాళీ ప్లాట్లపై క్షేత్రస్థాయి పరిశీలించి, తదుపరి నివేదికలో పొందుపరచాలని తెలిపారు.
రూ. 97.52 కోట్లతో సూర్యలంక బీచ్ అభివృద్ధి
సూర్యలంక బీచ్‌ను రూ. 97.52 కోట్లతో అభివృద్ధి చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద బీచ్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని తెలిపారు. బీచ్ అభివృద్ధికి గానూ టూరిజం కార్పొరేషన్‌కు 25 ఎకరాలు కేటాయించినట్లు చెప్పారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, సర్వే ల్యాండ్స్ ఏడీ కనకరాజు, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్డీఓలు గ్లోరియా, చంద్రశేఖర్ రామలక్ష్మి, కలెక్టరేట్ ఏవో సీతారత్నం, టూరిజం కార్పొరేషన్ డీఈ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.