
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
బాపట్ల టౌన్: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. పోలీస్ పేరెడ్ గ్రౌండ్‌లో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి 69వ సమావేశంలో 2014 సెప్టెంబర్‌న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 21వ తేదీని అంతర్జాతీయ దినోత్సవం జరపాల్సిందిగా ప్రతిపాదించారని గుర్తు చేశారు. దీన్ని 177 దేశాలు ఆమోదించాయని తెలిపారు. 2015 నుంచి ఏటా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. యోగా వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలపై నెల రోజుల పాటు విస్తృతంగా అవగాహన కల్పిస్తామని చెప్పారు. జూన్ 21వ తేదీన వైజాగ్‌లో ఐదు లక్షల మందితో జరిగే యోగా కార్యక్రమంలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి పాల్గొంటారని వెల్లడించారు. యోగాంధ్ర క్యాంపెయిన్‌లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల శారీరక, మానసిక ధైర్యం వస్తుందని చెప్పారు. జిల్లాలోని 17 లక్షల మందికి యోగాంధ్ర చేరే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు. జూన్ 21న సూర్యలంక, రామాపురం బీచ్‌లో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ వారి జీవన శైలిలో యోగా ఒకటిగా చేర్చుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు, పర్చూరు శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు, చీరాల శాసనసభ్యులు ఎం. ఎం. కొండయ్య పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం