
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
సత్తెనపల్లి: కారు, ఆటో ఢీకొన్న ఘటనలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం.. సత్తెనపల్లికి చెందిన సీపీఎం రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు గద్దె చలమయ్య, ఆయన భార్య ఐద్వా రాష్ట్ర నాయకురాలు గద్దె ఉమశ్రీ కారులో బుధవారం గుంటూరు వెళ్లి తిరిగి సత్తెనపల్లి వస్తున్నారు. అదే సమయంలో సత్తెనపల్లి నుంచి ఆటోలో పరుచూరి రాధ, పరుచూరి ఉషశ్రీ, శ్యాం సాయి, ఆటో డ్రైవర్ బలుసు పాటి సాంబశివరావులు గుంటూరు వెళుతున్నారు. ఈక్రమంలో మండలంలోని కంటెపూడి రిథమ్ హోటల్ సమీపంలో రెండు వాహనాలు ఢీ కొన్నాయి. ఆటో పూర్తిగా రోడ్డు పక్కన కంపలోకి పల్టీకొట్టింది. కారు ముందు భాగం ధ్వసమైంది. కారులోని ఇద్దరికి, ఆటోలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గద్దె చలమయ్య, ఉమాశ్రీలను చికిత్స నిమిత్తం సత్తెనపల్లికి, మిగిలిన నలుగురిని గుంటూరు తరలించారు. సత్తెనపల్లి రూరల్ పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరిస్తున్నారు.