
నూతన రథం.. స్వామికి అంకితం
● ఘనంగా పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి రథోత్సవం ● సంవత్సరాల తర్వాత రథంపై దర్శనమిచ్చిన స్వామివారు ● ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడి
చీరాల అర్బన్: పట్టణంలోని పేరాలలో వేంచేసియున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి రథోత్సవం సోమవారం రాత్రి విద్యుత్ దీపాల అలంకరణలో వైభవోపేతంగా సాగింది. స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తుల సహకారంతో నూతన రథాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డితో పాటు ఎమ్మెల్యే ఎంఎం మాలకొండయ్యకు దేవస్థాన అధికారులు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి దేవదాయ శాఖ కృషి చేస్తుందన్నారు. అంకితభావంతో సేవలందిస్తున్న అధికారులను అభినందించారు. వేగంగా విస్తరిస్తున్న చీరాల పట్టణానికి ఆధ్యాత్మికంగా కేంద్రంగా ఉన్న పునుగు రామలింగ మల్లేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి మరింత సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన రథానికి మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల శివనామస్మరణల నడుమ రథాన్ని ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పెద్ద రథంపై ఉత్సవ మూర్తులు ఊరేగుతూ దర్శనమివ్వడంతో తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. రథోత్సవం సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.