
మహిళను కబళించిన లారీ
చినగంజాం: ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇరువురిని వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్ర గాయాలపాలైన సంఘటన సోమవారం చినగంజాం జాతీయ రహదారిపై కడకుదురు వద్ద చోటుచేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. ఈపూరుపాలెం గ్రామం చేనేత పురికి చెందిన కొండ్రుపాటి ప్రభుదాసు అతనితో కలిసి అదే గ్రామానికి చెందిన కారంపూడి పద్మ(45) ఫంక్షన్‌లకు వంట పనిచేస్తుంటారు. ఈ క్రమంలో చినగంజాం వెంకటేశ్వర కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన వివాహ ఫంక్షన్‌లో వంట చేసి తిరిగి వెళుతున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై ఎంత్రీ హోటల్ సమీపంలోకి వెళ్లగానే.. వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొట్టడంతో ఇరువురు రోడ్డుపై పడిపోయారు. తలకు తీవ్ర గాయంకాగా పద్మ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రభుదాసుకు తీవ్ర గాయాలు కావడంతో 108 వాహనంలో చీరాల వైద్యశాలకు తరలించారు. అదే సమయంలో అటుగా వెళుతున్న చినగంజాం తహసీల్దార్ జీవిగుంట ప్రభాకరరావు పరిస్థితి గమనించి పోలీసులకు, అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్‌ఐ శీలం రమేష్.. శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతురాలి భర్త భిక్షాలు చేనేత కార్మికుడు కాగా అతడు గతంలోనే మృతి చెందాడు. ఆమె కుమార్తె శివపార్వతి వివాహితురాలు. తల్లి మృతితో సంఽఘటనా స్థలానికి వచ్చిన ఆమె భోరున విలపించడం చూపరులను కలచివేసింది.
వెనుక నుంచి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో మృతి వాహనం నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు