
సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి
డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొలుసు పార్థసారథి
సాక్షి ప్రతినిధి, బాపట్ల /బాపట్ల టౌన్: అధికారులు, ప్రజాప్రతినిధుల సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమని జిల్లా ఇన్‌చార్జి మంత్రి, రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. జిల్లా అభివృద్ధి మండలి సమీక్ష సమావేశం బుధవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జల వనరులు, వ్యవసాయ, జాతీయ ఉపాధి పథకం, పర్యాటక రంగం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయడమనే లక్ష్యంతో అధికారులు పని చేయాలని చెప్పారు. వేసవి కాలం ముగిసే వరకు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. నీటి తీరువాకు వడ్డీని ప్రభుత్వం రద్దు చేసిందని, ఆ మేరకు డీఆర్సీలో కమిటీ ఆమోదించి తీర్మానం చేసినట్లు మంత్రి ప్రకటించారు. వర్షాలు రాకముందే పంట కాల్వల పూడికతీత, మరమ్మతులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఏడాది వర్షాలు ముందుగా వచ్చే అవకాశం ఉందని, దీనికి అనుగుణంగా పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయాలని చెప్పారు. ఉపాధి హామీ పథకం కింద గత ఏడాది రూ.20 కోట్ల నిధులు మురిగిపోవడంపై అధికారులను నిలదీశారు. పొగాకు పంట అధికంగా సాగు చేయాలని కంపెనీలు ఒత్తిడి చేసి, దిగుబడి వచ్చిన తర్వాత రైతులను వదిలేయడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బ్లాక్ బర్లీ పొగాకును కొనిపించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
చెరువుల కట్టలను బలోపేతం చేయాలి
రైతుల నుంచి నీటి తీరువాకు వడ్డీని వసూలు చేయరాదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. చెరువుల పూడికతీత పనుల్లో భాగంగా కట్టలను బలోపేతం చేయాలని తెలిపారు. గుండ్లకమ్మ నదిపై మల్లవరం ప్రాజెక్ట్ గేట్లు పూర్తిగా మరమ్మతులు చేయాలని, నిధులు తెప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పారు. పమిడిమర్రు ఎత్తిపోతల పథకం అంచనాలను రూపొందించాలని ఆదేశించారు.
కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలి
ఎత్తిపోతల పథకాలు, కాలువల మరమ్మతు పనులు త్వరితగతిన పూర్తిచేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ చెప్పారు. నీటి తీరువా వసూలులో భూమి అమ్మినవారి పేర్లు కూడా ఆన్‌లైన్‌లో చూపిస్తున్నాయన్నారు. తద్వారా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, వాటిని నివారించాలని అధికారులకు సూచించారు.
మురిగి పోయిన జల జీవన్ మిషన్ నిధులు
జల జీవన్ మిషన్ కింద రూ.532.39 కోట్లు పనులు చేయకపోవడంతోనే నిధులు మురిగిపోయాయని బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ అన్నారు. 1,080 పనులు నిలిచిపోవడంపై ఆయన అధికారుల్ని ప్రశ్నించారు.
చిత్తశుద్ధితో పని చేస్తున్న యంత్రాంగం
ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయడానికి యంత్రాంగం చిత్తశుద్ధితో పని చేస్తోందని కలెక్టర్ జె. వెంకట మురళి తెలిపారు. స్వదేశీ దర్శి– 2 కింద సూర్యలంక బీచ్‌ని అభివృద్ధి చేస్తామని, కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.97 కోట్లు పర్యాటకానికి నిధులు విడుదలయ్యాయని తెలిపారు.
పొగాకు రైతులను ఆదుకోవాలి
పొగాకు పంటను రైతుల వద్ద నుంచి కంపెనీలు కొనుగోలు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్చూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు కోరారు. సమావేశంలో గుంటూరు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ హెనీ క్రిస్టీనా, బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్రవర్మ, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు, చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య, జిల్లా రెవెన్యూ అధికారి జి. గంగాధర్ గౌడ్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

సమష్టి కృషితోనే జిల్లా అభివృద్ధి