
ఇసుకాసురుల పైసాచికం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: చీరాల ప్రాంతంలో పచ్చ నేతల ఇసుక దందా యథేఛ్ఛగా సాగుతోంది. ఓడ రేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి పేరుతో అనుమతులు పుట్టించారు. దీని మాటున ఇసుకను బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నా.. పచ్చనేతలు సామాన్యులను ఒక్క ట్రాక్టర్‌ను కూడా తీసుకు వెళ్లనీయడం లేదు. అవసరమైన వారు పచ్చ నేతలకు ఆర్డర్ పెట్టుకొని అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తోంది
బుసకతో మస్కా
స్థానికంగా ట్రాక్టర్ ఇసుకను రూ.2 వేలకు విక్రయిస్తున్న నేతలు పర్చూరు, బాపట్ల నియోజకవర్గాల్లో రూ. 4 నుంచి రూ.5 వేల వరకూ విక్రయిస్తున్నారు. ఇంటి నిర్మాణాలతో పాటు పునాదులు పూడ్చుకునేందుకు పలువురు గత్యంతరం లేక అధిక ధరలకు కొంటున్నారు. ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న రియల్ వెంచర్లకు రియల్టర్లు పచ్చ నేతల వద్దే కొనుక్కోవాల్సి వస్తోంది. ఇదే అవకాశంగా ధరలు పెంచి అమ్ముతున్నారు. మరోవైపు పచ్చనేతలు బుసక, సముద్ర తీరం ఇసుకను కూడా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి ఇది నిర్మాణాలకు పనికి రాదు. కానీ పచ్చనేతలు మాత్రం ఆ రెండింటిని విక్రయించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
కాలువ గట్లు మాయం
వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద రహదారి నిర్మాణం పేరుతో అనుమతులు తీసుకున్న పచ్చ నేతలు ఇక్కడి నుంచే కాకుండా ఈపూరిపాలెం ప్రాంతంలో ఉన్న స్ట్రెయిట్ కట్ కాలువ గట్ల నుంచి అక్రమంగా ఇసుకను తరలించి అమ్ముకుంటున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలోని ప్రధాన సాగునీరు, మురికి నీటి కాలువల గట్లు కొల్లగొడుతున్నారు. పచ్చనేతల ఇసుక తరలింపుతో వేటపాలెం, ఈపూరిపాలెం ప్రాంతాల్లోని కాలువ గట్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికారులు కూడా భయపడి నోరు మెదపడంలేదన్న విమర్శలున్నాయి.
ఉచితం మాట ఉత్తిదే..
ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే చెప్పినా పచ్చనేతలు మాత్రం తీసుకు వెళ్లనివ్వడంలేదు. తామే సరఫరా చేస్తామంటూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మరోవైపు అందుబాటులో ఉన్న ఇసుకను తీసుక వెళ్లేందుకు కొందరు ప్రయత్నించినా పచ్చనేతలు అడ్డు పడుతున్నారు. పోలీసులకు చెప్పి వాహనాలను పట్టించి కేసులు పెట్టిస్తున్నారు. దీంతో ప్రజలు నేరుగా ఇసుక తీసుక వెళ్లేందుకు సాహసించడం లేదు. పచ్చ నేతల వద్ద అధిక ధరలకు కొని నష్టపోతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వ జోక్యం చేసుకొని పచ్చనేతల ఇసుక దందాను కట్టడిచేసి ఇసుక అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు.
పచ్చనేతకు కప్పం
చీరాల ప్రాంతంలో ఇసుక దందా వ్యవహారంలో ఈ ప్రాంత పచ్చనేతకు ట్రిప్పులవారీ కప్పం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఇసుక ట్రాక్టర్‌కు రూ. 900 చెలిస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన నిత్యం తరలించే వందలాది ఇసుక తరలింపు వాహనాలకు సంబంధించి రోజుకు రూ. లక్షల్లోనే పచ్చనేతకు కప్పం చెల్లిస్తున్నట్లు సమాచారం.
పందిళ్లపల్లి, ఈపూరిపాలెం నుంచి ఇసుక అక్రమ రవాణా జాతీయ రహదారి పేరుతో అనుమతులు బ్లాక్ మార్కెట్‌కు తరలించి అధిక ధరలకు అమ్మకం
అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల్లో తవ్వకాలు
నియోజకవర్గంలో అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల నుంచి పచ్చనేతలు పెద్ద ఎత్తున ఇసుకను తరలించి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. గతంలో చీరాల ఎమ్మెల్యే, బాపట్ల ఎంపీ అనుచరుల మధ్య ఇసుక అక్రమ రవాణా విషయంలో గొడవలు తలెత్తాయి. ఏకంగా ఎంపీ వర్గీయుల జేసీబీని ఎమ్మెల్యే అనుచరులు తగల బెట్టారు. దీనిపై కేసులు కూడా నమోదు కావడంతో కొందరు క్షేత్రస్థాయి అధికారులను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఇంత జరిగినా తవ్వకాలు ఆగలేదు.

ఇసుకాసురుల పైసాచికం